విజయవంతంగా ముగిసిన మహాజాతర
తిరిగి వనంలోకి సమ్మక్క సారలమ్మ,
పగిడిద్దరాజు, గోవిందరాజులు
చివరి రోజున పోటెత్తిన భక్తులు
వనదేవతలను దర్శించుకున్న
స్పీకర్ గడ్డం ప్రసాద్, ఎంపీ వద్దిరాజు తదితరులు
దర్శనాల అనంతరం భక్తుల తిరుగు ప్రయాణం
ఆర్టీసీ ప్రాంగణం వద్ద కిక్కిరిసిన క్యూలైన్లు
జాతర విజయవంతానికి సహకరించిన
అందరకీ మంత్రి సీతక్క ధన్యవాదాలు
మేడారం, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 24 : ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం మహాజాతర శనివారం విజయవంతంగా ముగిసింది. గిరిజన వనదేవతా మూర్తులైన సమ్మక్క సారలమ్మలు కొలువుదీరిన గద్దెలపై నుండి తిరిగి వనంలోకి ప్రవేశించారు. గత మూడు రోజులుగా భక్తులకు దర్శనాలు కల్పించి వారి కోరికలను కొంగుబంగారంగా తీర్చే సమ్మక్క సారలమ్మలను గిరిజన సాంప్రదాయాల ప్రకారం వారి గద్దల వద్ద ప్రత్యేక పూజలను నిర్వహించిన గిరిజనులు.. సమ్మక్కను శనివారం సాయంత్రం 6:40 నిమిషాలకు డోలు సప్పులతో ఘనంగా ఊరేగింపుగా చిలకల గట్టుకు తీసుకెళ్లి ప్రతిష్ట చేశారు. దీంతో ఈ మహా ఘట్టం విజయవంతంగా పూర్తయింది. సమ్మక్క దేవతను సమ్మక్క ప్రధాన పూజారి కొక్కెర కృష్ణయ్య ప్రత్యేక పూజలను నిర్వహించి కుంకుమ భరణి రూపంలో తీసుకెళ్లి మేడారంలోని చిలకలగుట్టపై తిరిగి ప్రతిష్ఠించారు. సమ్మక్క కూతురు అయిన సారలమ్మను సాయంత్రం 6 గంటలకు సారలమ్మ ప్రధాన పూజారి కాక సారయ్య సారలమ్మ గద్దె వద్ద ప్రత్యేక పూజలను చేసి తాడ్వాయి.
మండలంలోని కన్నెపల్లి గ్రామంలో కొలువుదీరిన సారలమ్మ గుడి వద్దకు భారీ బందోబస్తు నడుమ చేర్చారు. సమ్మక్క భర్త పగిడిద్దరాజు సాయంత్రం 5.30 గంటలకు గంగారం మండలం పూనుగుల్ల గ్రామానికి బయలుదేరాడు. సమ్మక్క మరిది (పగిడిద్దరాజు తమ్ముడు) అయిన గోవిందరాజులు సాయంత్రం 5.30 గంటలకు గోవిందరాజులు ప్రధాన పూజారి అయిన దబ్బగట్ల గోవర్ధన్ ఏటూరునాగారం మండలంలోని కొండాయి గ్రామానికి పగిడ రూపంలో తీసుకెళ్లి గోవింద రాజులు కొలువైన ఆయన గుడిలో ప్రతిష్ఠించారు. వన దేవతల వన ప్రవేశానికి భక్తులు భారీగా తరలివొచ్చారు. సమ్మక్కను వన ప్రవేశం చేసేటప్పుడు పోలీసులు భారీ బందోబస్తు నడుమ జనం నుండి వనంలోకి తీసుకెళ్లారు. దీనితో మేడారం మహాఘట్టం విజయవంతంగా పూర్తి అయినది. కాగా జాతర కోసం, మంత్రి సీతక్కతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లా అధికార యంత్రాంగం దగ్గరుండి భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా పర్యవేక్షించారు. కాగా ఈ యేడు జారతలో తల్లుల దర్శనం కోసం సుమారు 1.45 కోట్లకు పైగా భక్తులు హాజరైనట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
అమ్మవార్లను దర్శించుకున్న ప్రముఖులు
తెలంగాణ గవర్నర్ తమిళి సై, సీఎం రేవంత్ రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, మంత్రులు సహా పలువురు ప్రముఖులు సమ్మక్క సారలమ్మను దర్శించుకుని నిలువెత్తు బంగారంతో మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా జాతర సక్సెస్‌కు సహకరించిన ప్రతి ఒక్కరికీ మంత్రి సీతక్క పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. చివరిరోజు సమ్మక్క, సారలమ్మల వన ప్రవేశానికి అన్ని ఏర్పాట్లను దగ్గరుండి చేశారు. సమ్మక్క, సారలమ్మ గద్దెలపై కొలువుదీరడంతో శుక్ర, శనివారాల్లో భక్తులు పోటెత్తారు. ఉదయం నుంచే వెల్లువలా తరలివచ్చి, భక్తిపారవశ్యంలో మునిగిపోయారు. గంటల తరబడి క్యూలో నిలబడి మరీ అమ్మవార్లను దర్శనం చేసుకున్నారు.
తిరుగుప్రయాణమైన భక్తులు
మేడారం జాతరలో సమ్మక్క, సారలమ్మ అమ్మవార్లు వనప్రవేశం పూర్తయిన నేపథ్యంలో అమ్మవార్లను దర్శించుకున్న భక్తులందరూ తిరిగి వారి వారి స్వగ్రామాలకు తరలివెళుతున్నారు. భక్తుల తిరుగు ప్రయాణం సందర్భంగా ఆర్టిసి బస్టాండ్ ప్రాంతంలోని క్యూ లైన్లు జనంతో కిక్కిరిసి పోయాయి. ఇప్పటి వరకు దాదాపు 10 వేల ట్రిప్పుల బస్సులు నడిచినట్లు అధికారులు తెలిపారు. భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన గుడారాలు, టెంట్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. తమ సామగ్రినీ, పిల్లలను పట్టుకుని భక్తులు తమ తిరుగు ప్రయాణం సాగిస్తున్నారు.