‘‌ఘర్‌ ‌వాపసీ’ కి రాష్ట్ర కాంగ్రెస్‌ ‌పిలుపు

కర్ణాటక ఫలితాల తర్వాత తెలంగాణ కాంగ్రెస్‌లో జోష్‌ ‌పెరిగింది. ఆ తర్వాత జరిగేవి తెలంగాణ శాసనసభ ఎన్నికలే కావడంతో దాని ప్రభావం పక్కనే ఉన్న తెలంగాణపై తప్పకుండా పడుతుందని కాంగ్రెస్‌ ‌శ్రేణులు ప్రగాఢంగా విశ్వసిస్తున్నాయి. కర్ణాటక ఫలితాలు అలా వెలువడ్డాయోలేదో దేశంలో భవిష్యత్‌లో కాంగ్రెస్‌ ‌ప్రభుత్వమే ఏర్పడబోతుందన్న ప్రచారాన్ని ఆ పార్టీ వర్గాలు అందుకున్నాయి. ప్రధాని మోదీ కరిష్మా  కొడగట్టి పోయిందనడానికి కర్ణాటక ఫలితాలే ప్రత్యక్ష సాక్షంగా నిలుస్తున్నాయన్న ప్రచారంకూడా విస్తృతంగా సాగుతోంది. ఈ ఎన్నికల్లో స్థానిక నాయకత్వంకన్నా కేంద్రనాయకుల ప్రచార జోరే ఎక్కువగా కనిపించింది. ప్రధాని నరేంద్రమోదీ కూడా  ఈ ఎన్నికలను చాలా ప్రతిష్టగా తీసుకున్నట్లు కనిపిస్తున్నది.
దక్షిణాది రాష్ట్రాల్లో తమపార్టీని విస్తృతించే క్రమంలో తాము ఎదుర్కునే పరీక్షల్లో దీన్ని సెమీఫైనల్‌గా ఆ పార్టీ భావించి ఉంటుంది. అందుకే ప్రధానే స్వయంగా దాదాపు ఇరవై సార్లకుపైగా ఈ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంకోసం పర్యటించడం గమనించదగ్గ విషయం. నిన్నటి వరకు రాష్ట్రంలో తమ పార్టీ ప్రభుత్వమే ఉన్నప్పటికీ ఈ ఎన్నికల్లో తమ పార్టీని గెలిపించుకోవడంలో ఆ పార్టీ భూమ్యాకాశాలను ఒకటిచేసింది. ప్రచారంలో భాగంగా చెప్పుకుంటూవొచ్చిన డబుల్‌ ఇం‌జన్‌ ‌సర్కార్‌ ‌నినాదం ఏమాత్రం ఇక్కడ పనిచేయకుండా పోయింది. నిన్నటి వరకున్న డబుల్‌ ఇం‌జన్‌ ‌రాష్ట్ర ప్రగతిన లాగలేకపోయిందన్న అభిప్రాయం ప్రజల్లో బాగా నాటుకుపోయిందనే చెప్పాలే. అందుకే డబుల్‌ ఇం‌జన్‌ ‌సర్కార్‌ ‌తమకు అవసరంలేదని అక్కడి ప్రజలు వోట్ల  రూపంలో తెగేసి చెప్పారు. అనూహ్యంగా కాంగ్రెస్‌ ‌సర్కార్‌ను అఖండ మెజార్టీతో గెలిపించారు. ఇక్కడ కాంగ్రెస్‌కు లభించిన మెజార్టీలో బిజెపిని వోటర్లు సగానికి తగ్గించారంటేనే అక్కడ ప్రభుత్వ పాలనాతీరుకు అది అడ్డం పడుతున్నది.. బహుషా అక్కడ కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం ఈ రోజు  పదవీ బాధ్యతలను చేపట్టే అవకాశముంది. ఈ ఫలితాలిప్పుడు దేశ వ్యాప్తమవుతాయని కాంగ్రెస్‌  ‌సంబరపడుతున్నది. ముఖ్యంగా త్వరలో జరుగనున్న తెలంగాణ రాష్ట్రంలో ఈ ఫలితాలే పునరావృతం అవుతాయని కాంగ్రెస్‌ ఆశపడుతున్నది. అయితే తెలంగాణ కాంగ్రెస్‌ ‌పరిస్థితితో పోలిస్తే, కర్ణాటక కాంగ్రెస్‌ ‌పరిస్థితి వేరు. అక్కడ గెలుపే లక్ష్యంగా గ్రూపులన్నీ కలిసి కొట్లాడిన విషయం తెలిసిందే. బడా నాయకులు మొదలు, సామాన్య కార్యకర్తవరకు బిజెపిని ఓడించేందుకు ఏకమై పనిచేశారు. ప్రస్తుతానికైతే తెలంగాణలో ఆ పరిస్థితిలేదు. రేవంత్‌రెడ్డి పిసీసీ అధ్యక్ష పదవి చేపట్టింది మొదలు ఆ పార్టీలో మొదలైన ముసలం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆయనపై అలకచెందిన పలువురు సీనియర్‌ ‌నాయకులు ఇప్పటికే పార్టీ మారగా, ఇంకొందరు అప్పుడప్పుడు రేవంత్‌రెడ్డికి ఝలక్‌ ఇస్తూనే ఉన్నారు. ఎవరి పట్టుదలవారిదన్నట్లు నాయకులది తలోదారిగా ఉంది. పార్టీ వీడి వెళ్తున్నవారిని నిరోధించుకోవడంలో రాష్ట్ర, కేంద్ర నాయకత్వాల అలసత్వం కొట్టొచ్చినట్లు  కనిపిస్తున్నది. పార్టీని వీడి పోయినవారెవరూ ఇంతవరకు పశ్చత్తాపపడినట్లు కనిపించడంలేదు. వెళ్ళినవారు చాలావరకు రేవంత్‌రెడ్డిపైన బాహాటంగానే తమ ఆగ్రహాన్ని వ్యక్తంచేయడం గమనార్హం.
ఇదిలా ఉంటే కర్ణాటక ఫలితాల తర్వాత రాష్ట్ర పార్టీలో కొంత చలనం మాత్రం మొదలైందనే చెప్పాలె. కర్ణాటకలో మాదిరిగా నాయకులంతా కలిసికట్టుగా ఉంటే రానున్న ఎన్నికల్లో తప్పకుండా ఇక్కడ  విజయం సాధిస్తామన్న నమ్మకం పార్టీ నాయకుల్లో ఏర్పడింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని తాజాగా ఆ పార్టీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి ‘ఘర్‌ ‌వాపసీ’ పిలుపునిచ్చారు. పార్టీ వీడిన వారంతా తిరిగి మాతృ సంస్థలో చేరాలని ఆయన మీడియా ముఖంగా వారికి విజ్ఞప్తి చేశారు. ప్రధాని మోదీ బ్రాండ్‌కు కాలం చెల్లిందన్న విషయాన్ని కర్ణాటక ఫలితాలు తేటతెల్లం చేశాయి. సాక్షాత్తు ప్రధాని అంతటివాడు ఈ ఎన్నికలను ఛాలెంజీగా తీసుకున్నప్పటికీ ప్రజలు ఆ పార్టీని అమోదించలేదన్నది సుస్పష్టం..  బిజెపి ఎంతో బిఆర్‌ఎస్‌కూడా అంతే.. ఈ రెండు పార్టీలను మట్టుబెట్టాల్సిన అవసరం ఎంత్తైనా ఉంది.. అందుకు కాంగ్రెస్‌ ‌శ్రేణులంతా పునరేకీకరణ కావాల్సిన అవసరం ఉంది..  అందుకు పార్టీని వీడి మరో పార్టీలో ముఖ్యంగా బిజెపిలో చేరిన సీనియర్‌ ‌నాయకులంతా ఒక్కసారి పునరాలోచన చేసుకుని తిరిగి కాంగ్రెస్‌ ‌గూటికి చేరాలన్నది  రేవంత్‌రెడ్డి  పిలుపు ప్రధాన ఉద్దేశ్యం.  కాంగ్రెస్‌ ‌పార్టీ అమ్మలాంటిదని, దాన్ని పటిష్టపర్చడంతోపాటు, ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేసుకున్న  తెలంగాణ అభ్యున్నతికి కలిసి పనిచేయాల్సిన అవసరాన్ని ఆయన వారికి గుర్తు చేశారు.  ఈ విషయంలో రేవంత్‌రెడ్డి  వారికి ఒక బ్రహ్మాండమైన అఫర్‌కూడా ఇచ్చారు. ఇప్పటివరకు పార్టీని వీడినవారంతా రేవంత్‌ ‌రెడ్డి నాయకత్వంలో పనిచేయలేమంటూ చేసిన ప్రకటనలను దృష్టిలో పెట్టుకునేమోగాని, సీనియర్లు పార్టీలోకి పున:ప్రవేశించే క్రమంలో అవసరమైతే తాను ఒకటి కాదు రెండు కాదు పది మెట్లు దిగడానికైనా( వెనక్కు తగ్గడానికి) సిద్ధంగా  ఉన్నానని ప్రకటించడం చెప్పుకోదగ్గ పరిణామం. పార్టీకి తానే ఏకైక నాయకుడినని చెప్పుకోవడంలేదని,  సోనియాగాంధీ, ఖర్గే నాయకత్వంలోనే మన మందరం కలిసిపనిచేద్దామంటూ, క్షణికావేశంతో పార్టీని వీడిన వారిని ఉద్దేశించి ఆయన అన్నమాటలు ఆలోచింపచేసేటివిగా ఉన్నాయి. బిజెపి ఎంతో బిఆర్‌ఎస్‌ ‌కూడా అంతేనని, ఈ రెండు ప్రభుత్వాలకు పదవీ భ్రష్టత కల్పించాల్సిఉందంటూ ఆయన చేసిన విజ్ఞప్తికి, ఇప్పటికే బిజెపి లాంటి పార్టీలోచేరి ఇముడలేక, అసంతృప్తితో ఉన్న వారిని రేవంత్‌ ‌మాటలు పునరాలోచనలో పడేస్తున్నాయి.
image.png
మండువ రవీందర్‌ ‌రావు
గెస్ట్ ఎడిటర్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page