కవిత కొత్త పార్టీ నిలదొక్కు కునేనా!?

“కవిత కూడా ఒకరకంగా కొండకు వెంట్రుక కట్టి లాగుతుంది.కాలం కలిసి వస్తే తనకున్న పట్టుదల, తండ్రి నుండి పుణికి పుచ్చుకున్న జగ మొండితనం లక్షణాలతో ఒంటరిగా పోరాడే అవకాశం ఉంది. 2029 ఎన్నికల నాటికి ఓ బలమైన రాజకీయ శక్తిగా తమ పార్టీ ఎదిగినా ఎదగక పోయినా కవిత కు జరిగే నష్టం ఏమీ లేదు..! గతంలో సంపాదించిన సొమ్ము కాస్తా ఖర్చు అవుతుంది తప్ప..! ఎందుకంటే,రేపు కేసీఆర్ మళ్ళీ అధికారంలోకి వస్తే తన తండ్రి పార్టీలో చేరికను కాదనే వారుండరు..లేదు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా తన పార్టీ విలీనం ద్వారా పార్టీలో చేరే అవకాశం కొట్టిపారేయలేం? ఎటుచూసినా కవిత కత్తికి రెండు వైపులా రాజకీయ పదును ఉంటుంది..”

-ఎన్.తిర్మల్
సీనియర్ జర్నలిస్టు, రచయిత, సామాజిక కార్యకర్త
మొబైల్:9441864514.ఇమెయిల్: thirmal.1960@gmail.com

తెలంగాణా జాగృతి అధ్యక్షురాలు, తెలంగాణా ఏర్పాటు లో కీలక భూమిక నిర్వహించిన కేసీఆర్ పుత్రిక కవిత ‘తెలంగాణా రాష్ట్ర సేన’షార్ట్ ఫార్మ్ టీఆర్ఎస్ ,పాత పార్టీ పేరుతో ఓ సరికొత్త పార్టీకి శ్రీకారం చుట్టారు.అంటే తండ్రి వదిలేసిన పాత సీసాలో కవిత కొత్త సారా వండి నింపుతున్నారు.కన్ఫ్యూజ్ చేయడం తప్ప పేరుతో కొత్తగా ఒరిగేది ఏమీ ఉండదు ..ఎట్టకేలకు ఆమె జెండా,ఎజెండా బయటపడింది. కవిత రాజకీయ ప్రయాణం తెలంగాణా కు కొత్తదేమీ కాదు.టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం తర్వాత ఆమె తెలంగాణా జాగృతి పేరుతో ఓ సాంస్కృతిక సంస్థను ఏర్పాటు చేయడంతో పాటు,దసరాను తెలంగాణా ముఖ్య పండుగగా ,మధ్యతరగతి వర్గం పూల పండుగ బతుకమ్మ ను విస్తృత పరచడంలో ఆమె కృషి ఉంది. అంటే తెలంగాణా సంస్కృతి విస్తరణలో ఆమె భాగస్వామ్యం ఉంది.కేసీఆర్ పుత్రికగా ఆమె నిజామాబాద్ పార్లమెంట్ సభ్యురాలుగా ఎంపికయ్యారు.అటు తర్వాత అక్కడే ఓడిపోయారు.ఓడిపోయినా అధికారంలో ఉన్న కేసీఆర్ కవితలను ఎమ్మెల్సీ గా కూర్చోబెట్టారు.ఆమె టీఆర్ఎస్ లో ఉండగా కోల్ బెల్ట్ ఏరియా లో కార్మిక సంఘాలు నడిపించారు.ఇవన్నీ ఆమె బాపు కేసీఆర్ రాజకీయ నీడలోనే జరిగాయి.రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ కుటుంబ ఆధిపత్యం పై విమర్శలు వచ్చాయి.ఒకరకంగా పార్టీ ప్రభవం కోల్పోవడం లో కూడా కీలక పాత్ర కుటుంబ అతి జోక్యం,ఆస్తులు కూడగట్టిన విషయం కూడా ప్రతిపక్షాలు చేసిన ప్రచారం ప్రజలు నమ్మారు.

కేంద్రం, రాష్ట్రం మధ్య నడిచిన పోరులో కేసీఆర్ కూతురు దిల్లీ లిక్కర్ స్కాం లో అరెస్ట్ కావడం,జైలుకెళ్లడం,బిఆర్ఎస్ ఓడిపోవడం, దిల్లీ ప్రభుత్వం కూడా అదే ప్రభావం తో పతనం కావడం,తర్వాత కుటుంబం లో తలెత్తిన వివాదం లో కవితా సొంత పార్టీ పైనే తీవ్రంగా విమర్శలు చేయడం,బిఆర్ఎస్ పార్టీ ఆమెను పార్టీ నుంచి తొలగిస్తూ ప్రకటించడం ,ఆమె ఎమ్మెల్సీ గా రాజీనామా చేయడం , కొత్త పార్టీ కి ఏర్పాట్లు ఇవన్నీ తెలంగాణా సమాజం చూస్తున్న పరిణామాలే! ఒకానొక దశలో కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఆమె ప్రయత్నాలుగా బిఆర్ఎస్ పార్టీ ఆరోపించింది.ఈ దశలో కాంగ్రెస్ కవితను చేర్చుకోవడం లేదని స్పష్టంగా ప్రకటించింది.దానితో కేసీఆర్ కూతురు కవిత కొత్త పార్టీ ఏర్పాటుకు ప్రయత్నాలు చేసారు.పార్టీ జెండా ఎజెండా కూడా తెలంగాణలో మరో కొత్తపార్టీకి అంకురార్పణ జరిగింది.అయితే కవిత పార్టీ పెట్టిన ఎంతవరకు విజయం సాధిస్తుంది.ఆమె పార్టీ వల్ల ఎవరికి లాభం, నష్టం అనే విషయం!

తెలంగాణా లో కొంత అసంతృప్తి ఉన్నందున ఆమె పార్టీకి వాక్యూం ఉందా లేదా అనే విషయం ప్రక్కన పెడితే.. కవిత కొత్త పార్టీ నైతికంగా కేసీఆర్, బిఆర్ఎస్ పార్టీకి కాస్తా ఇబ్బందికర పరిణామమే.కాంగ్రెస్ పార్టీ కూడా కవితను కాంగ్రెస్ లో చేర్చుకునే కంటే కొత్త పార్టీ పెట్టి ప్రధాన ప్రతిపక్షం దూకుడు కు ముక్కుతాడు వేయడానికి పనికి వస్తుందనే ఆలోచన చేసింది.తానెందుకు ముఖ్యమంత్రి అభ్యర్థి కాకూడదు అని బహిరంగంగా తన రాజకీయ వాంఛను కవిత కూడా దాచుకోకుండా వ్యక్తం చేశారు కూడా!కవిత కూడా ఒకరకంగా కొండకు వెంట్రుక కట్టి లాగుతుంది.కాలం కలిసి వస్తే తనకున్న పట్టుదల, తండ్రి నుండి పుణికి పుచ్చుకున్న జగ మొండితనం లక్షణాలతో ఒంటరిగా పోరాడే అవకాశం ఉంది. 2029 ఎన్నికల నాటికి ఓ బలమైన రాజకీయ శక్తిగా తమ పార్టీ ఎదిగినా ఎదగక పోయినా కవిత కు జరిగే నష్టం ఏమీ లేదు..! గతంలో సంపాదించిన సొమ్ము కాస్తా ఖర్చు అవుతుంది తప్ప..! ఎందుకంటే,రేపు కేసీఆర్ మళ్ళీ అధికారంలోకి వస్తే తన తండ్రి పార్టీలో చేరికను కాదనే వారుండరు..లేదు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా తన పార్టీ విలీనం ద్వారా పార్టీలో చేరే అవకాశం కొట్టిపారేయలేం? ఎటుచూసినా కవిత కత్తికి రెండు వైపులా రాజకీయ పదును ఉంటుంది.అందులో,ఇందులో,ఎందులో చోటు దొరకని ఆశావాహులు అంతా కవితా పార్టీలో చేరే అవకాశం మాత్రం ఉంది.

అసలు దక్షిణాది రాజకీయాలలో మహిళా ముఖ్యమంత్రులు చాలా తక్కువ,ఒక్క తమిళ నాడు ముఖ్యమంత్రి గా సినీనటి జయలలిత తప్ప ఎవరూ సక్సెస్ కాలేదు.ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాజకీయాల్లో కూడా మహిళలు ముఖ్యమంత్రి స్థాయి పొందలేకపోయారు.1990 దశకంలో టిడిపి చీలిక రాజకీయాల్లో ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి ‘అన్న తెలుగు దేశం ‘పెట్టి అన్ని స్థానాలకు పోటీ చేసినా ఆమె తప్ప ఎవరూ గెలవలేక పోయారు.ఇక మరో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ ఆర్ కూతురు షర్మిల తెలంగాణా అంతటా చెప్పులరగ తిరిగినా తనకంటూ ఓ స్థానం సాధించలేకపోయారు. షర్మిల పోటీ వలన తెలంగాణాలో జరగబోయే నష్టం గ్రహించిన కాంగ్రెస్ అధిష్టానం ఆమెను వ్యూహాత్మకంగా ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు గా పంపించి ప్రమాదం నుండి బయటపడ్డారు..అదికారంలోకి రాగలిగారు.తెలంగాణలో షర్మిల ప్రయోగం ఆచరణలోనే,ఆదిలోనే విఫలం అయింది.ఇక ఇప్పుడు మరో మాజీ ముఖ్యమంత్రి కూతురు కొత్త ప్రయోగం ఏ మేరకు విజయవంతం అవుతుందో కాలమే నిర్ణయించాల్సి ఉంది !

ఒకవైపు రేవంత్ రెడ్డి తెలంగాణ సెంటిమెంట్ కు విధాన పరంగా దూరం అవుతున్న దశలో, కేసీఆర్ పరిపాలన రెండో దశలో తెలంగాణా వాదాన్ని పలచన చేశారనే వాదనలు మధ్య మళ్ళీ కవిత తెలంగాణా వాదాన్ని, సెంటిమెంట్ ను కొంత వరకు ఉపయోగించుకునే అవకాశం ఉంది.అది ఏమేరకు సాధ్యం అవుతుంది అనేది ఇప్పుడే చెప్పలేం.ఇక్కడ మరో వివక్షా రూపం కూడా కనబడుతుంది. పురుషులకు ఆస్తి,వారసత్వ హక్కు లాగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి కుమారులను అంగీకరించినంతగా కూతుర్లకు ప్రజలు అంగీకారం తెలపడం లేదు.ఇది తరతరాల వివక్షకు రాజకీయ సంకేతమే కావచ్చును.వీటన్నింటినీ కవిత తన కొత్త పార్టీ ద్వారా ఎలా అధిగమిస్తుంది అనేది ఆమె రాజకీయ సమర్థత పై ఆధారపడి ఉంది.

కవిత కొత్త పార్టీ ఎజెండా, జెండా ఏమేరకు ప్రజలు విశ్వాసం కూడగట్టుకోగలుగుతుంది? ఆమె కాంగ్రెస్ పాలనా వైఫల్యం,బిఆర్ ఎస్ లో ఉన్న సానుభూతి, అసంతృప్తులను కూడగట్టుకొని ఎదగాలసి ఉంది.అది ఏమేరకు వర్కవుట్ అవుతుంది.ఇప్పుడే చెప్పలేం. ఇక రాజకీయంగా ఆమె పార్టీ ఎవరికి నష్టం అనే విషయం పక్కన పెడితే.. తెలంగాణాలో కేసీఆర్ ప్రభావాన్ని, కాంగ్రెస్ పార్టీ కున్న సాంప్రదాయ వోటు బ్యాంకును తట్టుకొని ఏమేరకు నిలబడుతుంది అనేది కీలకమే! అయితే, తెలంగాణా లో కవిత కొత్త పార్టీ ప్రయోగం ,స్ఫూర్తి ప్రజలు విశ్వాసం కు సంబంధించిన అంశమే..!అయినా ఓ మహిళా రాజకీయ శక్తిగా తెలంగాణా లో కవిత ముఖ్యమంత్రి పదవిని ఆశించి చేస్తున్న ప్రయోగం విజయవంతం కావాలని ఆకాంక్షిద్దాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *