కాంబోడియా ప్రయాణం 

“బాధితులను చంపడానికి బుల్లెట్లను ఉపయోగించకుండా వ్యవసాయ పనిముట్లను వాడేవారు. గొడ్డళ్లు, గునపాలు, సుత్తులు, పారలతో క్రూరంగా నరికి చంపేవారు. పదునైన వెదురు కర్రలను, ఈత కమ్మలను కూడా వాడేవారు. దానివల్ల బాధితులు ఒకేసారి కాకుండా చిత్ర హింసలకు గురై మరణించేవారు. బుల్లెట్స్ కూడా ఆదా అయ్యేవి. టామ్ ఒక చెట్టు గింజను చూపించి దానిని మనిషి ప్రాణాలు కాపాడడానికి, ప్రాణాలు తీయడానికి రెండు రకాలుగా ఉపయోగించవచ్చని చెప్పాడు. దాని గంధాన్ని నీళ్ళలో కలిసి తాగితే విష జ్వరాలు కూడా తగ్గుతాయట. పై పూతగా ఉపయోగిస్తే నొప్పులు తగ్గుతాయట. గింజ మొత్తాన్ని దంచి ఎక్కువ మోతాదులో నీళ్ళలో కలిపి తాగిస్తే ప్రాణాలు పోతాయని చెప్పాడు. ఖైమర్ సైనికులు ప్రజలచేత బలవంతంగా తాగించి అలా కూడా చంపేవారట.”

గిరియానం – 18

మరురోజు ఉదయమే బయలుదేరి ట్యూయల్  స్లేoగ్ జెనోసైడ్ ( Tuol Sleng Genocide Museum ) మ్యూజియం చూడడానికి వెళ్ళాం. టుయల్ స్వాయ్ ప్రే (Tuol Svay Prey ) అనే మాధ్యమిక పాఠశాల అది. మూడు అంతస్తులతో మూడు భవనా లున్నాయి. 1975లో ఖైమర్ రూజ్ అధికారంలోకి వచ్చాక ఆ పాఠశాలను జైలుగా మార్చారు. అత్యంత కట్టుదిట్టమైన చిత్రహింసలకు కేంద్రంగా మారింది. దానిని S – 21 గా కూడా పిలుస్తారు. అంటే సెక్యూరిటీ ప్రిజన్ 21 అని అర్థం. 1975 – 79 మధ్య కాలంలో అక్కడ దాదాపు 20000 మందిని బంధించి చిత్రహింసలకు గురిచేసారు. అక్కడ బంధించబడిన వాళ్ళలో కేవలం 12 మంది మాత్రమే బతికి బయటపడ్డారు. ఖైమర్ రూజ్ సైనికులు ఖైదీలను జైలులోకి తీసుకువచ్చే ముందు ఫోటోలు తీసేవారు.

ఆ బ్లాక్ అండ్ వైట్ ఫోటోలన్ని ఆ గదుల గోడలకున్నాయి. ఏ వయసు వారు ఏ గదిలో ఉన్నారో తెలియజేసీ వివరాలతో కూడిన అప్పటి మెటల్ బోర్డులు ప్రతి గది ముందు ఉన్నాయి. పిల్లలను ఉంచిన ప్రత్యేకమైన గదులలో  ఫోటోలతోపాటు వారి దుస్తులు కూడా ఉన్నాయి. ఆ ఫోటోలలోని పిల్లల కళ్ళల్లో కనిపించే భయం సందర్శకులను కలచి వేస్తుంది. అలాగే మహిళ లకు సంబంధించిన ప్రత్యేకమైన గదులున్నాయి. కొన్ని తరగతి గదులను చిన్న చిన్న సెల్స్ గా మార్చి, అక్కడ ఖైదీలను బంధించచడానికి వాడిన ఇనప గొలుసులు, బెంచీలు, చిత్రహింసలకు గురిచేయడానికి ఉపయోగించిన పరికరాలు ఉన్నాయి. వాళ్ళ పెయింటింగ్ పోస్టర్ ఆ ప్రాంగణంలో ఉంది. బయట పడిన పన్నెండు మందిలో నోరోంగ్ చాన్ లే ‘(Norng Chanly) అనే ఆయన కిల్లింగ్ ఫీల్డ్స్ లో మాకు కనిపించి తన అనుభవా లను పంచుకున్నాడు. ఆయన జీవిత చరిత్రను రాసాడట.

 అక్కడినుంచి మేం కిల్లింగ్ ఫీల్డ్స్ ఆఫ్ చోయంగ్ ఏక్ ( Killing failds of Charing Elk) అనే ప్రదేశానికి వెళ్లాం. కంబోడియా చరిత్రలో అతి విషాదకరమైన, భయంకరమైన వాస్తవానికి చారిత్రకమైన నిదర్శనం అది. 1975-978 మధ్య కాలంలో పాల్ పాట్ హయాంలో జరిగిన మారణ కాండకు ప్రత్యక్ష సాక్ష్యం. ఆ ప్రాంతం ఫ్నోం  పెన్ నగరం నుంచి సుమారు 17 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రవేశ ద్వారం దగ్గరనే పర్యాటకులు ఆడియో గైడ్ ద్వారా తెలుసుకోవచ్చు. చూడాలనే ఆతృత కొద్దీ మేం అది వినకుండా ముందుకు పోయాం.1988లో నిర్మించిన పెద్ద బౌద్ధ స్తూపం ఉంది. అందులో సామూహిక సమాధుల నుండి బయటపడ్డ దాదాపు 8000 పుర్రెలను ఉంచారట. కంబోడియన్ జర్నలిస్ట్ డిత్ ప్రాన్ అనే ఆయన ఆ ప్రదేశానికి   ‘కిల్లింగ్ ఫీల్డ్స్ ‘అని పేరు పెట్టాడు. పూర్వం అది ఒక పళ్ళతోట అట. కానీ ఖైమర్ రూజ్ 0019 మారణహోమానికి వేదికగా మార్చింది. అద్దాల డబ్బాల్లో చేతులు, కాళ్ళు, పుర్రెల ఎముకలను భద్రపరిచారు. ఒకేసారి ఒక్కొక్క చోట వందలాది శవాలను పూడ్చిపెట్టారు. ఇప్పటికీ వర్షం పడినప్పుడు అప్పుడప్పుడు ఎముకలు బయట పడుతున్నాయట. అలా బయటపడిన వాటిని గ్లాస్ డబ్బాలలో ఉంచుతున్నారు.

బాధితులను చంపడానికి బుల్లెట్లను ఉపయోగించకుండా వ్యవసాయ పనిముట్లను వాడేవారు. గొడ్డళ్లు, గునపాలు, సుత్తులు, పారలతో క్రూరంగా నరికి చంపేవారు. పదునైన వెదురు కర్రలను, ఈత కమ్మలను కూడా వాడేవారు. దానివల్ల బాధితులు ఒకేసారి కాకుండా చిత్ర హింసలకు గురై మరణించేవారు. బుల్లెట్స్ కూడా ఆదా అయ్యేవి. టామ్ ఒక చెట్టు గింజను చూపించి దానిని మనిషి ప్రాణాలు కాపాడడానికి, ప్రాణాలు తీయడానికి రెండు రకాలుగా ఉపయోగించవచ్చని చెప్పాడు. దాని గంధాన్ని నీళ్ళలో కలిసి తాగితే విష జ్వరాలు కూడా తగ్గుతాయట. పై పూతగా ఉపయోగిస్తే నొప్పులు తగ్గుతాయట. గింజ మొత్తాన్ని దంచి ఎక్కువ మోతాదులో నీళ్ళలో కలిపి తాగిస్తే ప్రాణాలు పోతాయని చెప్పాడు. ఖైమర్ సైనికులు ప్రజలచేత బలవంతంగా తాగించి అలా కూడా చంపేవారట.

                   ” ఏ జాతి చరిత్రరాసినా / ఏమున్నది గర్వకారణం

                     నర జాతి చరిత్ర సమస్తం / పరపీడన పరాయత్వం”

అన్న శ్రీశ్రీ దేశచరిత్రలో కవితలోని కొన్ని పంక్తులు నాకు గుర్తుకు వచ్చాయి. అక్కడ ఉన్న కిల్లింగ్ ట్రీని చూసి నప్పుడు హృదయం కలచి వేసింది. మనసు భారంగా మారింది. సైనికులు పసిపిల్లల కాళ్ళను పట్టుకొని, వారి తలలను ఆ చెట్టు కాండానికి వేసి బలంగా కొట్టి చంపేవారట. ఈనాడు పర్యాటకులు బాధితుల జ్ఞాపకార్థం రంగు రంగుల దారాలను, బాండ్స్ ను ఆ చెట్టుకు కడుతున్నారు. అలాంటిదే పక్కన మ్యాజిక్ ట్రీ అని బోర్డు ఉన్న మరో పెద్ద చెట్టు కనిపించింది. దగ్గరగా వెళ్ళి ఏమిటా? అని చూస్తే బాధితుల అరుపులు బయటకు వినబడకుండా ఉండడానికి ఆ చెట్టుకు పెద్ద లౌడ్ స్పీకర్లు కట్టి సంగీతం వినిపించేవారని తెలిసింది. ప్రతిచోటా ఆయా వివరాలు తెలియజేసే బోర్డులున్నాయి. ఎక్కడ ఎన్ని శవాలను పూడ్చిపెట్టారు, ఎన్ని పుర్రెలు, ఎన్ని ఎముకలు, స్త్రీలు, పురుషులు, పిల్లలు.. ఇలాంటి వివరాలు ఆ బోర్డుల్లో రాసి ఉన్నాయి. అలా నడుస్తూ ముందుకు వెళితే ఒక స్త్రీ తనఒళ్ళో బిడ్డను పెట్టుకున్న శిల్పం కనిపించింది. దాని కింద ఇలా రాసి వుంది. ” Never will we forget the crimes commited during the Democratic Kampuchea regime 17 – 4- 1975 To -7- 01- 1979.చివరగా ఆ చరిత్రను తెలియచేసే సినిమాను ప్రదర్శించారు.

30 నిమిషాల నిడివి. పోల్ పాట్ లాంటి నాయకులతో చేసిన ఒరిజనల్ ఇంటర్వ్యూలు కూడా ఆ సినిమాలో ఉన్నాయి. అప్పటిదాకా మేం చూసిన ఆనవాళ్లకు కారణమైన డాక్యుమెంటరీ చిత్రమది. మనసు భారంతో బయటపడ్డాం. హోటల్ కు వెళ్ళి కాసేపు విశ్రాంతి తీసుకొని, సాయంత్రం మెకాంగ్ రివర్ తీరానికి నడిచి వెళ్ళాం. హోటల్ నుంచి 15 నిమిషాల దారి. క్రూయిజ్ కూడా ఉంది. ఐదు యుఎస్ డాలర్లు. రెండునదుల సంగమం దాకా తీసుకువెళతారు. మేం మాత్రం కూర్చుని పరిసరాలను పరిశీలిస్తూ నదీ తీరంలో కూర్చున్నాం. హనుమాన్, వెంకటేశ్ పేర్లతో ఉన్న క్రూయిజ్ లే కనిపించాయి. ఆ చల్లటి సాయంత్రం పిల్లాపాపలతో విహారానికి వస్తున్నారు జనం. కొంతమంది సంగీతానికి అనుగుణంగా సామూహికంగా వ్యాయామం చేస్తున్నారు. వాళ్ళ భయంకరమైన అనుభవాలనుంచి కాంబోడియా ప్రజలు కోలుకుంటున్నట్లుగా ప్రశాంతంగా కనిపించారు. తిరుగు దారిలో వాళ్ళ నైట్ లైఫ్ ను కూడా చూసుకుంటూ హోటల్ కు చేరుకున్నాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *