వస్తువు రూపాయే.
దాన్ని చూపే దర్జా ఐదు రూపాయలు.
అద్దాల అంగడి అంగిట నుండి
రాలిపడ్డ అంకె వేసే రంకె
ఎంత దూరమైనా చప్పుడొకటే.
కాలుపెట్టినది ఒక కోరిక.
చూపును మెలదెప్పి, మోసం చేసి
రుచి చూపేది నాలుగు కోరికల్ని.
అంగరంగ వైభవంగా
జేబుకు పెట్టె చిల్లుకు
క్యూలో నిలబడి
మోసపోవడమే ఫ్యాషన్.
సెంటర్ ఏ.సి.తో నడిసెంటర్లో
అందమైన దగా హుందాగా
పలికే ఆహ్వానం చూసి
పరుగుదీసే పిచ్చిజనానికి
పచ్చినిజం కనిపించనియని
ప్యాకెట్ సోకు ఓ మాయ.
క్యాష్ కౌంటర్ వద్ద జరిగే
ధరల ఎన్ కౌంటర్ వద్ద
ఓడిపోతున్న విలువుని
ఆలోచించవలసిన బుద్ధిజీవుల
చూపులు లొట్టలేస్తూ
పెద్ద పెద్ద లైట్ల మధ్య
దారితప్పడం మతితప్పడమే.
ప్రతి పల్లెను సహితం
తలుపు తట్టి పిలిచే మాల్ మాయతో
విజ్ఞత నశించి
హక్కు అంతరించి
సహనం చెరుపుకుని
సోమరికి అలవాటుపడి
ఎటో కొట్టుకుపోతూ కోసుకుపోతుంటే
పల్లెకు మతిపోయింది.
పంటకు పరువుపోయింది.
మనిషికి రుచి పోయింది.
డబ్బుకు విలువ పోయింది.
బలహీనత బలమై మిగిలింది.
-చందలూరి నారాయణరావు
9704437247