క్రైమ్ సీన్ మొత్తంగా మార్చేశారు
దర్యాప్తు సవాల్‌గా మారింది
రేప్, మర్డర్ కేసును కప్పిపుచ్చే యత్నం
సుప్రీమ్ కోర్టుకు సిబిఐ కీలక వివరాలు వెల్లడి
డాక్టర్లు విధుల్లో చేరాలని సిజెఐ సూచన
న్యూ దిల్లీ, ఆగస్ట్ 22(ఆర్‌ఎన్‌ఎ) : కోల్‌కతాలోని ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజీలో వైద్యురాలిపై అత్యాచార ఘటన ను సుప్రీమ్ కోర్టు సుమోటోగా విచారిస్తుంది. ఈ కేసులో దర్యాప్తు చేపట్టిన సీబీఐ గురువారం కోర్టుకు స్టేటస్ రిపోర్ట్ సమర్పించింది. ఇందులో కీలక విషయాలను న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లింది. తాము వెళ్లేసరికి క్రైమ్ సీన్ మొత్తాన్ని మార్చేశారని సీబీఐ ఆరోపించింది. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసిన 5 రోజుల తర్వాత దర్యాప్తును సీబీఐకి అప్పగించారని, దీంతో ఇప్పుడు దర్యాప్తు సవాల్‌గా మారిందన్నారు. తాము ఐదు రోజుల తర్వాత ఘటన జరిగిన హాస్పిటల్‌కి వెళ్లేసరికి క్రైమ్ సీన్‌ను మార్చినట్లు గుర్తించామన్నారు. ఇక బాధితురాలి దహన సంస్కారాలు పూర్తి చేసిన తర్వాత అర్ధరాత్రి సమయంలో ఎఫ్‌ఐఆర్ నమోదుచేయడం దిగ్భ్రాంతికరమన్నారు. తొలుత ఆమెది ఆత్మహత్య అని కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చి కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని, ఈ ఘటనలో వాస్తవాలను కప్పిపుచ్చుతున్నారని అనుమానించిన బాధితురాలి సహోద్యోగులు, యువ వైద్యులు వీడియోగ్రఫీకి పట్టుబట్టారని, దీంతో అప్పుడు పోస్ట్‌మార్టంను వీడియో తీశారని సీబీఐ కోర్టుకు వివరించింది.
సీబీఐ నివేదికను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం పరిశీలించింది. ఈ సందర్భంగా కోల్‌కతా పోలీసుల తీరుపై ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేసు నమోదులో లోపాలపై ప్రశ్నల వర్షం కురిపించింది. బాధితురాలు తీవ్ర గాయాలతో అర్ధనగ్న స్థితిలో విగతజీవిగా కన్పించిందని, అయినా ఆమెది అసహజ మరణం అని రికార్డుల్లో ఆలస్యంగా నమోదుచేయడం తీవ్ర ఆందోళనకరమని, అంతేగాక.. అసహజ మరణమని నమోదు చేయడానికి ముందే పోస్ట్‌మార్టం నిర్వహించడం ఆశ్చర్యంగా ఉందని, శవ పరీక్ష జరిగిన 18 గంటల తర్వాత క్రైమ్ సీన్‌ను సీల్ చేశారెందుకని కోర్టు ప్రశ్నించింది. ఈ కేసులో అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ తీరు అనుమానాస్పదంగా ఉందని ధర్మాసనం పేర్కొంది. ఈ కేసును తొలుత రికార్డుల్లో రాసిన పోలీసు అధికారి తదుపరి విచారణకు కోర్టు ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. నిందితుడి వైద్య రిపోర్ట్‌ను కూడా సమర్పించాలని సీబీఐని సూచించింది. కేసు నమోదులో కోల్‌కతా పోలీసులు ప్రదర్శించిన నిర్లక్ష్యంపై సుప్రీమ్ కోర్టు పెదవి విరిచింది. గత 30 ఏళ్లలో ఇలాంటి లోపాలను చూడలేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ సందర్భంగా పోలీసుల తరఫున న్యాయవాదులపైనా కోర్టు అసహనం వ్యక్తం చేసింది. సోషల్ మీడియా తరహా వాదనలు ఇక్కడ చేయొద్దని హెచ్చరించింది.
కోల్‌కతా ట్రైనీ డాక్టర్ అత్యాచారం, హత్య ఘటనపై ఆందోళన చేస్తున్న వైద్యులను విధులకు హాజరుకావాలని సీజేఐ ఆదేశాలు జారీ చేశారు. డ్యూటీ చేస్తూనే ఆందోళన చేస్తున్నామని వైద్యుల సంఘాలు తెలిపాయి. విధులకు హాజరైనప్పటికీ క్యాజువల్ లీవ్ కట్ చేసి వేధిస్తున్నారని ట్రైనీ డాక్టర్లు సుప్రీమ్ కోర్టుకు వెల్లడించారు. మొదట విధులకు హాజరు కావాలని సీజేఐ సూచించారు. నేషనల్ టాస్క్‌ఫోర్స్‌లో రెసిడెంట్ డాక్టర్లను కూడా చేర్చాలని ట్రైనీ డాక్టర్లు పేర్కొన్నారు. రెసిడెంట్ డాక్టర్ల సమస్యలను ఎన్‌టీఎఫ్ వింటుందని సీజేఐ భరోసా ఇచ్చారు. కమిటీలో భాగస్వాములుగా ఉండడానికి, కమిటీ ఎదుట వాదన చెప్పడానికి తేడా ఉంటుందని న్యాయవాదులు వెల్లడించారు. కోల్‌కతా డాక్టర్ అత్యాచారం కేసులో సుప్రీమ్ కోర్టుకు సీబీఐ సంచలన రిపోర్ట్‌ను వెలువరించింది. రేప్, మర్డర్ కేసును కప్పిపుచ్చే ప్రయత్నం చేశారని సీబీఐ తన రిపోర్టులో పేర్కొంది. తల్లిదండ్రులను సైతం తప్పుదారి పట్టించారని తెలిపింది. శవ దహనం తర్వాతే ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారని సీబీఐ పేర్కొంది. ఘటనా స్థలంలో ఆధారాలను ధ్వంసం చేశారని వెల్లడించింది.
కోల్‌కతా ట్రైనీ డాక్టర్ అత్యాచార ఘటనపై సీబీఐ స్టేటస్‌కో రిపోర్టును కోర్టుకు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అందించారు. సీజేఐ డివై చంద్రచూడ్ ధర్మాసనం సీబీఐ రిపోర్టును పరిశీలించింది. లోకల్ పోలీసుల నుంచి సేకరించిన సమాచారంతో పాటు సీబీఐ సేకరించిన ఆధారాలను కోర్టుకు సొలిసిటర్ జనరల్ అందించారు. సీ బీఐ అందజేసిన సీల్డ్ కవర్ స్టేటస్ రిపోర్ట్‌ను సుప్రీమ్ కోర్టు ధర్మాసనం పరిశీలించింది. ఘటన జరిగిన 5వ రోజు దర్యాప్తు రిపోర్టు తమ చేతికి అందిందని కోర్టుకు సొలిసిటర్ జనరల్ తెలిపారు. అప్పటికే చాలా వరకూ మార్చేశారని వెల్లడించారు. అయితే ప్రతి ఒక్కటీ వీడియోగ్రఫీ జరిగిందని బెంగాల్ ప్రభుత్వం తరుఫున కపిల్ సిబల్ తెలిపారు. మృతదేహానికి అంత్యక్రియలు జరిగిన తర్వాత ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారని సొలిసిటర్ జనరల్ తెలిపారు. సీనియర్ డాక్టర్లు, సహచరులు ఒత్తిడి చేయడంతోనే వీడియోగ్రఫీ చేశారన్నారు. అంటే అక్కడ కవర్-అప్ ఏదో జరుగుతుందని వారంతా భావించారని సొలిసిటర్ జనరల్ వెల్లడించారు.