- ప్రతిపక్షాలు బీజేపీని చావు దెబ్బ కొట్టాయి
- పేదలు, వయానడ్ ప్రజలు..వీరే నా దేవుళ్లు
- ప్రధానిలా నన్ను ఏ దేవుడు గైడ్ చెయ్యడం లేదు
- వాయనాడ్..రాయ్‌బరేలీ దేన్ని వొదులుకోవాలనే దానిపై డైలమాలో ఉన్నా
- ఎన్నికల అనంతరం వాయనాడ్ తొలి పర్యటనలో రాహుల్ గాంధీ
వాయనాడ్, జూన్ 12 : కేంద్రంలో ఏర్పడ్డ ప్రభుత్వం వికలాంగ ప్రభుత్వం అని, ప్రతిపక్షాలు బీజేపీని చావుదెబ్బ కొట్టాయని కాంగ్రెస్ అగ్ర నేత రరాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ తన వైఖరి మార్చుకోవాల్సి ఆవశ్యకత ఏర్పడిరదన్నారు. ప్రతిపక్షాలుగా తాము ప్రజల బాగు కోసం నిరంతరం పోరాడుతూనే ఉంటామని రాహుల్ స్సష్టం చేశారు. ఇక 2024 లోక్ సభ ఎన్నికల్లో కేరళలోని వయనాడ్ నియోజకవర్గం నుంచి గెలిపించినందుకు కేరళ వోటర్లకు ఏఐసీసీ అగ్రనేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కృతజ్ఞతలు చెప్పారు. కేరళలోని మలప్పురంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో రాహుల్ గాంధీ ప్రసంగించారు.
రాహుల్ గాంధీ వయనాడ్ నుంచే కాకుండా ఉత్తర్ ప్రదేశ్ లోని రాయ్ బరేలి నుంచి పోటీ చేసి విజయం సాధించారు. దీంతో అతను వయనాడ్ లేదా రాయ్‌బరేలిలో ఒక స్థానాన్ని వదులుకోవాల్సి ఉంటుంది. అయితే ఆ విషయంపై రాహుల్ గాంధీ స్పందిస్తూ..తన డైలమాలో ఉన్నానని.. వయనాడ్, రాయ్ బరేలిలో ఏ నియోజకవర్గాన్ని వదులుకోవాలో తనకు తప్ప అందరికీ తెలుసని అన్నారు. తను తీసుకునే నిర్ణయంతో రెండు నియోజకవర్గాల ప్రజలు సంతోషంగా ఉండటమే తనకు కావాలని తెలిపారు. ఇక ప్రధాని మోదీపై తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ అగ్రనేత. తాను దురదృష్టవశాత్తు మోదీలా కాకుండా మనిషిని అని.. ప్రధానిలా తనని ఏ దేవుడు గైడ్ చెయ్యడం లేదని అన్నారు. తనకు దేశంలోని పేదలు, వాయనాడ్ ప్రజలు దేవుళ్లని తెలిపారు.
అందుకే తాను వయనాడ్ ప్రజలకు కట్టుబడి ఉంటానన్నారు. ఇక అయోధ్య, ఉత్తరప్రదేశ్ లో బీజేపీ ఓటమి గురించి రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. భారతదేశం ఆత్మను, ప్రజల ఆలోచనలపై దాడి చేయడం వల్లే బీజేపీ ఓటమి పాలయ్యిందని అన్నారు. మన రాజ్యాంగంలో భారతదేశాన్ని రాష్ట్రాల యూనియన్ అంటారన్నారు రాహుల్. రాష్ట్రాలు, భాషలు, చరిత్ర, సంస్కృతి, మతం, సంప్రదాయాల కలయిక భారతదేశం అని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. కాగా ఇటీవలి ముగిసిన ఎన్నికల్లో రాహుల్ గాంధీ వయనాడ్ నుంచి పోటీ చేసి తన సమీప సీపీఐ అభ్యర్థి అన్నీ రాజాపై 3 లక్షల 64 వేల పైచిలుకు వోట్ల మెజారిటీతో ఘనవిజయం సాధించారు. 2019 ఎన్నికల్లో రాహుల్ గాంధీ వయనాడ్ నుంచి పోటీ చేసి 4.3 లక్షల రికార్డు స్థాయి మెజార్టీతో విజయం సాధించారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ మెజారిటీపై గాంధీ మాట్లాడారు.