మరోసారి కాకతీయ ఉత్సవాలకు ఓరుగల్లు ముస్తాబవుతున్నది. నేటి నుండి ఏడు రోజుల పాటు అత్యంత వైభవంగా ఈ ఉత్సవాలను నిర్వహించేందుకు ఉమ్మడి జిల్లాల యంత్రాంగమంతా సిద్దమయింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ‘కాకతీయ ఉత్సవా లంటూ ప్రత్యేకంగా నిర్వహిస్తున్నది ఈ సంవత్సరమే. సరిగ్గా పదేళ్ళ కింద ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మూడు రోజులపాటు ఉత్సవాలు జరిగాయి. కాగా, ఇవి తెలంగాణ ఏర్పడినతర్వాత జరిగే ఉత్సవాలు కావడంతో గతంలోకన్నా మరింత శోభాయమానంగా ఉంటాయనుకుంటున్నారు. అయితే నిర్వాహకులు ఉత్సవాల నిర్వహణకు ఎన్నుకున్న సమయమే సరిగాలేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడిప్పుడే వానలు జోరందుకుంటున్నాయి. ఎప్పుడు వర్షం వొచ్చేది, నిలిచిపోయేది తెలియని పరిస్థితి. గత కొద్ది రోజులుగా మబ్బులు, జల్లులు ఉంటున్నాయి. సహజంగా ఉత్సవాలన్ని ఆరుబయట నిర్వహించేవే కావడంతో అటు ఏర్పాట్లకు కూడా ఇబ్బందికర పరిస్థితి. అందునా సప్తాహమంటూ ఏడు రోజులపాటు ఏకధాటిగా చేపట్టే ఈ ఉత్సవాలు ఎలా కొనసాగుతాయాఅన్న ఆందోళన మాత్రం లేకపోలేదు.
ఏదిఏమైనా ఈసారి మాత్రం ఓ కొత్తదనం చోటుచేసుకోబోతున్నది. కాకతీయగడ్డగా గర్వపడే ఈ గడ్డపై నిజంగానే కాకతీయులు వొస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన పాలకులకు వొచ్చినట్లుంది. అందుకే వారి సంతతికి చెందిన వారిని ఈ ఉత్సవాల సందర్బంగా ఆహ్వానిస్తున్నారు. పాలనలోనూ, పరాక్రమంలోనూ, కళల పోషణలోనూ తమకంటూ ప్రత్యేకతను సృష్టించుకున్న కాకతీయుల పాలన ప్రతాపరుద్ర చక్రవర్తితో అంతమయిందిన్నది రిత్ర చెబుతున్న అంశం. ఆ తర్వాత ఆ రాజవంశం ఏమైందనడానికి అనేక కథలు పుట్టుకు వొచ్చాయి. దిల్లీ సుల్తాన్ సైన్యానికి బందీగా దొరికిన కాకతీయ చివరి రాజు ప్రతాపరుద్రుడిని దిల్ల్లీకి తీసుకుపోతున్న తరుణంలో, ఈ అవమానాన్ని భరించలేక ఆయన మార్గమధ్యలో యమునా నదిలోదూకి ఆత్మహత్య చేసుకున్నాడని కొందరు, మార్గమధ్యలో హత్యకావించబడినాడని మరికొందరు చరిత్రకారులు విశ్లేషించారు. అయితే ఆ తర్వాత వారి వంశంవారు ఎక్కడున్నారన్న విషయంలో అనేక భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ప్రతాపరుద్రుడి తమ్ముడిగా చెప్పబడుతున్న అన్నమదేవుడు ఎదోలాగా తప్పించుకున్నాడని, ప్రస్తుత ఛత్తీస్‌ఘడ్‌లోని బస్తరు ప్రాంతంలో ఒక చిన్న రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడన్న కథనాలు వొచ్చాయి.
1932 ప్రాంతంలో చరిత్రకారులు అనేక విషయాలను పరిశీలించి, పరిశోధించి కాకతీయ సంచిక పేరున వెలువర్చిన పుస్తకంలోకూడా వీరి సంతతివారు బస్తర్ ప్రాంతంలో స్థిరపడినట్లుగా పేర్కొనడం గమనార్హం. అయితే వారి పరిశోధన అక్కడికే పరిమితం కావడంతో కాకతీయుల వంశంగురించిన వివారాలు ప్రజలకు తెలియరాలేదు. ఆ తర్వాత కూడా ఈ విషయంలో పరిశోధనలు ముందుకు వెళ్ళినట్లు లేదు. అయినప్పటికీ కొందరు చరిత్రకారులు తమ సొంత ఖర్చులతో ఇంకా పరిశోధనలు సాగిస్తూనే ఉన్నారు. అలాంటివారికి ప్రభుత్వం అండదండలు అందించాల్సిన అవసరం ఎంత్తైనా ఉంది. ఉత్సవాలపేరున లక్షలాది •రూపాయలను వ్యయం చేస్తున్న రాష్ట్రప్రభుత్వం ఇలాంటివారికి చేయూతనిస్తే మరికొన్ని ఆసక్తికర విషయాలు వెలుగుచూసే అవకాశం లభిస్తుంది. వాటితోపాటు నాటి కళాఖండాలు అపురూప దేవాలయాల సంపదను కూడా భద్రపరచాల్సిన అవసరం ఉంది. ఇవ్వాల్టికీ కాకతీయ రాజమహల్ ఏదై ఉంటుందన్నది ఇంకా చర్చనీయాంశంగానే ఉంది.
కాకతీయుల శిల్ప కళా నైపుణ్యానికి మచ్చుతునకలైన వెయ్యిస్థంబాల ఆలయం, రామప్ప ఆలయాల పరిరక్షణ విషయంలో దశాబ్దాలకాలం వృధా అవుతున్నది. వెయ్యి స్తంభాల కల్యాణ పంటప పునరుద్ధరణ పనులు దశాబ్దాలు గడుస్తున్నా ఇంకా ఎక్కడ వేసిన గొంగళిలాగే ఉంది. కటాక్షపురం వద్ద ఉన్న రెండు దేవాలయాలు, నిడిగొండ ఆలయం, కాకతీయ ఆరాధ్యదేవత కాకతి ఆలయంగా పేరున్న మొగిలిచర్ల ఆలయం, అపురూప శిల్ప నిలయం రామానుజాపురం లాంటి వాటిని కాపాడుకోవాల్సిన అవసరం ఎంత్తైనా ఉంది. కాగా ఈ ఉత్సవాల్లో కాకతీయ వారసులు పాల్గొనడం సంతోషించతగిన విషయం. దాదాపు ఏడు వందల సంవత్సరాల తర్వాతైనా వారి వంశాంకురాన్ని ఓరుగల్లు ప్రజలు ఈ ఉత్సవాల సందర్భంగా కలుసుకోగలుగుతున్నారు. ఆ వంశ పరంపరలోని 22వ వాడుగా చెప్పబడుతున్న 38 ఏళ్ళ కమల్ చంద్ర బంజ్‌దేవ్ ఈ ఉత్సవాల్లో ముఖ్యఅతిధిగా పాల్గొనబోతున్నారు. 1984లో జన్మించిన బంజ్‌దేవ్‌కు తమ పూర్వికులపైన ఏమేరకు అవగాహన ఉందన్న విషయాన్ని ఆయనద్వారా వినేందుకు వరంగల్ ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.