ఓటమితో పార్టీ కార్యకర్తలు కుంగిపోవొద్దు

  • పంచాయితీ, పార్లమెంట్‌ ఎన్నికల్లో సత్తా చాటుదాం
  • ముందంతా మంచి కాలం
  • మాజీ మంత్రి, బిఆర్‌ఎస్‌ అగ్ర నేత హరీష్‌ రావు

సంగారెడ్డి, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 12 : పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటామని మాజీ మంత్రి హరీష్‌ రావు అన్నారు.  ఓడిపోయామని కుంగిపోవద్దు..వొచ్చే పంచాయతీ ఎన్నికలు, పార్లమెంట్‌ ఎన్నికల్లో తమ సత్తా చూపించాలని ఎమ్మెల్యే హరీష్‌ రావు అన్నారు. సంగారెడ్డిలో సోమవారం నిర్వహించిన బీఆర్‌ఎస్‌ కృతజ్ఞతా సభకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్రమంతా కొంత ఇబ్బంది ఉన్నా సంగారెడ్డిలో మాత్రం ఈ సారి గులాబీ జెండా ఎగిరింది. చింతా ప్రభాకర్‌ ఆరోగ్యం దెబ్బ తిన్నా ప్రతి ఒక్క కార్యకర్త అభ్యర్థిగా కష్టపడి పని చేశారని ప్రశంసించారు. అధికార పార్టీ వాళ్లు మన మానసిక స్టైర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తారు. టీఆర్‌ఎస్‌ పార్టీ పెట్టినప్పుడు కూడా ఎన్నో ఇబ్బందులు పడ్డాం. అయినా ఇబ్బందులు ఎదుర్కుని ఎన్నో విజయాలు సాధించామన్నారు.

2004 లో కాంగ్రెస్‌ మనతో పొత్తు పెట్టుకుని తెలంగాణ ఇవ్వలేదు. తెలంగాణపై కేసీఆర్‌కి ఉన్న ప్రేమ ఇతరులకు ఉండదని పేర్కొన్నారన్నారు. 14 ఏండ్లు కష్టపడి, పదవులు గడ్డి పోచల్లా వదిలేసి తెలంగాణ తెచుకున్నామని గుర్తు చేశారు. అధికారంలో ఉన్నప్పుడు పొంగిపోలేదు..లేనప్పుడు కుంగిపోలేదు. బీఆర్‌ఎస్‌ అధికార పక్షంలో ఉన్నా..ప్రతి పక్షంలో ఉన్నా మనమెప్పుడు ప్రజల పక్షమేనని స్పష్టం చేశారు. తెలంగాణాని అన్ని రంగాల్లో దేశంలోనే నంబర్‌వన్‌ స్థానంలో నిలబెట్టింది బీఆర్‌ఎస్‌ పార్టీనేనని తెలిపారు. ప్రజలు కాంగ్రెస్‌కు అవకాశం ఇచ్చారు. వాళ్లు మనకంటే బాగా చేయాలని కోరుకుందామన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ప్రజలకిచ్చిన హావిూల అమలు కోసం కొట్లాడుదామన్నారు. ప్రజల సమస్యలపై పోరాడే వారికే భవిష్యత్తు ఉంటుందని చెప్పారు. కార్యకర్తలు ఎవరు కూడా అధైర్య పడొద్దన్నారు. ఉమ్మడి మెదక్‌ జిల్లాలో ఏడుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. అందరం కలసి పని చేద్దామని పిలుపునిచ్చారు. ఓటమిపై సవిూక్ష జరుపుకుందామని, తప్పొప్పులు సరి చేసుకొని ప్రజల పక్షాన నిలబడుదామని కార్యకర్తలకు హరీష్‌ రావు సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page