- ప్రజా సమస్యలను చట్టసభల్లో లేవనెత్తి వాటి పరిష్కారానికి కృషి చేస్తా
- త్యాగరాయ గానసభలో జరిగిన ఆత్మీయ పౌర సన్మాన సభ,లో ప్రొ.కోదండరామ్
హైదరాబాద్, ప్రజాతంత్ర,సెప్టెంబర్04: ఎమ్మెల్సీ పదవిని బాధ్యతగా భావి స్తానని తెలంగాణ రాష్ట్ర శాసన మండలి సభ్యులు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. రాష్ట్ర ప్రజల సమస్యలను చట్టసభల్లో లేవనెత్తి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ జన సమితి గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు యం.నర్సయ్య ఆధ్యర్యంలో ప్రొఫెసర్ కోదండరామ్ కు ఆత్మీయ పౌర సన్మానం సభ బుధవారం త్యాగరాయ గానసభలో ఘనంగా నిర్వ హించారు. ఈ కార్యక్రమంలో కోదండరామ్ మాట్లాడుతూ..పదవి అనేది సాధనమే కానీ అది అంతిమ లక్ష్యం కాదు అన్నారు. తెలంగాణ ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యల పరిష్కారానికి కృషి చేయడంలో భాగంగా ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ తన వంతు ప్రయత్నాలు కొనసాగిస్తానని తెలిపారు.
ప్రజల కోసం జీవితాలని అంకితం చేసిన రామ్ మనోహర్ లోహియా, కర్పూరి ఠాకూర్, గుమ్మడి నరసయ్య లాంటి మహనీయులను ఆదర్శంగా తీసుకొని ప్రజల కోసం వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని తెలిపారు. తె లంగాణ అభివృద్ధి కోసం అన్ని వర్గాలు, సమూహాలు ఉద్యమకారులతో కలిసి ఎప్పటిలాగే పనిచేస్తానని వివరించారు. తెలంగాణ ఉద్యమం లో నడిచిన వారంతా తెలంగాణ జన సమితిలో ఉన్నారు కాబట్టి పార్టీ గొప్పగా నిలబడి ముందుకు సాగుతుందని అన్నారు. విలువలకు కట్టుబడి ఉద్యమం నుంచి పని చేస్తూ వస్తున్నామని అలాంటి వారితో కలిసి పనిచేసి రాష్ట్ర అభివృద్ధికి పాడుతానని తెలిపారు. విలువలకి కట్టుబడి పని చేసిన వారు దేశ రాజకీయాల్లో అనేకమంది ఉన్నారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. రాజకీయాల్లో ఉంటేనే మార్పు సాధ్యమని ప్రజల జీవనస్థితిగతులు మెరుగుపడతాయని భావించి తెలంగాణ జన సమితిని ఏర్పాటు చేశామని ఆయన చెప్పారు.
ప్రొఫెసర్ జయశంకర్ సమకాలికుడు చంద్ర శేఖర్ మాట్లాడుతూ…జనంలో ఉండే వ్యక్తి జనం కోసం పనిచేసే వ్యక్తి కోదండరాం ఎమ్మెల్సీ రావడం అభినందనీయమని అన్నారు. ఆయనకు సన్మానం అంటే మాకు జరిగినట్టుగా భావిస్తామని అన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణతో ముడిపడి ఉన్న వ్యక్తులు ఎవరు అని వెతికితే కోదండరాం ప్రముఖంగా కనిపిస్తారని అన్నారు. ప్రజల కోసం పోరాడే వ్యక్తి ప్రభుత్వంలో ఉంటే ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని ఆయన అన్నారు. సభాధ్యక్షత వహించిన జనసమితి హైదరాబాద్ అధ్యక్షుడు ఎం.నర్సయ్య మాట్లాడుతూ.. కోదండరామ్ ను సన్మానించడం అంటే తెలంగాణ సమాజాన్ని, తెలంగాణ ఉద్యమకారులను సన్మానించడమేనని అన్నారు. సబ్బండ వర్గాల ఆత్మగౌరవం కోసం పనిచేసే కోదండరామ్ ను సన్మానించడం ఎంతో గొప్పగా ఉందని తెలిపారు. ఈ సందర్భంగా ప్రో. కోదండరామ్ ను వివిధ సంఘాల నాయకులు, ఉద్యోగస్తులు, జర్నలిస్టు హౌసింగ్ సొసైటీ సభ్యులు, విద్యార్థి నాయకులు, పలువురు ప్రముఖులు, రాజకీయ నాయకులు ఆయన ను ఘనంగా సత్కరించారు.