చంద్రయాన్-3 విజయంపై ఆనందాతిరేకాలు
ప్రజాతంత్ర ఇంటర్నెట్ డెస్క్,ఆగస్ట్ 23: చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టి ఇస్రో చరిత్ర సృష్టించింది. నిర్దేశించిన సమయంలో విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై సురక్షితంగా సాప్ట్ ల్యాండ్ అయింది. ఇప్పటి వరకు ఏ దేశం కూడా వెళ్లని జాబిలి దక్షిణ ధ్రువానికి చేరుకుంది ఇస్రో. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) సాధించిన ఈ అద్భుతమైన ఘనతను పార్టీలకు అతీతంగా రాజకీయ నాయకులు అందరూ కొనియాడారు. ’మానవ సమాజానికి మరో అతిపెద్ద ముందడుగు! చంద్రయాన్-3 విజయవంతంగా చంద్రుడిపై ల్యాండ్ కావడం మానవుని ప్రతిభకు నిదర్శనం.
ఈ అద్భుతమైన విజయం వెనక ఉన్న మేధావులకు అభినందనలు’ అని అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ ట్విట్టర్ లో పోస్టు చేశారు.’ 140 కోట్ల మంది భారతీయులకు అభినందనలు’ అనిఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ పోస్టు చేశారు. చంద్రయాన్-3 కి శుభాకాంక్షలు! దాని అద్భుతమైన విజయానికి అభినందనలు. ఇస్రోకు సెల్యూట్.భారత్ ఇప్పుడు అంతరిక్షంలో సూపర్ లీగ్ లో ఉంది. సాహసయాత్రలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక అభినందనలు’ అని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ట్వీట్ చేశారు. ఇది సాటిలేని విజయం. ఈ అద్భుతమైన విజయం ఇస్రో అచంచలమైన స్ఫూర్తికి నిదర్శనం.
వారి నిబద్ధత, నిరంతర కృషి ప్రతి భారతీయుడి హృదయాన్ని గర్వంతో ఉప్పొంగేలా చేశాయి’ అని ఆప్ నేత రాఘవ్ చద్దా ట్వీట్ చేశారు. 1962లో ప్రారంభమైన భారతదేశ అంతరిక్ష కార్యక్రమం నేడు చంద్రయాన్-3 రూపంలో కొత్త శిఖరాన్ని నెలకొల్పింది. దేశ ప్రజలందరికీ ఇది సంతోషకరమైన క్షణం. శాస్త్రవేత్తలకు, దేశ ప్రజలందరికీ అభినందనలు, శుభాకాంక్షలు. జై హింద్’ అని కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా ట్వీట్ చేశారు. చంద్రయాన్-3 మిషన్ ప్రయోగం విజయవంతం అయినందుకు ఇస్రోకు అభినందనలు. చంద్రుని ఉపరితలాన్ని జయించిన నాల్గో దేశంగా భారత్ నిలవడం చిరస్మరణీయ విజయం. భారతదేశ అంతరిక్షణ పరిశోధనలకు ఇదో పెద్ద ముందడుగు’ అని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ట్వీట్ చేశారు.