- స్లూయీస్ మూసివేయటంలో నిర్లక్ష్యం
- భద్రాచలం పట్టణాన్ని చుట్టుముట్టిన గోదావరి వరద
- ప్రతీఏటా పట్టణానికి ఇదే దుస్థితి
భద్రాచలం,ప్రజాతంత్ర ,జూలై 15 : కోట్ల రూపాయలతో గోదావరి వరద నిరోధక కరకట్టను నిర్మించినప్పటికి భద్రాచలం పట్టణానికి మాత్రం ప్రతీఏటా వరదముంపు తప్పటం లేదు. పట్టణంలో వచ్చిన నీటిని గోదావరిలోకి పంపేందుకు కరకట్ట నిర్మించిన సమయంలోనే స్లూయీస్‌ను ఏర్పాటు ఏర్పాటు చేసారు. అవి ప్రస్తుతం గోదావరి వరదలు పట్టణాన్ని ముచ్చెతేందుకు ఉపయోగపడుతున్నాయని చెప్పవచ్చు. గోదావరి వరద వచ్చే సమయంలో స్లూయీస్‌ను పూర్తిగా మూసివేయాల్సిన ఇరిగేషన్ అధికారులు భాధ్యతారాహిత్యం వలనే భద్రాచలం పట్టణానికి వరదముప్పు వాటిల్లుతుంది. వరద ప్రభావం ఎక్కువగా ఉంటుందని సెంట్రల్ వాటర్ కమీషన్ అధికారులు ఎప్పటికప్పుడు తెలియపరుస్తున్నప్పటికి ఇరిగేషన్ అధికారులు మాత్రం శ్రద్ద చూపకపోవడం హాస్యాస్పదం.
సరైన సమాచారం ఇరిగేషన్ అధికారులకు లేకపోవటమే ఇందుకు నిదర్శనమని పట్టణ ప్రజలు తీవ్ర ఆగ్రహం చెందుతున్నారు. ఏదో ఒక ఏడాది ఇటువంటి సమస్య ఏర్పడుతుందంటే ప్రజలు తట్టుకునే పరిస్తితి ఉంటుంది. ప్రతీఏటా ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యం వలనే పట్టణంలోని విస్తా కాంప్లెక్స్ ,అయ్యప్పకాలనీ, కొత్తకాలనీలలో వరదనీరు భారీగా చేరుకుంటుంది. వరద నీరు పట్టణంలోకి వచ్చిన తరువాత ఇరిగేషన్ అధికారులు మోటార్ల ద్వారా వరదనీటిని మళ్ళీ గోదావరిలోకి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇరిగేషన్ అధికారులు గోదావరిలోకి పంపిచే నీరు తక్కువ. గోదావరిలో నుండి స్లూయీస్ ద్వారా వచ్చే నీరు ఎక్కువగా ఉండటం వలన వరదనీరు ఇండ్లలోకి వెళ్ళి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఎప్పటికప్పుడు వరద ప్రభావం పరిస్థితిని కలెక్టర్ మరియు సిడబ్ల్యూసి అధికారులు చెప్తునప్పటికి ప్రజలను వరదలభారీ నుండి తప్పించలేని పరిస్థితిలో ఇరిగేషన్ అధికారులు ఉన్నారు. అయ్యప్పకాలనీ ప్రాంతంలో స్లూయీస్ ద్వారా భారీగా వరదనీరు చేరుకుంది. ఆ నీటిని కేవలం చిన్నపాటి కెపాసిటి ఉన్న మోటర్ల ద్వారానే నీటిని ఎత్తుతున్నారు. అయినప్పటికి శుక్రవారం మధ్యాహ్నం 1 గంట సమయంలో అనేక ఇండ్లలోకి వరదనీరు చేరుకుంది. హుటాహుటిన పునరావాస కేంద్రాలకు వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రతీఏటా ఇరిగేషన్ అధికారులు భాధ్యతారాహిత్యం వలనే స్లూయీస్ నుండి వరద నీరు కాలనీల్లోకి ప్రవేశిస్తుంది. ఇటువంటి సమస్యలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలి.