గతవానాకాలం నుండి ఇప్పుడు యాసంగి పంటవరకు వడ్లు ఎవరు కొనాలన్న పంచాయితీ తెగుతులేదు . దశాబ్దాలుగా కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నట్లు ఇప్పుడు కూడా కేంద్రమే కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఒక పక్క, కాదు మేము కొనలేము రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని కేంద్ర ప్రభుత్వం చేస్తున్న వాదనలు రైతులను అయోమయంలో పడేస్తున్నాయి. గడచిన అయిదారు దశాబ్దాల కాలంగా ఏనాడు రాని సమస్య ఇప్పుడే ఎందుకు వొస్తుందో అర్థంకాదు. ఇతర రాష్ట్రాల్లో లేని ఈ సమస్య తెలంగాణలోనే ఎందుకు వొస్తుందన్నది కూడా అంతుపట్టకుండా ఉంది. బిజెపి వర్సెస్ తెరాసగా కొనసాగుతున్న రాష్ట్ర రాజకీయాలు రైతు సమస్యగా తయారయింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పంతాల మధ్య రైతులు పిచ్చివాళ్ళు అవుతున్నారు.
ఇంతకాలంగా ఎవరికి తోచిన పంటను వారు వేసుకుని, దిగుబడి వొచ్చినదానితోనే సంతృప్తి పడుతున్న రైతాంగాన్ని ఫలానా పంటనే వేయాలన్న నిబంధన కుంగదీస్తున్నది. కేంద్రం ఆదేశాలవల్లే తాము పంటల మార్పిడి గురించి రైతులపై వొత్తిడి తెచ్చామంటున్నది రాష్ట్ర ప్రభుత్వం. కాదని కొట్టి పారేస్తున్నది కేంద్రం. ఇందులో ఎవరి మాట నమ్మాలో తెలియని పరిస్థితి. ఇప్పటికే తమ వద్ద ధాన్యం నిలువలు పెరిగి పోయాయి. ఇక ధాన్యసేకరణ తమకు శక్తికిమించిన భారమవుతుందని చెప్పడంతోనే వరి వేసుకోవద్దని రైతాంగానికి చెప్పామని చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వం, ఒక వేళ ఎవరైనా వరి వేసుకోదలుచుకుంటే వారే ప్రైవేటు మిల్లర్లతో మాట్లాడుకుని వేసుకోవాలని సూచించింది. అయినా వానకాలం రైతులు వరి వేయకుండా ఉండలేకపోయారు. దానికి రైతులు అనేక కారణాలు చెప్పారు. వరి పంట తప్ప తమవద్ద మరేది పండదని కొందరు, ఇతర పంటలకు కావాల్సిన వసతులు లేవని మరికొందరు, పంట మార్పిడికి సంబంధించిన సమాచారం తమ వద్దలేదని ఇంకొందరు ఇలా అనేక కారణాలతో వరి పండించిన వారి ధాన్యాన్ని తీసుకునే విషయంలో చేసిన ఆలస్యంతో రైతాంగం ఎన్ని ఇబ్బందులకు గురి అయింది అనుభవంలో ఉన్న విషయమే.
అయినా యాసంగిలో కూడా అదే తంతు. కాకపోతే కొందరు మాత్రం వానాకాలం అనుభవంతో వెనక్కు తగ్గినా యాసంగిలో కూడా వరి సాగు బాగానే జరిగింది. మొత్తంమీద ఈ గందరగోళ వాతావరణంతో వరిసాగు 45 శాతం తగ్గిందనే చెప్పాలె. ఇప్పుడు వరి కోతలు మొదలవుతున్న తరుణంలో వొచ్చే ధాన్యాన్ని ఎవరు కొనుగోలు చేయాలన్న వాదన మొదలయింది. కేంద్రమే కొనుగోలు చేయాలని రాష్ట్రం, కాదు రాష్ట్రమే కొనుగోలుచేయాలని కేంద్రం మధ్య గొడవ జరుగుతున్నది. రాష్ట్రంపైన కేంద్రం కక్షసాధింపు చర్యలు చేపట్టిందని రాష్ట్రంలోని అధికార పార్టీ నాయకులు దుయ్యబడుతుంటే, కేంద్రాన్ని అప్రతిష్టపాలు చేయాలని టిఆర్‌ఎస్ సర్కార్ కుట్ర చేస్తున్నదని బిజెపి కేంద్ర నాయకులు ఆరోపిస్తున్నారు. గతంలో చేసుకున్న ఒప్పందంమేరకే కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేస్తున్నదని వారు చెబుతున్నారు. గత ఒప్పందాన్నే పూర్తిచేయకుండా తమపై రాష్ట్ర ప్రభుత్వం నిందారోపణలు చేస్తోందని సాక్షాత్తు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చెబుతున్నారు. నిరుడు యాసంగిలో 92.34 లక్షల టన్నుల వడ్లు కొనుగోలుకు ఎఫ్‌సిఐ అనుమతిచ్చింది. దాని ప్రకారం మిల్లింగ్ చేసి 62.53 లక్షల టన్నుల బియ్యాన్ని ఎఫ్‌సిఐకి ఇవ్వాల్సి ఉండగా సంవత్సర కాలం కావస్తున్నా వడ్ల మిల్లింగ్ పూర్తికాలేదు. ఇంకా రా రైస్ 6.63 లక్షల టన్నులు, బాయిల్డ్ రైస్ 3.08 లక్షల టన్నులు కలిపి 9.01 లక్షల టన్నుల బియ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందించాల్సి ఉంది.
ఆ ఆర్డర్‌నే పూర్తిచేయకుండా అనవసరంగా కేంద్రాన్ని ఆడిపోసుకుంటున్నారని కిషన్‌రెడ్డి చెబుతున్నారు. వాస్తవానికి మిల్లింగ్ చేసే విషయంలో రైస్ మిల్లు ల కెపాసిటి సరిపోవడంలేదు.అందుకు మిల్లుల కెపాసిటీని పెంచుకోవాల్సిన అవసరాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తుంచుకోవాలంటున్నారు కిషన్‌రెడ్డి. ఇదిలా ఉంటే వడ్లు లేదా బాయిల్డ్ రైస్ కాకుండా రా రైస్ (ముడి బియ్యం) ఇస్తేనే తీసుకుంటామని కేంద్రం పట్టుపట్టడాన్ని రాష్ట్ర ప్రభుత్వం విమర్శిస్తోంది. వాస్తవంగా ఒకసారి ధాన్యం కొనుగోలు చేయమని, మరోసారి బాయిల్డ్ రైస్ ఇవ్వాలని, ఇంకోసారి ముడి రైస్ అయితేనే కొంటామని ఇలా నానారకాలుగా చెబుతూ రాష్ట్రాన్ని ఇరుకున పెడుతున్నదంటున్నారు టిఆర్‌ఎస్ నాయకులు. దీనిపైన స్పష్టమైన హామీ ఇచ్చేవరకు దిల్లీ నుండి గల్లీ వరకు పోరాటం చేసేందుకు టిఆర్‌ఎస్ ప్రభుత్వం, పార్టీ సిద్దమవుతున్నది. ఇప్పటికే గ్రామ పంచాయితీ మొదలు జిల్లా పరిషత్ వరకు సమావేశాలు నిర్వహించి ఈ విషయంలో తీర్మానాలను ఆమోదించి కేంద్రానికి పంపే కార్యక్రమాలను చేపట్టారు. కాగా ఉగాదినుండి కేంద్రంపై సమరానికి కూడా రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తున్నది. స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ప్రధాని మోదీని కలిసి పరిస్థితిని వివరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తున్నది. ఈ మేరకు ప్రధాని అప్పాయింట్ మెంట్ తీసుకోవాల్సిందిగా టిఆర్‌ఎస్ ఎంపిలకు అదేశించినట్లు తెలస్తున్నది. అప్పటికీ కేంద్రం దిగిరాకపోతే ఇక కేంద్రంతో సమరమేనంటున్నారు టిఆర్‌ఎస్ నేతలు. ఈ పంచాయితీ తెగేదెప్పుడు తమ ధాన్యం కొనేదెప్పుడన్న దిగులు రైతాంగానికి తప్పేట్లులేదు.