తెలంగాణ కళా సౌందర్యం

-వనపట్ల సుబ్బయ్య

తెలంగాణ మట్టి వాసనను ఊపిరిలో నింపుకొని

ఈ నేల గుండె చప్పుడును కళలతో పలికించిన కళాకేతనం

కాలం గీసిన కళా సౌందర్యుడు!

కుంచె పట్టినా మట్టి మనిషి ముఖమే కనిపిస్తుంది

కెమెరా కన్ను తెరిచినా కాలం కదలికే ఆనవాలవుతుంది

నాటకం రాసినా ప్రజల మాటే వినిపిస్తుంది

సినిమాలో తెలంగాణ పల్లె ప్రపంచ తెరమీద కదలాడింది

‘మా భూమి’లో మట్టి మనుషుల బతుకు

‘రంగుల కల’లో కలల కదలిక

‘దాసి’లో నలిగిన జీవితాల వెత…

సెల్యులాయిడ్‌పై తెలంగాణ పల్లె బతుకులకు

శాశ్వత అక్షర దృశ్యమయ్యాడు

రేచుక్కలా రంగుల కలలను అద్ది

‘మా భూమి’తో తెలంగాణ సినిమా సత్తా చాటి

‘దాసి’ చిత్రంతో స్వర్ణాక్షరాల మేలిమిగా నిలిచాడు

కళాశాలలో నేర్చుకున్న కళలను గోడలకే పరిమితం చేయలేదు

వీధిలోకి వచ్చిండు, ప్రజల్లో కలిసిండు

ఉద్యమం వైపు నిలబడి కళకు ఒక సామాజిక గొంతుకనిచ్చిండు

‘ఆర్ట్ లవర్స్’తో కొత్త తరానికి దారి చూపిండు

గద్దర్‌తో కలిసి కళాకారుల ప్రతిభకు వేదికయ్యిండు

కళాకారుడిని తీర్చిదిద్దడమే కాదు

ఒక తరం సాంస్కృతిక చైతన్యానికి చిహ్నమై

ముందుకు నడిపించిండు

పంచభూతాలన్నీ ఆ సృజనలోనే కొలువున్నాయి!

ఉద్యమ సవ్వడికి కుంచె కదిలింది,

అన్యాయం కనిపిస్తే ధిక్కార అక్షరమై నిలిచింది

ప్రజల గొంతు నొక్కితే నాటకమై నినదించింది

కళ అంటే కేవలం అందం కాదని

ప్రజల పక్షాన నిలబడే బాధ్యత అని చాటిండు

సంపన్న కుటుంబంలో పుట్టినా సంపద చుట్టూ తిరగలేదు

సామాన్యుల మధ్యే కలిసిమెలిసి మట్టి మనిషిగా నడుస్తున్నడు

బతుకమ్మ బోనం నుంచి సమ్మక్క-సారలమ్మ జాతర దాకా

జానపద కళల నుంచి తెలంగాణ జీవన సౌందర్యం దాకా

అన్నిటినీ పుస్తకాల్లో పదిలం చేసి తరతరాలకు అందిస్తున్నడు

మరుగునపడ్డ కళాకారుల చిత్రాలకు వెలుగు తెచ్చిండు

అరుదైన గ్రంథాలను ఏరి పట్టి

తెలంగాణ జ్ఞాపకాల భాండాగారాన్ని సమృద్ధం చేసిండు

‘తెలంగాణ ప్రచురణలు’తో మట్టిలో దాగిన మాణిక్యాలను

బయటికి తెచ్చిండు

ఒగ్గుకథ, బుర్రకథ, ఉద్యమం, పెయింటింగ్

చిత్రకళా ప్రదర్శన, జన నాట్యమండలి తెలుగు సినిమా

ప్రపంచ గుర్తింపు తెచ్చిన తెలంగాణ ప్రచురణలన్నింటినీ

ఒకే గుండెలో నింపుకున్న నిఖార్సైన సహృదయుడు

కుంచెలో తెలంగాణ రంగు కెమెరాలో తెలంగాణ ముఖం

చిత్రంలో తెలంగాణ బతుకు అక్షరంలో ఈ నేల ఆత్మగౌరవం

ఎందరినో సానబెట్టిన వజ్రం

ఎన్నింటినో తీర్చిదిద్దిన ఒరిపిడి రాయి

ఆజానుబాహుడు, నాగలి కోలంత ఎత్తు

నవరసాలు పలికే గంభీర గళం

మన తెలంగాణ కళారంగానికే చంద్రబింబం

నరసింగరావు కళాకారుడి పేరు కాదు

తెలంగాణ సాంస్కృతిక చరిత్రలో ఒక అధ్యాయం

ఒక నడిచే కళాశాల, ఒక తెరిచిన గ్రంథాలయం

అంబేద్కర్ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్‌తో

ఆయన్ని సత్కరిస్తున్న వేళ

గౌరవం పొందుతున్నది ఒక్క వ్యక్తి కాదు

తెలంగాణ కళా సంస్కృతే

కళలకే అంకితమైన జీవితం

దక్కను పీఠభూమికి నిలువెత్తు సంతకం

(అంబేద్కర్ విశ్వవిద్యాలయం 27వ స్నాతకోత్సవంలో

బి. నరసింగరావుకు గౌరవ డాక్టరేట్ ఇచ్చిన సందర్భంగా)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *