ధర్మాధర్మాలు! బమ్మిడి జగదీశ్వరరావు

మెరుపు తీగెలు

“దొంగోడు కాలింగ్ బెల్ నొక్కినట్టు” అని పగలబడి నవ్వాడు ముదరదొంగ.

లేతదొంగ ముఖం వాడిపోయింది. మరేమీ మాట్లాడలేదు. అతికష్టం మీద నవ్వుని అదుపు చేసుకున్న ముదరదొంగ “వొరే… నీనూ దొంగతనాలు మొదలెట్టిన తొలిరోజుల్లో నీలాగే వుండీవోడ్ని. నువ్వు నా అంత అనుబవం వచ్చీసరికి నన్ను మించిపోతావ్ సూడు, యేటి?” అన్నాడు.

అయినా లేతదొంగ వినలేదు. వాడి నిజాయితీ వాడిది. అందుకే అంగీకరించనట్టు తలను అడ్డంగా వూపాడు.

“పోనీ, పందెమా?” అన్నాడు ముదరదొంగ. లేతదొంగ పెదవి విరిచాడు. ఆ విరుపు ముదరదొంగ మాటల్ని లక్ష్యపెట్టనట్టుగా తోచింది.

“చేసేదే దొంగపని. అందులో యింక నీతేటి? నిజాయితీ యేటి?” అసహనం యెక్కువైన ముదరదొంగ కాస్త గింజుకున్నట్టే అన్నాడు.

“చేసేది దొంగపని కాబట్టే, ఆ చేసేదాంట్లోనయినా దరమ్ముండాలి” అని వాదించాడు లేతదొంగ.

“నువ్వు యీ మద్దిన గరికపాటిగోరివి, కోటేశ్వర్రావుగోరివి కొటేసన్లు బాగా యింటున్నట్టున్నావ్… పోన్జూసుకొని. అయినా, ఆల డూటీ ఆలది… మన డూటీ మనది” తేల్చి తెంపేద్దామని అనుకున్నాడు ముదరదొంగ.

“పాపంలోనయినా కొంచెం పున్నెం వుండాల” అన్నాడు లేతదొంగ.

“ఈల ప్రవచనాలు కాదుగాని నీ బుర్ర సెడిపోయి దొంగతనం సేసేవనుకో, దొరికిపోతే పోలీసోడి లాటీకి పాపం పుణ్యం వొక్కలాగే కనపడతాయి” అని గడ్డం పట్టుకుచెప్పి, ఆపై “మనం వాదించుకుంటూ వుండిపోతే తెల్లారిపోతాదిరొరే…” అన్నాడు ముదరదొంగ, ‘అర్థమయిందా’ అన్నట్టు చూస్తూ.

లేతదొంగ మంకుపట్టు పట్టినట్టు అలాగ వుండిపోతే, విసిగిపోయిన ముదరదొంగ “సరే, యేటిసేద్దామో నువ్వే చెప్పయితే?” అన్నాడు.

“నీను కాలింగ్ బెల్లు కొట్టి, ఆ యింట్లోవోళ్ళని మాటల్లో పెడతా, నువ్వు యెనకాల పెరట్లోనుండి యెళ్ళి సర్దాల్సినవి సర్దీ” అన్నాడు లేతదొంగ.

‘ఇందులో దరమ్ము యేటుంది?’ అని అనుకున్న ముదరదొంగ “యీ లోపల ఆలు వచ్చిస్తే?” అని అడిగాడు.

“దొంగలమని చెపుతాం” అన్నాడు లేతదొంగ.

“గొప్ప నిజాయితీరా” కళ్ళు అప్పుడే పేలినట్టు విప్పారి చూశాడు ముదరదొంగ.

“మనం దొంగలమని చెపితే, ఆల గొసిలూ గుండారలూ తడిసిపోతాయి” అని లేతదొంగ చెప్పాడు.

“వోహో ‌అప్పుడు మనకి పున్నిం పురుసార్దం దక్కుతాయాన్నమాట” ముదరదొంగ తానే లేతదొంగయినట్టు చేతులు కట్టుకొని తలూపి “అయితే అలాక్కానీ” అనీసి చీకటిలో కలిసిపోయాడు.

గోడ దూకి సన్‌సైడ్ యెక్కి మేడమీదికి పాకి యింట్లో యెత్తుకెళ్ళవలసినవి జాగర్తగా సర్దీసి పనిపూర్తి చేసి ముదరదొంగ కిందికి దిగి వచ్చీసాడు. లేతదొంగ కాలింగ్ బెల్ కొట్టి నిద్దరలో వున్నవాళ్ళు లేచి తలుపు తీసేసరికే.

ఇంటిల్లిపాదీ కాపు కాసి యింట్లోకి వచ్చిన లేతదొంగని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. అరెస్టయి జైల్లోపడ్డ ధర్మబద్ద లేతదొంగని అధర్మబద్దంగా దొంగలించిన సరుకూ సరంజామా అమ్మి, ఆ డబ్బుతోనే విడిపించాడు ముదరదొంగ.

ఆ తరువాత కాలంలో ముదరదొంగను మించిపోయాడు లేతదొంగ!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *