చైత్రమాసపు ఉషస్సులా
జగతిని మైమరపించే
వసంతభామినిలా
పచ్చని చిగురుటాకుల
పావడాకట్టి
కబరిపై మల్లెలు సింగారించి
మధుపములు
మంజులనాదం చేస్తుండగా
చిరునగవులొలికిస్తూ
హంసలా అడుగులేస్తూ
మధుమాసపు కోకిలలు
పంచమంలో
స్వాగతగీతం పాడుతుండగా
తెలుగు వెలుగు నేనని
షడ్రుచుల సమ్మేళనం నేనేనంటూ
మమతానురాగాలను
పెనవేసుకుంటూ
అందరి ఆశలు ఈడేర్చగ
వసంత సంతకం చేస్తూ
శుభాలిచ్చుటకై
శుభముఖంతో వేంచేస్తున్న
వయ్యారిభామ ‘‘శుభకృత్’’ కి
మనసారా ఆహ్వానం పలుకుదాం
ముదమారా హారతులిద్దాం…
– వేమూరి శ్రీనివాస్,9912128967, తాడేపల్లిగూడెం