– దేశవ్యాప్తంగా రోజ్‌గార్ మేలాలో 51 వేల మందికి ఉద్యోగాలు
– ఇప్పటివరకు 12.5 లక్షల మందికి ఉద్యోగావకాశాలు
– 19వ రోజ్‌గార్ మేలాలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 24: దేశవ్యాప్తంగా 47 ప్రాంతాల్లో శనివారం జరిగిన రోజ్‌గార్ మేలాలో 51 వేల మందికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. యువత స్వయంసమృద్ది సాధించి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. బోయిగూడలోని రైల్ కళారంగ్‌లో జరిగిన 19వ రోజ్‌గార్ మేళాలో కేంద్ర మంత్రి ప్రసంగించారు. ఈరోజు 220మంది కొత్తగా ఉద్యోగాల్లో చేరుతున్నారన్నారు. 2022లో దీపావళి రోజున మొదలైన రోజ్‌గార్ మేలా ద్వారా ఇప్పటివరకు 12.5 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించామని వెల్లడించారు. ఇది కేవలం ఉద్యోగాల కార్యక్రమం కాదని, యువత భవిష్యత్తు కోసం మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన పెద్ద మిషన్ అని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగాలతోపాటు ప్రైవేట్ కంపెనీల్లో కూడా కోట్ల సంఖ్యలో ఉద్యోగాలు వస్తున్నాయన్నారు. స్టార్టప్స్, యూనికార్న్స్ వల్ల యువత ఉద్యోగాలు అడిగే స్థాయి నుంచి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి వచ్చిందని కేంద్ర మంత్రి అన్నారు. రోడ్లు, ఎయిర్‌పోర్టులు, రైల్వేలు, మెట్రోలు, ఇండస్టియ్రల్ కారిడార్లు వంటి ప్రాజెక్టులతో భారీగా ఉపాధి పెరుగుతోందన్నారు. దేశంలో ఏడా రూ.12 లక్షల కోట్ల ఇన్‌ఫ్రా పనులు జరుగుతున్నాయని వివరించారు. ప్రతి లక్ష కోట్ల పెట్టుబడికి 14 నుంచి 15 లక్షల ఉద్యోగాలు వస్తున్నాయన్నారు. యువతను మోదీ వికసిత భారతానికి సూపర్ హీరోలుగా చూస్తున్నారన్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ ద్వారా కోట్లమంది యువతకు శిక్షణ ఇస్తున్నామని చెప్పారు. గ్రామీణ యువతకు కూడా ఆధునిక టెక్నాలజీని మాతృ భాషలో నేర్పిస్తున్నామని తెలిపారు. భారత యువత ప్రపంచస్థాయిలో రాణిస్తోందని కిషన్ రెడ్డి అన్నారు. సెమీకండక్టర్లు, స్పేస్, డ్రోన్ టెక్నాలజీలో భారత్ ముందుకు వెళ్తోందన్నారు. చంద్రుడి దక్షిణ ధ్రువానికి ముందుగా చేరిన దేశం భారత్ అని తెలిపారు. ’ఆపరేషన్ సిందూర’ సమయంలో స్వదేశీ డ్రోన్లు శత్రు క్షిపణులను అడ్డుకున్నాయన్నారు. 2047 నాటికి వికసిత భారత్ లక్ష్య సాధనలో యువత పాత్ర కీలకమన్నారు. యూనివర్సిటీలు, కాలేజీలు, పీఎం-శ్రీ స్కూల్స్ సంఖ్య పెంచామని తెలిపారు. భారత్ ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందన్నారు. 2014కు ముందు వందల స్టార్టప్స్ మాత్రమే ఉండగా ఇప్పుడు 1.2 లక్షలకుపైగా ఉన్నాయన్నారు. మైనింగ్, బొగ్గు రంగాల్లో కూడా మంచి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయంటూ మైనింగ్, ఇంజనీరింగ్ వంటి కోర్సులపై యువత దృష్టి సారించాలని మంత్రి కిషన్ రెడ్డి సూచనలు చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





