ఈ ఎన్నికలు బిఆర్‌ఎస్‌కు జీవన్మరణ సమస్యగా మారింది. పదేళ్ళు అధికారంలో ఉన్నంత మాత్రాన ఈ ఎన్నికల్లో విజయం సాధించడమన్నది ఆ పార్టీకి నల్లేరుమీద నడకేమీకాదన్న విషయం గత ఇరవై అయిదు రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయాలు స్పష్టం చేస్తున్నాయి. కురుక్షేత్ర యుద్ధంలో అభిమన్యుడిని చుట్టుముట్టినవిధంగా బిఆర్‌ఎస్ చుట్టూ దాదాపు అన్ని రాజకీయ పార్టీలు ఏకమై ఉచ్చు బిగిస్తున్నట్లుంది. ఈ విషయంలో కాంగ్రెస్, బిజెపి పార్టీలు ముందువరుసలో ఉన్నాయి. ఈ రెండు కూడా బిఆర్‌ఎస్‌ను శంకరగిరి మాణ్యాలకు పంపాలన్న ధృఢదీక్షతో తమ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. ఈ రెండిరటినీ బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ చాలా కాలంగా దూరంపెడుతూ వొచ్చాడు. ఈ రెండు పార్టీలను మినహాయించి కలిసివొచ్చే ఇతర పార్టీలతో జాతీయస్థాయిలో ఫ్రంట్ ఏర్పాటు దిశగా ప్రయత్నాలు చేశాడు. అదికాస్తా బెడిసికొట్టడం ఒకటైతే ఈ రెండు పార్టీలతో పచ్చిగడ్డి వేస్తే భగ్గుమన్నంత వైరం ఏర్పడిరది.
దీంతో కెసిఆర్ పాలనలో జరుగుతున్న తప్పులను ఎన్నే కార్యక్రమాన్ని ఆ రెండు పార్టీలు ఉధృతం చేశాయి. ముఖ్యంగా అవినీతి, భూ కుంభకోణాలను ఎత్తిచూపడం ప్రారంభించాయి. తెలంగాణ ఏర్పాటుకు ముందు ఇచ్చిన హామీలు, చేసిన బాసలేవీ నెరవేరలేదన్న విషయంలోనే అన్ని పార్టీలు బిఆర్‌ఎస్‌పై దాడిని మొదలు పెట్టినయి. ఇంటింటికో ఉద్యోగాన్ని కల్పిస్తామన్న విషయాన్ని గుర్తుచేస్తూ కెసిఆర్ కుటుంబంలోని నలుగురికే ఉద్యోగం వొచ్చిందన్న విషయాన్ని విస్తృత ప్రచారంలో పెట్టాయి ఈ పార్టీలు. టిఎస్‌పిఎస్ పరీక్షా పేపర్ల లీకేజీల ఫలితంగా నిరుద్యోగ యువత ప్రాణాలు కోల్పోవడాన్ని ఎత్తిచూపుతూ, పరీక్షలుకూడా సక్రమంగా నిర్వహించలేని ప్రభుత్వం ఎందుకని ప్రశ్నిస్తున్నాయి. 24గంటల కరెంటు సరఫరా అన్నది ఒట్టి హంబక్ అని, అనేక ప్రాంతాల్లో తొమ్మిది గంటలు కూడా కరెంటు ఉండటంలేదని ఆ పార్టీలు ఆరోపిస్తున్నాయి. కరెంటుతోపాటు ధరణిపోర్టల్ విషయంలో బిఆర్‌ఎస్ ఎంత సమర్థించుకోవడానికి ప్రయత్నించినా రాష్ట్రంలోని దాదాపు అన్ని రాజకీయ పార్టీలు వీటిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ధరణి పోర్టల్ తీసుకురావడం వెనుక భూ కుంభకోణం దాగి ఉందని ఆ పార్టీలు ఆరోపిస్తున్నాయి.
ప్రజలకు నష్టం కలిగిస్తున్న ధరణిని తాము అధికారంలోకి రాగానే తొలగించి మరో మంచి విధానాన్ని అమలు పరుస్తామని ప్రజలకు హామీ ఇస్తున్నాయి. పైన చెప్పిన ఆరోపణల విషయంలో కాంగ్రెస్, బిజెపితోపాటు బిఎస్పీ, ఉభయ కమ్యూనిస్టు పార్టీలు, కొత్తగా అరంగెట్రం చేస్తున్న జనసేన కూడా వంతపాడుతున్నాయి. అక్కడివరకు ఆరుపార్టీలదీ ఒకే మాట అయినా కాంగ్రెస్‌ను కూడా బిజెపి టార్గెట్ చేస్తున్నది. కాంగ్రెస్, బిఆర్‌ఎస్ ఒకటేనంటూ బిజెపి విస్తృత ప్రచారం చేస్తోంది. గతంలో ఆ పార్టీతో బిఆర్‌ఎస్ అంటకాగిన విషయాలను గుర్తు చేస్తోంది. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మంత్రివర్గంలో బిఆర్‌ఎస్ చేరిన విషయాన్ని ఎత్తిచూపుతోంది. బిఆర్‌ఎస్‌తోపాటు ఎంఐఎంతోకూడా ఆ పార్టీకి అంతర్గత ఒప్పందాలున్నాయన్నది బిజెపి ఆరోపణ. అదే వరుసలో కాంగ్రెస్ కూడా బిఆర్‌ఎస్‌ను ప్రధాన టార్గెట్ చేస్తున్నది. బిజెపికి బిఆర్‌ఎస్ బి టీమ్ అని, అలాగే ఎంఐఎం సి టీమ్ అంటూ ఆరోపిస్తున్నది. ఈ మూడు పార్టీలు ఒకటేనన్న ప్రచారం చేస్తోంది.
కేంద్రంలోని బిజెపి తీసుకున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలన్నిటినీ బిఆర్‌ఎస్ మద్దతిచ్చిందంటూ తీవ్రంగా విమర్శిస్తున్నది. అదే వరుసలో బిఎస్పీ, ఉభయ కమ్యూనిస్టులు, ఆఖరికి జనసేనకూడా వివిధ ఆరోపణలతో బిఆర్‌ఎస్‌పై దాడి చేస్తున్నాయి. బిఆర్‌ఎస్ ఈ పార్టీలతోపాటు స్వతంత్ర అభ్యర్ధులను ఎరదుర్కోవటంలో తన శక్తియుక్తులను ఒడ్డుతున్నది. ఈ రెండు పార్టీలు తెలంగాణకు చేసిన ద్రోహాన్ని ప్రజలముందు ఆవిష్కరిస్తున్నది. తెలంగాణ ఇవ్వటంలో చేసిన జాప్యంగా వందలాది మంది ప్రాణాలుకోల్పోయిన సంఘనలను, ఇచ్చినట్లే ఇచ్చి మాటను వెనక్కు తీసుకున్న సన్నివేశాలను బిఆర్‌ఎస్ ఏకరువు పెడుతున్నది. తన పదేళ్ళ పాలనకు ముందు, తర్వాత జరిగిన అభివృద్ధిని బేరీజు వేసుకోవాలని ప్రజలను పదేపదే కోరుతున్నది. రాష్ట్రంలో తలసరి ఆదాయాన్ని పెంచిన విషయాన్ని వివరిస్తున్నది. ప్రజల జీవన గమనాన్ని మార్చే వోటును అనాలోచితంగా వేయవద్దని, అభ్యర్థులు, వాటివెనుక ఉండే పార్టీల గత అనుభవాలను క్షుణ్ణంగా అవగాహన చేసుకోవాలని బిఆర్‌ఎస్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నది.
-మండువ రవీందర్ రావు
(ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి)
(ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి)