అవిశ్వాసం ముంగిట ఇమ్రాన్‌ ‌ఖాన్‌

“75 ఏళ్ళ క్రిందట భారత దేశంతో పాటే పురుడు పోసుకున్న పాకిస్థాన్‌ ‌గడ్డ పై ఇప్పటికీ ప్రజాస్వామ్యం అడుగులు స్థిరపడలేదు. మరోవైపు భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా అవతరించి అభివృద్ధి దిశగా వడిగా అడుగులు వేసుకుంటూ వెళుతోంది. అవకాశం చిక్కినప్పుడల్లా మన భూభాగంలోకి జొరబడటానికి ప్రయత్నించే ఈ దాయాది దేశం మాత్రం మతం మత్తులో జోగుతూనే ఉంది.”

‌పాకిస్థాన్‌లో రాజకీయ సంక్షోభం పునరావృతం అవుతోంది. ఆ దేశ ప్రధాని ఇమ్రాన్‌ ‌ఖాన్‌ ‌విశ్వాసానికి, అవిశ్వాసానికి మధ్య ఊగిసలా డుతున్నారు. రేపు పాకిస్థాన్‌ ‌జాతీయ అసెంబ్లీ ముంగిట రానున్న అవిశ్వాస తీర్మానాన్ని ఇమ్రాన్‌ ‌ఖాన్‌ ఎదుర్కోవలసి ఉంది. ముందే మైనార్టీ ప్రభుత్వం ఇప్పుడు ఒక్కొక్కటిగా రాలిపోతున్న రెక్కలు…దీనితో పాక్‌ ‌రాజకీయాలు ఏ మలుపు తీసుకోనున్నాయన్న ఆసక్తి ప్రపంచ దేశాల్లో నెలకొంది. 75 ఏళ్ళ క్రిందట భారత దేశంతో పాటే పురుడు పోసుకున్న పాకిస్థాన్‌ ‌గడ్డ పై ఇప్పటికీ ప్రజాస్వామ్యం అడుగులు స్థిరపడలేదు. మరోవైపు భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా అవతరించి అభివృద్ధి దిశగా వడిగా అడుగులు వేసుకుంటూ వెళుతోంది. అవకాశం చిక్కినప్పుడల్లా మన భూభాగంలోకి జొరబడటానికి ప్రయత్నించే ఈ దాయాది దేశం మాత్రం మతం మత్తులో జోగుతూనే ఉంది.

Why is Pakistan's Imran Khan facing a political crisis

సొంత ప్రజానీకాన్ని ఆధునిక భావాల వైపు, విశాల దృక్కోణం దిశగా తీసుకుని వెళ్ళటం, ఆర్ధికంగా స్వయం సమృద్ధి సాధించటం కంటే పొరుగు దేశంలో అశాంతి రేపటం పై దృష్టి పెడితే ఏం జరుగుతుందో పాకిస్థాన్‌ ఓ ‌గుణపాఠం. ఇప్పటి వరకు ఎన్నికల ద్వారా అధికారంలోకి వచ్చిన ఒక్క ప్రభుత్వం కూడా పూర్తిగా ఐదేళ్ళ పాటు పాలన సాగించిన దాఖలా ఈ దేశంలో లేదు. ప్రభుత్వాన్ని పడగొట్టి పాకిస్థాన్‌ ‌సైన్యం అధికార పగ్గాలు కైవసం చేసుకున్న సందర్భాలు పాక్‌ ‌చరిత్రలో అనేక అధ్యాయాల్లో కనిపిస్తుంది. ఇప్పుడు ఇమ్రాన్‌ ‌ఖాన్‌ ‌వంతు. అయితే ఈసారి ప్రజాస్వామ్య బద్దంగా అవిశ్వాస తీర్మానం అనే కత్తి ఇమ్రాన్‌ ‌ఖాన్‌ ‌మెడకు వేళ్లాడుతోంది. ఒక రకంగా కొంతలో కొంత నయం అనుకునే పరిస్థితి.

2018లో ఆ దేశ జాతీయ అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి. అప్పుడు పాకిస్థాన్‌ ‌తెహ్రీకే ఇన్సాఫ్‌ ‌పార్టీ అధ్యక్షుడు అయిన ఇమ్రాన్‌ ‌బరిలో నిలబడి 155 స్థానాలు సాధించుకోగలిగారు. అయితే పాక్‌ ‌నేషనల్‌ అసెంబ్లీలో ఉన్న మొత్తం స్థానాల సంఖ్య 342. అంటే మేజిక్‌ ‌ఫిగర్‌ 172. ఏ ‌పార్టీ అయినా అధికార పగ్గాలు చేపట్టాలంటే కనీసం 172 స్థానాలు ఉండాలి. దీనితో ఈ మాజీ క్రికెట్‌ ‌ప్లేయర్‌ ఎం‌క్యూఎం-పీ, పీఎంఎల్‌-‌క్యూ, బీఏపీ వంటి చిన్న పార్టీలను కలుపుకుని 175 సంఖ్యా బలం తెచ్చుకున్నారు. అప్పటి నుంచి సంకీర్ణ ప్రభుత్వం నడుస్తోంది. గత కొంత కాలం నుంచి ఇమ్రాన్‌ ‌వ్యవహార శైలి పై అసంతృప్తిగా ఉన్న మిత్రులు ఇప్పుడు కూటమి నుంచి బయటకు వచ్చేశారు. దీనితో ఇమ్రాన్‌ ‌ఖాన్‌ ‌ప్రభుత్వం మైనార్టీలో పడిపోయింది. ఇది చాలదన్నట్లు సొంత పార్టీ సభ్యులు కూడా కొంత మంది బయటకు వచ్చేశారు. ఈ నేపథ్యంలో దాదాపు వంద మంది అసెంబ్లీ సభ్యులు అవిశ్వాస తీర్మానానికి నోటీసు ఇచ్చారు. పాకిస్థాన్‌ ‌ముస్లిం లీగ్‌ -‌నవాజ్‌, ‌పాకిస్థాన్‌ ‌పీపుల్స్ ‌పార్టీ వంద మంది అసెంబ్లీ సభ్యులు అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చారు.

రేపు అవిశ్వాస తీర్మానం పై జాతీయ అసెంబ్లీలో చర్చ జరిగే అవకాశం ఉంది. వాస్తవంగా వచ్చే ఏడాది ఆఖరు నాటికి మళ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. కాని ఈ లోపు రాజకీయ సంక్షోభం దిశగా పాకిస్థాన్‌ అడుగులు వేస్తోంది. ఈ నాలుగేళ్ళల్లో ఇమ్రాన్‌ ‌ఖాన్‌ ‌ప్రభుత్వం పై ఇంత వ్యతిరేకత రావటానికి అనేక కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆ దేశం తీవ్ర ఆర్ధిక సంక్షోభంలో కూరుకుపోతోంది. ఖాన్‌ అధికారం చేపట్టినప్పటి నుంచి పాకిస్థాన్‌ ‌రూపాయి విలువ సగానికి సగం పడిపోయింది. కోవిడ్‌ ‌కారణంగా ఆర్ధికాభివృద్ధి దయనీయ స్థితికి చేరింది. 2018-19లో ఆ దేశ ఆర్ధికాభివృద్ధి రేటు ఆరు శాతం ఉంటే ఒక్క ఏడాదిలోనే 3 శాతానికి కుంచించుకుపోయింది. దేశాన్ని సంక్షేమ బాట ఎక్కిస్తానన్న ఇమ్రాన్‌ ‌ఖాన్‌ ‌మాటలు వట్టి నీటి మూటలే అని పాక్‌ ‌ప్రజానికానికి అర్థం అయ్యింది. ప్రపంచం మరింత ఆధునికత్వం సంతరించుకుని ముందుకు వెళుతుంటే ఇమ్రాన్‌ ‌ఖాన్‌ ‌ప్రభుత్వం మాత్రం మతమౌఢ్యం మాటునే కాలక్షేపం చేసిందనే ఆరోపణలు ఉన్నాయి. ఈ ప్రజా వ్యతిరేకతనే ఇప్పుడు ప్రతిపక్షాలు తమకు అనుకూలంగా మలుచుకునే పనిలో పడ్డాయి. ఏమైతేనేం ఒక వేళ అవిశ్వాస తీర్మానం ద్వారా ఇమ్రాన్‌ ‌పదవిని కోల్పోతే ఒక క్రెడిట్‌ ఈయన ఖాతాలో పడుతుంది. పాకిస్థాన్‌లో అవిశ్వాస తీర్మానం ద్వారా పదవి కోల్పోయిన మొట్టమొదటి ప్రధానమంత్రి అవుతారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *