ఏ చరిత్రా చెప్పలేదు నాకు యుద్ధం చేయమని
ఏ పురాణమూ ఇతిహాసమూ నేర్పలేదు సరైన పాఠం
ఎముకల దారిలో మృత్యువు భుజాన్ని ఆసరాగా తీసుకుని
గడిచిన గతాన్ని శాంతి వచనాల్లా వల్లేవేస్తూ
ఎదురుచూసే గుమ్మాలకు రేపటి తోరణాలు కడుతూ
కోల్పోయిన కడుపులకు సర్ది చెప్పుతూ
అరణ్యరోదనల పర్వంలో ఎన్ని పాత్రలో
సజీవదహనం చేయబడ్డవి
ఇంకా వారి ముఖ్య భూమికలు ముగియకముందే!
ఒక తల్లో చెల్లో కొన్ని కన్నీళ్ళనైనా దాచుంటే బావుణ్ణు
భవిష్యత్ నమూనా కోసం
ఒక తమ్ముడో అన్ననో చెమటనో రక్తాన్నో
మిగుల్చుంటే బావుణ్ణు వచ్చేతరం కోసం
ఇది ఆకలిగొన్న మానవారణ్యం
ఇక్కడ అన్నీ కలగలుపుగా దొరుకుతాయ్
మానవత్వం కత్తిమొనపై వేళాడుతూ
బొంగురు గొంతుతో కోరస్ కలుపుతది
పాతవీ కొత్తవీ అన్నీ ఇచ్చట బేరం చేయబడును
నమ్మకం నడిపిస్తది భయం ఉసిగొల్పుతది
ఏ చీకటి మూలలు వెతుక్కుంటో ఆ పిచ్చితల్లి వెళ్తుంటది
కాసిన్ని వెలుగులు కొంగున కట్టుకొద్దామని
తను ప్రసవించింది ఆరోగ్యకరమైన సంతతినే
పెంచింది మమత్వపు ఈకలతో సుతారంగా
ఊహించలేదు ఈ రక్తపు గాయాల పరిణామాల్ని
ఎంత కరడుగట్టిన వారైనా ఒక అమ్మనుంచే కదా
అందుకే తను చేతులు ఆకాశానికేసి
గుండెలు బాదుకుంటుంది అయ్యో…
కుప్ప కూలకముందే ఎవరైనా కాస్త గట్టిగా
ఎత్తుకోండి అమ్మ పాటల్ని
వెన్ను జలదరించేలా.. రాళ్ళు కరిగేలా..!!
– రఘు వగ్గు