అమిత్‌షా సభపై బిజెపి ఆశలు

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా సభను విజయవంతం చేసేందుకు రాష్ట్ర బిజెపి నాయకత్వం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఇంతవరకు రాష్ట్రంలో బిజెపి చేస్తున్న సభలు, సమావేశాలు, పాదయాత్రలకు ఈ సభ భిన్నంగా  ఉండాలనుకుంటున్నారు. వారం రోజుల కిందనే కాంగ్రెస్‌ ‌పార్టీ రాహుల్‌తో వరంగల్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభ విజయవంతం అయిందని ఆ వర్గాలు అమితోత్సహాన్ని వ్యక్తం చేశాయి. అయితే దానికి మించి తమ సభ ఉండాలన్న పట్టుదలతో బిజెపి శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నాయి.  బిజెపిరాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌  ‌ప్రజా సంగ్రామ యాత్ర పేరున రెండవ విడుత పాదయాత్ర ముగింపు సమావేశం ఈ రోజు  జరుగనుంది. ఈ సందర్బంగా రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో బహిరంగ సభను భారీస్థాయిలో నిర్వహించేందుకు పార్టీ వర్గాలు గత కొన్నిరోజులుగా శ్రమిస్తున్నాయి. ముఖ్యంగా తాజాగా వరంగల్‌లో జరిగిన రాహుల్‌ ‌గాంధీ సభకు మించిన సంఖ్యలో, కనీసం అయిదు లక్షల మందితో ఈ సభను నిర్వహించేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

ఈ సభ రాష్ట్ర రాజకీయాల్లో ఒక మలుపు కావాలన్నది ఆ పార్టీ నాయకుల ఆకాంక్ష. 2023లో రానున్న  శాసనసభ ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ను మట్టికరిపించి తమ కాషాయ జండాను ఎగురవేస్తామని ముందునుండీ గంటా పథంగా చెబుతున్న బిజెపికి ఇప్పుడీ సభను విజయవంతంగా నిర్వహించుకోవడంద్వారా అధికార టిఆర్‌ఎస్‌ ‌పార్టీ గుండెల్లో గుబులు పుట్టించాలన్నది ప్రధాన లక్ష్యం. శాసనభ ఎన్నికలకు మరో ఏడాది కాలం ఉన్నప్పటికీ రాష్ట్రంలోని రాజకీయ పార్టీలన్నీ ఇప్పటినుండే సమాయత్తమవుతున్నాయి. ఇప్పటికే అరోపణలు, ప్రత్యారోపణలు, తీవ్రస్థాయిలో విమర్శలు, ఛాలెంజీలు చేసుకుంటున్నాయి. వాటితోపాటు ఇప్పుడు ఒకరికి మించి ఒకరు భారీ ఎత్తున సభలను నిర్వహించడంపై దృష్టి పెట్టాయి.  రైతు సంఘర్షణ పేరున వరంగల్‌లో  రాహుల్‌గాంధీతో నిర్వహించిన భారీ బహిరంగ సభతో ఆ పార్టీలో కొంత కదలిక వచ్చిందన్న భావన ఉంది. చాలాకాలంగా రాష్ట్ర నాయకుల మధ్య  ఉన్న విభేదాలు  చాలా వరకు తొలగిపోయి, పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావాలన్న అభిలాష నాయకులందరిలో కలిగిందని, దీంతో క్యాడర్‌కూడా అత్యంత ఉత్సాహంతో ఉన్నారన్నది ఆ పార్టీ వర్గాలు చెబుతున్నమాట.

రాష్ట్రంలో ప్రతీ గ్రామంలో అంతో ఇంతో కాంగ్రెస్‌కు క్యాడర్‌ ఉం‌ది. ఇప్పటివరకు సరైన నాయకత్వంలేక ఆ క్యాడర్‌ ‌నిరాశకు గురైంది. రేవంత్‌రెడ్డి నాయకత్వం చేపట్టినప్పటినుండి అధికార పార్టీ తప్పులను ఎత్తిచూపడమే కాకుండా అందరినీ పార్టీ కార్యక్రమాల్లో భాగస్వాములను చేసే ప్రక్రియలో భాగంగానే వరంగల్‌ ‌సభ ఏర్పాటు. ఆ విషయంలో రేవంత్‌రెడ్డి కొంతవరకు విజయవంతం అయినట్లుగానే రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఇప్పుడు బిజెపికూడా తామేమీ తక్కువ కాదన్నట్లు ఇటీవలనే ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడిని తీసుకువచ్చింది. ఇప్పుడు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో భారీ స్థాయిలో బహిరంగ సభను నిర్వహిస్తున్నది. ఈ రెండు పార్టీలు తమ జాతీయ నాయకులతో సభలు నిర్వహిస్తుండడంతో టిఆర్‌ఎస్‌ ‌కూడా అందుకు తగిన ప్రణాళికను సిద్దంచేసుకుంటున్నది. సభలు, పాదయాత్రలతో ప్రతిపక్ష పార్టీలు తమపై చేస్తున్న తీవ్ర విమర్శలకు తగిన సమాధానం చెప్పేందుకు సిద్దమవుతున్నది. ప్రింటు, ఎలక్ట్రానిక్‌ ‌మీడియాతోపాటు, సోషల్‌ ‌మీడియా ద్వారా ప్రతిపక్షాలను ఎదుర్కుంటున్నప్పటికీ  కాంగ్రెస్‌, ‌బిజెపి నాయకులు చేస్తున్న వన్ని తప్పుడు ఆరోపణలన్న విషయాన్ని ప్రజలకు మరింత స్పష్టంగా తెలియజేసేందుకు టిఆర్‌ఎస్‌కూడా భారీ బహిరంగ సభల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోంది.

మే నెల చివరి వారంనుండే ఈ సభలకు శ్రీకారం చుట్టాలనుకుంటున్నట్లు ఆ వర్గాల ద్వారా తెలుస్తున్నది. ఏ ప్రభుత్వాలు కూడా ఏడేళ్ళ తక్కువ సమయంలో చేయలేని పనులను తమ ప్రభుత్వం చేసి చూపించిన విషయాన్ని ప్రజలకు వివరించాలనుకుంటోంది. అందుకే మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గ పరిధిలో పదహారు వందల కోట్ల అంచనా వ్యయంతో చేపడుతున్న ఎత్తిపోతల పథకానికి శంఖుస్థాపన చేసే కార్యక్రమం సందర్బంగా ఏర్పాటు చేసే బహిరంగ సభతో సభలకు శ్రీకారం చుట్టాలనుకుంటున్నట్లు తెలుస్తున్నది. ఈ సభను కూడా కాంగ్రెస్‌, ‌బిజెపి సభలకు ధీటుగా  నిర్వహించడంద్వారా తమ పట్టును మరోసారి నిరూపించుకోవాలని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ సందర్భంగా   కేంద్రం తెలంగాణ రాష్ట్రంతోపాటు, ఇతర రాష్ట్రాలకు చేస్తున్న అన్యాయాన్ని , రాష్ట్ర మంత్రలను అవమానపరుస్తున్న తీరును, వ్యవసాయరంగాన్ని అంధకారంలో  పడేస్తున్న చర్యలను ఎత్తి చూపేందుకు సిద్దమవుతున్నది. మొత్తంమీద ఇంకా ఎన్నికలకు చాలా సమయం  ఉండగానే రాజకీయ పార్టీలు మాత్రం ఎన్నికల క్షేత్రంలో దిగుతున్నంత పనిచేస్తున్నాయి.

– మండువ రవీందర్‌రావు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *