సిద్ధిపేట, ప్రజాతంత్ర, ఆగస్టు 11: అబద్ధాలు చెప్పడంలో, ఫేక్ ప్రచారానికి బిజెపి పార్టీ కేరాఫ్ అడ్రస్ అని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు బిజెపి పార్టీపై విరుచుకుపడ్డారు. గురువారం సిద్ధిపేట జిల్లా నంగునూరు మండలంలోని రాజగోపాల్‌పేటకు చెందిన కాంగ్రెస్, బిజెపి పార్టీకి చెందిన పలువురు మంత్రి హరీష్‌రావు సమక్షంలో టిఆర్‌ఎస్‌లో చేరారు. టిఆర్‌ఎస్‌లో చేరిన వారికి మంత్రి హరీష్‌రావు గులాబీ కండువాను కప్పి టిఆర్‌ఎస్‌లోకి ఆహ్వానించిన సందర్భాన్ని పురస్కరించుకుని మాట్లా డుతూ… జాతీయ పార్టీఐన బిజెపి, కాంగ్రెస్ పార్టీలు తెలంగాణకు అన్యాయం చేస్తున్నాయన్నారు. నాడు సమైక్య పాలనలో కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేస్తే,్త నేడు స్వరాష్ట్రంలో కేంద్రంలోని బిజెపి తెలంగాణకు తీవ్ర అన్యాయం చేస్తున్నారన్నారు. తెలంగాణ పథకాలు కాపీ కొట్టి మేమే చేసాం అని అబద్దాలు ఆడుతూ, ఫేక్ సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తున్నారన్నారు.
బిజెపి ఎన్ని జిమ్మిక్కులు చేసినా తెలంగాణ ప్రజలు విశ్వసించరన్నారు. ఇక తెలంగాణ లో కాంగ్రెస్ కనుమరుగైన పార్టీ అని, కాంగ్రెస్ నేతలవి పగటి కలలన్నారు. తెలంగాణ ప్రజల గుండె చప్పుడు, ప్రజల ఇంటి పార్టీ టిఆర్‌ఎస్ అని, సిఎం కేసీఆర్ నాయకత్వంలో అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ ఒక స్వర్ణయుగం అని దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు.. తెలంగాణ రాష్ట్రం రాకుంటే.. కేసీఆర్ ముఖ్యమంత్రి కాకుంటే, నేను మంత్రిగా లేకుంటే సిద్దిపేట జిల్లా అయ్యేదా? సిద్దిపేటకు సాగు, త్రాగు నీరు వచ్చేదా? అని అన్నారు. స్వరాష్ట్రం వల్లనే దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా సిద్దిపేట పేరు నిలిచిందన్నారు. సిద్దిపేటను జిల్లా చేసుకున్నామనీ, సాగు, త్రాగు నీటి కలను నెరవేర్చామనీ, కొద్దీ రోజుల్లోనే రైలు రాబోతుందన్నారు. ప్రజలు కోరుకున్న అభివృద్ధిని చేసి చూపెట్టామన్నారు. ప్రభుత్వ సంక్షేమం, అభివృద్ధికి ఆకర్షితులై మేము అభివృద్ధి భాగస్వామ్యమవుతామంటూ బిజెపి, కాంగ్రెస్ నుండి టిఆర్‌ఎస్ పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికీ మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నామన్నారు. అందరికీ పార్టీలో సముచిత స్థానం కలిపిస్తానని చెప్పారు. పార్టీ లో వచ్చిన 30 మందికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
అభివృద్ధికి ఆకర్షితులై…అభివృద్ధి భాగస్వామ్యం ..
టిఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్న పలువురు నేతలు..
సిద్దిపేట అంటే అభివృద్ధి.. అభివృద్ధి అంటే హరీష్‌రావు ..సిద్దిపేట నియోజకవర్గం దేశంలోనే ఆదర్శంగా నిలుస్తోంది. మంత్రి హరీష్ రావు అభివృద్ధి మార్క్‌కు ఇది ఒక నిదర్శనమని పార్టీలో చేరిన రాజగోపాల్‌పేటకు చెందిన బిజెపి మహిళా మోర్చా గ్రామ శాఖ అధ్యక్షురాలు నాంపల్లి కనకవ్వ, టిఎన్‌ఎస్‌ఎఫ్ నాయకుడు సుదగోని శ్రవణ్‌కుమార్, బిజెపి నాయకులు పరమన్ల గణేష్, శివరాత్రి బాబు తదితరులు అన్నారు. 70 ఏళ్లలో చేయని అభివృద్ధి, సంక్షేమం 8 ఏళ్లలో సాధ్యం చేసి ప్రజల కళ్ల ముందు ఉంచారని, ఇది సి•ఎం కేసీఆర్ మంత్రి హరీష్ రావు అభివృద్ధి మార్క్ అని వారు చెప్పారు. సిద్దిపేట నియోజకవర్గానికి హరీష్‌రావు లాంటి గొప్ప నాయకుడు ఉన్నందుకు గర్వంగా ఉందని.. మేము ఎక్కడికి వెళ్లినా సిద్దిపేట అంటే ఒక ప్రత్యేక గౌరవం, గుర్తింపు ఉంటుందంటే అది హరీష్‌రావు లాంటి నాయకుని వల్లేనని అన్నారు. అందుకే మేము హరీష్‌రావు అభివృద్ధిలో ఆయనే వెంటే ఉంటూ సిద్దిపేటను మరింత అభివృద్ధిలో భాగస్వామ్యమవుతామన్నారు. ఈ కార్యక్రమంలో నంగునూరు మండలానికి చెందిన టిఆర్‌ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలు పాల్గొన్నారు.