ద్యావరి నరేందర్‌రెడ్డి కలం నుంచి జాలువారిన
అద్భుత గజల్ వాహిని ‘‘శ్రీలక్ష్మీనారసింహం’’
కవి అంటే సహజంగా సామాజిక అంశాలనో, ప్రకృతి వైపరీత్యాలనో, సామాజిక అసమానతలనో వస్తువుగా ఎంచుకొని కవితలు వ్రాయటం ఆనవాయితీ. భక్తిభావ లహరిలో తేలియాడుతూ తనకు తాను తదాత్మీకరణం చెందుతూ షోడశోపచారాలలోని పూజావిధి విధానాలను ప్రస్తుతిస్తూ అక్షర రూపాన్నిచ్చి గజల్ పక్రియగా మలచటం నరేందర్ రెడ్డి గారు చేసిన అమోఘ ప్రయత్నం. నాకు తెలిసి గజల్ పక్రియలో కూడా సామాజికమైన, సాంఘికపరమైన అంశాలు చోటుచేసుకున్న గజల్స్‌ని చూశాను. కానీ ఆధ్యాత్మిక భావ చింతనతో కూడిన గజల్స్‌లో బహుశా ఇదే మొదటిదేమో! వీరి ‘‘శ్రీలక్ష్మీనారసింహం’’ రచనని చూస్తే ప్రతి అక్షరము వారి వికసిత మనోపుష్పమై కనిపిస్తుంది. నిరాడంబరమైన భక్తితో పరిమళించే సౌరభమై మైమరిపిస్తుంది.
‘‘వేదనలు రగిలితే – జనులెల్ల నలిగారు
చేయూతనివ్వగా – చేరుకో నృసింహ
శరణంబు వేడుతూ- నీ సొంతమయ్యాను
రక్షించి ప్రేమగా – ఏలుకో నృసింహ’’
అన్న వీరి చరణాలను చూస్తే భక్తి పారవశ్యంతో భగవంతుడికి సంపూర్ణ శరణాగతిని ఎలా ప్రకటించాలో కనబడుతుంది. ‘నరసింహ మమదేహి కరావలంబం‘ అన్న శంకరాచార్య విరచిత స్తోత్రములోని ఆర్ద్రత కనపడుతుంది .
‘‘నరసింహుడు విశ్వమందు – దశదిశలను శాసించును
కాలమెంత మొండిదైన – కదలకుండా వుంటుందా!
సిరికి సఖుడు హరి కొలువై – దివ్యత్వం నర్తించును
సంతోషము తనకు తాను – కురవకుండా వుంటుందా!’’
అనే చరణాలను పరిశీలిస్తే ‘అందుగలడిరదు లేడని సందేహము వలదు’ అనే ప్రహ్లాదుని మాట గుర్తొస్తుంది. భగవంతుడు కాలస్వరూపుడని కాలాన్ని తన ఆధీనంలో వుంచుకుంటాడని చెప్పకనే భగవత్తత్వాన్ని చెప్పారు ఈ మాటల్లో. సర్వాంతర్యామి కాలస్వరూపుడూ లక్ష్మీపతి అయిన పరబ్రహ్మము తలుచుకుంటే సంతోషమనే దివ్యత్వము ప్రతి ఇంటా నర్తిస్తుంది అంటారు రచయిత. ఇది ఆనందోబ్రహ్మ అనే భృగువల్లి సూత్రాన్ని తలపింపచేస్తుంది.
మరొక చరణంలో యోగం అంటే ఏమిటో చాలా అద్భుతంగా చెబుతారు.
‘‘ఆధ్యాత్మిక మార్గమందు – సందేహం సడలింది
తరిగిపోని జ్ఞానాన్నే – సాధిస్తే యోగమే
దివ్యశక్తి మానవునికి – చేయూతగ అందించు
అలముకున్న బాధలను – ఛేదిస్తే యోగమే
వేలుపట్టి పరమాత్మే – ఆడిస్తే యోగమే’’
ఇది నిజమే కదా ! తాపత్రయాలలో ఆధ్యాత్మికత ఒకటి. ప్రస్తుత సమాజంలో ఆధ్యాత్మికమంటే అనేక సందేహాలు తలెత్తుతున్నాయి. జ్ఞానమార్గంలో ప్రయాణించే వారికి ఆ సందేహాలు తీరటం గొప్ప యోగమే మరి. భగవంతుని దివ్య శక్తి మానవునికి చేయూతగా అందిస్తే బాధలను కూడా సంతోషంగా స్వీకరించగలగటం కూడా ఒక యోగమే. భగవద్గీత చెప్పింది కూడా అదే కదా! శీతోష్ణ సుఖదుఃఖాలను సమంగా స్వీకరించమని. కష్టాలు వచ్చినప్పుడు మనిషి అజ్ఞానంలో మునుగుతాడు. ఆ కష్టాలు కారుమబ్బులై అజ్ఞానమనే చీకటిని ఉసిగొల్పినప్పుడు సాధకుడు జ్ఞానజ్యోతులను ప్రసరించమని భగవంతుని కోరుతాడు. ఈ భావాన్ని
‘‘అంతులేని కారు మబ్బులు – అలుముకుంటే నిన్ను మొక్కితి
కరుణ చూపుతు కోటిదివ్వెలు – వెలిగించవా నారసింహా !’’
అంటూ ఎంతో వినయంగా వ్యక్తీకరిస్తారు రచయిత.
‘‘నిన్ను నమ్మి ప్రార్థిస్తూ మధురిమనే గాంచినాను – మధురమైన స్వరాలనే పలికించే దైవానివి’’ అన్నప్పుడు మీరాబాయి, క్షేత్రయ్య, అన్నమయ్య, త్యాగయ్య,, రామదాసులు వారి పదకవితలలో చెప్పిన భక్తిభావ పరంపర తొణికిసలాడుతుంది. ఇలా అనంత భక్తిసాగరతరంగాలలో ఊయలలూగుతూ, నిశ్చలమైన నిర్మలమైన భక్తివిశ్వాసాలతో తన హృదయ సామ్రాజ్యమందు స్వామికి సుస్థిరమైన సింహాసనాన్ని ప్రతిష్టించి, ప్రతి అక్షరాన్ని పుష్పంగా భావించి శ్రద్ధతో గూర్చి అరువదిమాలలుగా అల్లి సాహితీ షష్టిపూర్తి కావించినట్లు అరువది గజల్స్ ద్వారా అనంత భక్తి భావాన్ని ప్రబోధించాడు రచయిత శ్రీ ద్యావరీ నరేందర్ రెడ్డిగారు. వీరి ఘంటాన్ని శ్రీ సరస్వతి మాత అలంకరించి చక్కని రచనా సృష్టిని అనుగ్రహించింది. వీరి సాహితీసేవను మెచ్చి భక్తితో అల్లిన గజల్ తోమాలను స్వామితన గళసీమలో ధరించారు. ఇంకా కావాలసిందేముంది ఆ వాగ్దేవి చల్లనిచూపులు, విశ్వజననీజనకులకృపాకటాక్షం తప్ప. వీరు ఇలాంటి రచనలు మరిన్ని చేయాలని శ్రీ లక్ష్మీనరసింహుని కటాక్షం సదా లభించి స్వామి వారి కుటుంబ సభ్యులను సదా అనుగ్రహిస్తూ మరిన్ని అద్భుతరచనలు చేసే శక్తిని ప్రసాదించాలని ఆకాంక్షిస్తున్నాను.
-వనం తేజశ్రీ