‌పదేళ్ళ ప్రశాంతతను కోల్పోయిన ఉస్మానియా

మళ్లీ పోలీసుల కవాతు, లాఠీ చార్జ్‌లు, అరెస్టులు…
ప్రభుత్వ దాటవేత ధోరణిపై విద్యార్థులు, నిరుద్యోగుల మండిపాటు
జర్నలిసులపై దాడిని ఖండిస్తున్న విద్యార్థి సంఘాలు

మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి: హైదరాబాద్‌, ‌జూలై 11 : తెలంగాణ అస్థిత్వం మొదలు విద్యా, నిరుద్యోగ సమస్యలపై పోరాటంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్ధులు ఎప్పుడూ ముందు వరుసలో నిలుస్తారు. పదేళ్ళ కింద దాదాపు ఒక దశాబ్ధ కాలం తెలంగాణ రాష్ట్ర సాధన విషయంలో ఉస్మానియా యూనివర్సిటీ పోషించిన పాత్ర చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తుంది. అలాంటిది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన గత దశాబ్ధ కాలంగా ఉస్మానియా చాలా ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్నది. తెలంగాణ కోసం పద్నాలుగేళ్ళుగా పోరాడి, ప్రత్యేక రాష్ట్రంలో పదేళ్ళపాటు ప్రభుత్వాన్ని ఏలిన బిఆర్‌ఎస్‌ను తోసి కాంగ్రెస్‌ అధికారంలోకి వొచ్చినాంక కూడా ప్రశాంతంగా ఉన్న ఉస్మానియా ఇప్పుడు మరోసారి రణరంగంగా మారింది.

మళ్ళీ పోలీసుల పదఘట్టాలు, లాఠీల సైరవిహరం, అరెస్టులు కొనసాగుతున్నాయి. గత నాలుగు రోజులుగా యూనివర్సిటీ పోలీసుల పహారాలోనే కొనసాగుతున్నదంటే అధికారం చేపట్టిన నూతన ప్రభుత్వం పాలనా తీరుకు నిదర్శనమనే చెప్పాలి. తెలంగాణ అభివృద్ది చెందాలంటే ప్రభుత్వ మార్పు తప్పదని ఎన్నికలకు ముందు పదేపదే వల్లించిన కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం చెప్పిన మార్పు ఇదేనా అని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ప్రభుత్వం తీరుకు నిరసనగా ఈ నెల 15న సచివాలయం ముట్టడికి నిరుద్యోగులు పిలుపు ఇవ్వగా అందుకు రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్షం బిఆర్‌ఎస్‌ ‌మద్దతు ప్రకటించింది. బిఆర్‌ఎస్‌ ‌నాయకుడు ఆర్‌ఎస్‌ ‌ప్రవీణ్‌కుమార్‌తో పాటు, బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌. ‌కృష్ణయ్య కూడా మద్దతు ప్రకటించడం గమనార్హం.

 

అయితే విద్యార్థులు, నిరుద్యోగులు చేస్తున్న ఆందోళన వెనుక రాజకీయ పార్టీలున్నాయంటూ సమస్యను రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి దాటవేసే వైఖరిని అవలంబించడాన్ని నిరుద్యోగులు తీవ్రంగా ఖండిస్తున్నారు. తమ ఆందోళన నేపథ్యాన్ని అర్థం చేసుకోకుండా విపక్షాలపై నింద వేయడం సరైంది కాదని నిరుద్యోగులు పేర్కొంటున్నారు. తెలంగాణ రాష్ట్రం వొచ్చిన తర్వాత తమ బతుకులు బాగుపడుతాయన్న ఉద్దేశ్యంగా ఎంతో ఆశతో ఎదురుచూస్తున్న ఉద్యోగావకాశాల విషయంలో కనీస అభ్యర్దనలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడంపట్ల వారు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఒక దానివెనుక ఒకటిగా పరీక్షలు పెట్టడంతో తమకు ప్రిపేర్‌ అయ్యే అవకాశం లేకుండా పోతున్నదన్నది వారి ప్రధాన ఆరోపణ. టెట్‌ ‌పరీక్షకు బిఎస్సీకి మధ్య కేవలం 20 రోజుల సమయమే ఉందని, అది ఎట్టి పరిస్థితిలో సరిపోదంటూ, ఈ రెండింటి మధ్య కనీసం రెండు నెలల సమయం కావాలని వారు డిమాండ్‌ ‌చేస్తున్నారు.

స్కూల్‌ అసిస్టెంట్‌గా ఉన్న వాళ్ళకు ఆరవ తరగతి నుండి ఇంటర్‌ ‌వరకు సిలబస్‌ను చదువుకోవాల్సి ఉంటుంది. టెట్‌కు ప్రిపేర్‌ అయిన తర్వాత కేవలం 20 రోజుల్లోనే ఇంత పెద్ద సిలబస్‌ ‌చదువటం సాధ్యం కాదంటున్నారు. అలాగే ఎస్జీటి టీచర్స్ 3‌వ తరగతి మొదలు పదవ తరగతి సిలబస్‌ అం‌తా చదువాల్సి ఉంటుంది. దాదాపు 50 పుస్తకాలవరకు తిరిగేయాల్సి ఉంటుంది. ఈ పరీక్షకు సిద్ధపడుతున్న వారిలో చాలా మంది వివాహితులు కావడం, ముఖ్యంగా ఒకరిద్దరు పిల్లల తల్లులకు ఈ కొద్ది సమయం ఏమాత్రం సరిపోదు. అందుకే పరీక్షలను మరికొన్ని రోజుల పాటు వాయిదా వేయాల్సిందంటూ వారు ప్రభుత్వాన్ని డిమాండ్‌ ‌చేస్తుండగా, ఎట్టి పరిస్థితిలో వాయిదా వేయడం కుదరదని రాష్ట్ర ముఖ్యమంత్రి కరాఖండీగా చెప్పడమే ఉస్మానియాలో ఉద్రిక్తతకు దారితీసింది.

అలాగే విశ్వవిద్యాలయాలకు రెగ్యులర్‌ ‌వైస్‌ఛాన్స్‌లర్లు లేకపోవడంవల్ల వర్సిటీ పాలన కుంటుపడుతున్నదన్న మరో డిమాండ్‌ ‌కూడా దీనికి తోడు అయింది. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలంటూ ప్రొఫెసర్‌ ‌కోదండరామ్‌ ఇం‌టి ముట్టడికి పిలుపు ఇవ్వడం సమస్య తీవ్రతకు దారితీసింది. పోలీసులు ముందస్తుగానే యూనివర్సిటీలోని వివిధ విద్యార్ధి నాయకులను అదుపులోకి తీసుకోవడం, పెనుగులాటలో శారీరక దాడులకు పాల్పడడం, లాఠీలకు పనిచెప్పడం లాంటివాటితో మరోసారి ఉస్మానియా రణరంగంగా మారింది. ఈ విషయమై విద్యార్థి నాయకులు, విపక్షాలు అధికారపార్టీపై తీవ్ర అగ్రహాన్ని వ్యక్తం చేశాయి. ఎన్నికలకు ముందు విద్యార్ధులు, నిరుద్యోగులపై కల్లబొల్లి ప్రేమను ఒలకబోసిన కాంగ్రెస్‌, అధికారం చేపట్టిన తర్వాత చేస్తున్నదేమిటని వారు నిలదీస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు హైదరాబాద్‌ ‌డిక్లరేషన్‌ ‌పేరున విద్యార్థి, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలేమైనాయని కూడా వారీ సందర్భంగా  కాంగ్రెస్‌కు గుర్తు చేస్తున్నారు.

పద్దెనిమిదేళ్ళు పైపడిన విద్యార్ధులకు ఎలక్ట్రిక్‌ ‌స్యూటీ, ప్రతీ మండలానికి అంతర్జాతీయ స్థాయిలో స్కూల్‌ ఏర్పాటు, విద్యార్ధులకు 5 లక్షల విద్యాభరోసా కార్డు, బాసర త్రిబుల్‌ ఐటి తరహాలో మరో నాలుగు విద్యా సంస్థల ఏర్పాటు, విద్యార్థులకు ఫ్రీ వైఫై సదుపాయం లాంటివాటిని ప్రభుత్వం మరిచిపోయిందంటున్నారు. కాగా 25 వేల పోస్టులతో మెగా డిఎస్సీని నిర్వహించాలని బిఆర్‌ఎస్‌వి నాయకులు డిమాండ్‌ ‌చేస్తున్నారు. తమది ఆంక్షల ప్రభుత్వం కాదని చెప్పుకున్న రాష్ట్ర ప్రభుత్వం కంచెలు వేయడాన్ని ఎత్తిచూపుతున్నారు. ముఖ్యంగా నిరుద్యోగులు, విద్యార్థులు చేపడుతున్న ఆందోళను కవర్‌ ‌చేసేందుకు వొచ్చిన జర్నలిస్టులపైన కూడా పోలీసులు దాడిచేయడాన్ని పలు జర్నలిస్టు సంఘాలు తీవ్రంగా ఖండించాయి. కాగా ఇందుకు నిరసనగా అన్ని జిల్లాల్లో జర్నలిస్టులు నిరసన కార్యక్రమాలను చేపడుతున్నారు. మొత్తం మీద దశాబ్ధ కాలంగా ప్రశాంతంగా ఉన్న ఉస్మానియా యునివర్శిటీలో మరోసారి ఉద్రిక్తత కొనసాగుతున్నా, అధికార పార్టీ పట్టించుకోకపోవడాన్ని పలువురు ఆక్షేపిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *