- పన్ను రూపంలో తెలంగాణ రక్తాన్ని పీల్చుతున్నారు..
- రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు జక్కిడి శివ చరణ్ రెడ్డి
- హస్తినలో కదం తొక్కిన యువజన కాంగ్రెస్ నేతలు
- బిజెపి ప్రభుత్వ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా నిరసన
న్యూదిల్లీ, ప్రజాతంత్ర, మార్చి 25 : గత పది సంవత్సరాలుగా మోదీ ప్రభుత్వం ప్రజావ్యతిరేక పరిపాలన అవలంబిస్తోందని రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు జక్కిడి శివ చరణ్ రెడ్డి (Jakkidi shiva Charan Reddy)అన్నారు. జాతీయ యువజన కాంగ్రెస్ (youth congress ) అధ్యక్షులు ఉదయ్ భాను చిబ్ పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ నాయకులు కదం తొక్కారు.. మాకు ఉద్యోగాలు ఇవ్వండి యువకుల చేతులకు సంకెళ్ళు కాదు అంటూ… బిజెపి ప్రభుత్వ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా సంసద్ ఘోరావ్ పార్లమెంటు ముట్టడి కార్యక్రమం చేపట్టారు. ఇందులో తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు జక్కిడి శివ చరణ్ రెడ్డి తో కలిసి అధిక సంఖ్యలో తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ నాయకులు శ్రేణులు పాల్గొన్నారు.
యువతకు ఉద్యోగాలు కల్పించడంలో బిజెపి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమవడంతో పాటు,ఉపాధి అడిగినందుకు యువతకు సంకెళ్ళను విధిస్తూ ప్రధాని మోదీ అహంకార ధోరణితో వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఈ మేరకు జాతీయ యువజన కాంగ్రెస్ కార్యాలయం నుంచి జంతర్ మంతర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జక్కిడి శివ చరణ్ రెడ్డి మాట్లాడుతూ… గత పది సంవత్సరాలుగా మోదీ ప్రభుత్వం ప్రజావ్యతిరేక పరిపాలన అవలంబిస్తోందని అన్నారు.
ఉన్నత చదువులు చదివిన దేశ యువతను ఈ బీజేపీ సర్కార్ మత్తుకు మాదక ద్రవ్యాలకు బానిసలను చేస్తూ యువత చేతులకు సంకెళ్ళను విధిస్తుందని మండిపడ్డారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని నమ్మించి గద్దెనెక్కిన మోదీ సర్కార్ ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా దేశ యువత భవిష్యత్తును కేంద్ర బిజెపి ప్రభుత్వం సర్వ నాశనం చేస్తుందని అన్నారు. అదేవిధంగా పన్ను రూపంలో తెలంగాణ ప్రజల రక్తాన్ని పీల్చుకు తింటున్న కేంద్ర ప్రభుత్వం.. కేంద్ర బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రానికి మొండి చేయి చూపించడం సిగ్గుచేటు అని అన్నారు. కార్యక్రమంలో జాతీయ యువజన కాంగ్రెస్ ఇంచార్జ్ శ్రీ కృష్ణ అల్లవారు గారు, తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ ఇంచార్జ్ శ్రీ సురభి ద్వివేది గారు, జాతీయ యువజన కాంగ్రెస్ నాయకులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.