- రిక్రూట్‌మెంట్లు పెరిగినా..డ్రాపౌట్స్ పెరగడమేంటి?
- ప్రభుత్వ తీరును నిలదీసిన బిజెపి ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి
- తమ హయాంలో విద్యావ్యవస్థను పటిష్టం చేశామన్న హరీష్ రావు
హైదరాబాద్,ప్రజాతంత్ర , మార్చి 25 : టీచర్ల రిక్రూట్‌మెంట్ జరిగినా.. ప్రభుత్వ పాఠశాలల్లో డ్రాప్ ఔట్స్ పెరగడం ఏమిటని తెలంగాణ అసెంబ్లీ (Telangana Assembly) లో బీజేపీ ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి (Rakesh Reddy) ప్రభుత్వ విద్యా వ్యవస్థపై తీవ్ర విమర్శలు చేశారు. బడ్జెట్ పద్దలుపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా వాడీవేడి చర్చ సాగింది. బీఆర్‌ఎస్ ప్రభుత్వం 26 వేల మందిని మాత్రమే రిక్రూట్ చేసిందని, ఇక కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే క్రెడిట్ తీసుకుంటుందని రాకేశ్ రెడ్డి విమర్శించారు.
అంతమందిని రిక్రూట్ చేశారని చెబుతున్నారు. కానీ గతంలో ఒక్కటే కాలేజీ ఉండేది. ఇప్పుడు 100కు పెరిగాయి. కానీ ప్రభుత్వ విద్యా వ్యవస్థలో మౌలిక సదుపాయాలు ఇంకా గణనీయంగా అభివృద్ధి చెందలేదని ఆయన అన్నారు. ఆయన తన ప్రసంగంలో విద్యా వ్యవస్థలో ఏర్పడిన లోపాలను ఎత్తి చూపారు. పదేళ్లలో 6,000 ప్రభుత్వ స్కూళ్లు మూతపడ్డాయని, గత ఏడాది లోపలే 1,800 స్కూళ్లు మూతపడిన విషయం గమనార్హమని చెప్పారు. అప్పుడు బంగారు తెలంగాణ అని చెప్పారు, ఇప్పుడు వజ్రాల తెలంగాణ అంటున్నారు. కానీ విద్యా రంగం మాత్రం దిగజారిపోతోంది. 1931 ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు లేకుండా ఉన్నాయి. ఇన్ని వేల కోట్ల బడ్జెట్ పెట్టినా పరిస్థితి మారడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వ స్కూళ్లపై ప్రజలు నమ్మకం కోల్పోతున్నారు. స్కూళ్లలో ఒకటే బాత్రూం ఉంటుంది, అక్కడ పందులు తిరుగుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో పిల్లలు ఎలా ప్రభుత్వ స్కూళ్లలో చదవగలరని అన్నారు. తల్లిదండ్రులు అప్పు చేసి ప్రైవేట్ స్కూళ్లకు పంపించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందో ఆలోచించాలని పైడి రాకేశ్ రెడ్డి అన్నారు. విద్యాశాఖ సీఎం వద్ద ఉంది. కానీ సీఎం దగ్గర చాలా పనులు ఉంటాయి. కాబట్టి ఈ శాఖను మరొకరికి అప్పగిస్తే మంచిది. ప్రభుత్వ పాఠశాలల పరిస్థితిని మెరుగుపరిచే బాధ్యత ప్రభుత్వంపై ఉంది. లేకపోతే డ్రాప్ ఔట్స్ సంఖ్య ఇంకా పెరుగుతుందని ఎమ్మెల్యే సూచించారు. విద్యా వ్యవస్థను బలోపేతం చేయడానికి సీనియర్ సభ్యుల సూచనలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ స్కూళ్లలో మౌలిక సదుపాయాలు కల్పించాలని, రి-టైర్డ్ ఆఫీసర్ల సహాయంతో పాఠశాలల నిర్వహణను మెరుగుపర్చాలన్నారు రాకేశ్ రెడ్డి. స్కూళ్లకు కాంపౌండ్ వాల్, శుభ్రమైన వసతులు కల్పించాలని, బడ్జెట్ కేటాయింపులను స్పష్టంగా ప్రజలకు తెలియజేయాల న్నారు. ఇకపోతే ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారాలకు అసెంబ్లీలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. తాము ఒక్క టీచర్ పోస్టు కూడా భర్తీ చేయలేదని నిరూపించగలవా అని శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్‌బాబుకు హరీశ్ రావు సవాల్ విసిరారు.
బీఆర్‌ఎస్ హయాంలో ఒక్క టీచర్ పోస్టు భర్తీ జరగలేదని మంత్రి శ్రీధర్ బాబు సత్యదూరం మాటలు మాట్లాడారు. నేను ఛాలెంజ్ వేస్తున్నా.. బీఆర్‌ఎస్ హయాంలో 26 వేల ఉపాధ్యాయ నియామకాలు జరిగాయి.. 8 వేల ఉద్యోగాలు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా, మరో 18 వేల ఉద్యోగాలు గురుకులాల్లో నియామకాలు చేసినం. 26 వేల టీచర్ పోస్టులను భర్తీ చేస్తే ఒక్కటి కూడా భర్తీ చేయలేదని శ్రీధర్ బాబు మాట్లాడడం సరికాదు. ఇక రెండో విషయానికి వస్తే.. ఎన్ని స్కూళ్లు మూతపడ్డాయని మా సబితక్క అడిగితే.. 79 స్కూల్స్ తెరిపించామని బాగానే చెప్పారు. కానీ కాంగ్రెస్ పాలనలో మూతబడ్డ 1913 స్కూళ్ల సంగతి ఎందుకు మాట్లాడరని అడుగుతున్నానని మంత్రి శ్రీధర్‌బాబును హరీశ్‌రావు (Harish rao ) ప్రశ్నించారు.