– సెప్టెంబర్ 15లోపు ఎంట్రీలు పంపాలి
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 22 :బతుకమ్మ పండగ సందర్భంగా తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ’యంగ్ ఫిల్మ్ మేకర్ ఛాలెంజ్ 2026- సీజన్-2′ పోటీలను నిర్వహిస్తున్నట్లు ఎఫ్‌డీసీ చైర్మన్ దిల్ రాజు తెలిపారు. కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను ఎఫ్‌డీసీ ఎండీ జి.ముకుంద రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ క్రెయేటివ్ డైరెక్టర్ రాజ్ కొండా, ఎఫ్‌డీసీ ఈడీ కిషోర్ బాబులతో కలిసి శనివారం ఆవిష్కరించారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలపై, తెలంగాణ చరిత్ర, సంస్కృతి, పండుగలు, కళారూపాలపై షార్ట్ ఫిలిం, పాటల పోటీలు ఉంటాయన్నారు. ఈసారి కొత్తగా జానపద గీతాలు, రాష్ట్ర ప్రభుత్వ పథకాలపై ఇన్‌ఫ్లుయెన్సర్ల వీడియోస్, వ్యాసాలు(ఆర్టికల్స్)కు చోటు కల్పించారు. ఈ పోటీని యువ ప్రతిభావంతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. రాజ్ కొండా మాట్లాడుతూ ఈ పోటీలు యువతకు భవిష్యత్తులో సినీ రంగంలో అవకాశాలను సృష్టిస్తాయని, సృజనాత్మక కంటెంట్‌కు వేదికగా నిలుస్తాయని తెలిపారు. తెలంగాణ సంప్రదాయాలు, సంస్కృతి, పండగలు, ప్రజా ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు విస్తృతస్థాయిలో ప్రాచుర్యం పొందేందుకు దోహదం చేస్తాయన్నారు. లఘు చిత్రాల నిడివి 3 నిమిషాలు, పాటల రన్‌టైమ్ 5 నిమిషాలకు మించకూడదు. ఆయా వీడియోలు 4కే రిజల్యూషన్ కలిగి ఉండాలి. ఆసక్తి కలిగిన వారు వాటిని సెప్టెంబర్ 15లోపు youngfilmmakerschallenge@gmail.com మెయిల్‌కు గానీ, 8125834009 వాట్సాప్ నంబరుకు గానీ పంపాలి. అనంతరం నిపుణులతో కూడిన జ్యూరీ విజేతలను ప్రకటిస్తుంది. ఈ పోటీలలో ప్రథమ బహుమతి రూ.3 లక్షలు, ద్వితీయ బహుమతి రూ.2 లక్షలు, తృతీయ బహుమతి రూ.లక్ష. మరో ఐదుగురికి కన్సోలేషన్ బహుమతిగా రూ.20 వేల చొప్పున అందించనున్నారు. ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలు ప్రదానం చేస్తారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





