– కేంబ్రిడ్జి వర్సిటీ ప్రతినిధులతో తెలంగాణ రైజింగ్ ప్రతినిధులు
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 22 : హైదరాబాద్‌ను ప్రపంచస్థాయి విజ్ఞాన కేంద్రంగా తీర్చిదిద్దే ప్రభుత్వ లక్ష్యంలో భాగస్వాములు కావాలని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం విద్యావేత్తల బృందాన్ని ఆహ్వానించింది. ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ఈ ప్రతినిధి బృందం కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ప్రతినిధులతో తెలంగాణలో విద్య, పరిశోధన రంగాల్లో భాగస్వామ్య అవకాశాలపై విస్తృతంగా చర్చించింది. సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితోపాటు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి. శ్రీధర్‌బాబు, సీఎం సలహాదారు, ఎక్సఅఫీషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్‌రంజన్ పాల్గొన్నారు. ప్రపంచంలోని అత్యుత్తమ విద్యా సంస్థలకు హైదరాబాద్‌లో ఉన్న అవకాశాలను కేంబ్రిడ్జ్ ప్రతినిధులకు వివరించారు. కేంబ్రిడ్జ్ జడ్జ్ బిజినెస్ స్కూల్‌లో భారత ప్రభుత్వ ఆధ్వర్యంలోని మార్కెటింగ్ చైర్ ప్రొఫెసర్ జైదీప్ ప్రభు, అదే సంస్థకు చెందిన ప్రొఫెసర్ వెంకట సిరీష్ గండికోట, ‘ఫ్రూగల్ ఏఐ’ కో-చైర్ తెలంగాణతో కలిసి పనిచేసేందుకు ఆసక్తి వ్యక్తం చేశారు. తెలంగాణలో ఉన్న అవకాశాలపై వారు ప్రత్యేకంగా సానుకూలంగా స్పందించారు. హైదరాబాద్‌లో విద్యా కార్యక్రమాలు నిర్వహించడం, సంయుక్తంగా పరిశోధనలు చేపట్టడం, యువ పారిశ్రామికవేత్తలకు అవసరమైన ఇంక్యుబేషన్, స్టార్టప్‌ల అభివృద్ధికి సహకరించడం వంటి అంశాల్లో భాగస్వామ్యానికి ఒక స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాల ని ఇరు వర్గాలు అంగీకరించాయి. ప్రపంచ ప్రఖ్యాత కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంతో తెలంగాణ భాగస్వామ్యానికి ఈ చర్చలు కొత్త మార్గం చూపనున్నాయి. హైదరాబాద్‌ను అంతర్జాతీయ విద్యా, పరిశోధన, ఆవిష్కరణల కేంద్రంగా తీర్చిదిద్దాలన్న ‘తెలంగాణ రైజింగ్ ’ లక్ష్యానికి ఈ సమావేశం మరింత బలం చేకూర్చనుంది.
సీఎంతో లివర్‌పూల్ సిటీ డెవలప్‌మెంట్ ప్రతినిధులు
లండన్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని లివర్‌పూల్ సిటీ డెవలప్‌మెంట్ విభాగానికి చెందిన సుసాన్ ఫిన్నెగాన్, నూలా గల్లాఘర్, లివర్‌పూల్ ఫుట్‌బాల్ క్లబ్‌కు చెందిన పలువురు మర్యాదపూర్వకంగా కలిశారు. లైఫ్ సైన్సెస్, టెక్నాలజీ, క్రీడలు, సృజనాత్మక ఆర్థిక వ్యవస్థకు సంబంధించి తెలంగాణతో వ్యూహాత్మక భాగస్వామ్యానికి లివర్‌పూల్ ఆసక్తి చూపింది. ఈ భాగస్వామ్యాన్ని అధికారికంగా ఖరారు చేయడానికి లివర్‌పూల్ ప్రతినిధి బృందం అక్టోబర్‌లో హైదరాబాద్‌ను సందర్శించనుంది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





