– విద్యుత్ కొరత లేని రాష్ట్రమే లక్ష్యం
– విద్యుత్ డిమాండ్‌కు దీటుగా ప్రణాళికలు
– ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 22 : రాష్ట్రాన్ని 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే లక్ష్యానికి అనుగుణంగా విద్యుత్ రంగాన్ని మరింత బలోపేతం చేస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టంగా ప్రకటించారు. రాష్ట్రంలో విద్యుత్, నీటి కొరత లేకుండా పారిశ్రామిక రంగానికి అవసరమైన మౌలిక వసతులను కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజా వేదికగా ఎస్పీడీసీఎల్ నిర్వహిస్తున్న పవర్ ఎగ్జిబిషన్-2026ను ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క శనివారం ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ విద్యుత్ శాఖ సాధిస్తున్న విజయాలు, తీసుకొస్తున్న సంస్కరణలు, ఆధునిక సాంకేతికతను ప్రజలకు, ముఖ్యంగా విద్యార్థులకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. దేశవ్యాప్తంగా ఉన్న పరిశ్రమలు, పెట్టుబడిదారులు తెలంగాణలో మాన్యుఫ్యాక్చరింగ్, సర్వీస్ రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. భవిష్యత్ విద్యుత్ అవసరాలను ముందుగానే అంచనా వేసి థర్మల్, సోలార్, హైడల్, పంప్‌డ్ స్టోరేజ్, బ్యాటరీ స్టోరేజ్ వంటి అన్ని మార్గాల్లో విద్యుత్ ఉత్పత్తి, సరఫరా సామర్థ్యాలను పెంచేందుకు దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు. బయటకు కనిపించకున్నా రాష్ట్ర అభివృద్ధికి విద్యుత్ ఉద్యోగులు అందిస్తున్న సేవలు ఎంతో కీలకమని ఆయన ప్రశంసించారు. రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ గణనీయంగా పెరిగినప్పటికీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా విద్యుత్ సరఫరా చేయగలుగుతున్నామని చెప్పారు. గతంలో సుమారు 13 వేల మెగావాట్లుగా ఉన్న పీక్ డిమాండ్ ప్రస్తుతం 18 వేల మెగావాట్లకు పైగా చేరినా ట్రాన్స్‌మిషన్ వ్యవస్థ పటిష్టం, ముందస్తు ప్రణాళికలు, అవసరమైన విద్యుత్‌ను సమయానుకూలంగా సమీకరించడం వల్ల సరఫరాలో అంతరాయం లేకుండా ప్రజలకు అందించగలిగామని ఉప ముఖ్యమంత్రి వివరించారు. 1912 టోల్‌ఫ్రీ సేవలు, ‘పవర్ అంబులెన్స్’ ద్వారా విద్యుత్ వినియోగదారుల సమస్యలను వేగంగా పరిష్కరిస్తున్నామని తెలిపారు. 1912కు ఫోన్ చేసిన వెంటనే సమస్యను నమోదు చేసి పరిష్కరించే వ్యవస్థను మరింత సమర్థవంతంగా అమలు చేస్తున్నామన్నారు. అవసరమైన పరికరాలు, ట్రాన్స్‌ఫార్మర్లు, సిబ్బందితో సిద్ధంగా ఉండే పవర్ అంబులెన్సెస్ ద్వారా విద్యుత్ సమస్యలు తలెత్తిన ప్రాంతాలకు తక్షణమే చేరుకుని పరిష్కరించే విధానాన్ని రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తున్నామని వెల్లడించారు. సాంకేతికత వినియోగాన్ని పెంచుతూ ఇన్ హౌస్ సాఫ్ట్‌వేర్ అభివృద్ధి చేయడం అభినందనీయమని భట్టి కొనియాడారు. వినియోగదారుడి నంబర్ ఆధారంగా అతని లొకేషన్, విద్యుత్ సరఫరా ఎక్కడినుంచి జరుగుతోంది వంటి సమాచారాన్ని సాంకేతిక పరిజ్ఞానం ద్వారా అందుబాటులోకి తీసుకురావడం విద్యుత్ సేవల్లో పారదర్శకత, సామర్థ్యాన్ని పెంచుతుందని తెలిపారు. 2047 నాటికి లక్ష్యాలను నిర్దేశించుకుని ఇప్పటినుంచే ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టుల ఏర్పాటుకుì కనీసం నాలుగైదేళ్ల సమయం అవసరమవుతుందని, అందువల్ల భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ముందస్తు ప్రణాళికలు తప్పనిసరి అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. థర్మల్ విద్యుత్‌తోపాటు గ్రీన్ ఎనర్జీకి ప్రాధాన్యత ఇస్తున్నామని, సోలార్, హైడల్, పంప్‌డ్ స్టోరేజ్, బ్యాటరీ స్టోరేజ్ సామర్థ్యాలను పెంచే దిశగా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. విద్యుత్ రంగం వ్యవసాయం, పరిశ్రమలు, సేవా రంగం సహా ప్రతి ఉత్పత్తి రంగానికి పునాది వంటిదని, రాష్ట్ర జీఎస్డీపీ వృద్ధికి నిరంతర విద్యుత్ సరఫరా అత్యంత కీలకమని పేర్కొన్నారు. భవిష్యత్తులోనూ రాష్ట్రంలో విద్యుత్ కొరతకు తావులేకుండా, పరిశ్రమల అవసరాలకు సరిపడ విద్యుత్‌ను అందించేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నామని చెప్పారు. విద్యుత్ ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని భట్టి తెలిపారు. పెండింగ్‌లో ఉన్న ప్రమోషన్లను కల్పించడంతోపాటు ప్రమాదకర పరిస్థితుల్లో విధులు నిర్వర్తించే ప్రతి ఉద్యోగికి రూ.కోటి ప్రమాద బీమా కల్పించినట్లు చెప్పారు. ఉద్యోగులు, వారి కుటుంబాల సంక్షేమం పట్ల ప్రభుత్వం పూర్తి బాధ్యతతో వ్యవహరిస్తుందని స్పష్టం చేశారు. విద్యుత్ సంస్కరణలు, విజయాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని ఉద్యోగులకు ఉప ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. శాఖకు చెందిన యాప్‌లు, ప్రజాబాట కార్యక్రమం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకం, హైదరాబాద్‌లో చేపడుతున్న అండర్‌గ్రౌండ్ కేబుల్ వ్యవస్థ వంటి కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో విద్యుత్ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్, ఎస్పీడీసీఎల్ సీఎండీ జితేష్ వి.పాటిల్, ఎన్‌పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి, ట్రాన్స్ కో సీఎండీ కృష్ణ భాస్కర్, ఇతర డైరెక్టర్లు, సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





