వైద్య విద్యార్థిని అకీరాకు కేటీఆర్ ఆర్థిక భరోసా

– ఎంబీబీఎస్ చదువుకు రూ.2 లక్షల ఆర్థిక సహాయం

హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 21: ఆర్థిక ఇబ్బందులతో వైద్య విద్యను కొనసాగించేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్న వరంగల్ జిల్లా వర్ధన్నపేటకు చెందిన కొండేటి అకీరాకు కేటీఆర్ అండగా నిలిచారు. ఎంబీబీఎస్ విద్యను కొనసాగించేందుకు రూ.2 లక్షల ఆర్థిక సహాయాన్ని అందించారు. వర్ధన్నపేట పట్టణానికి చెందిన కొండేటి భాస్కర్, అనిత దంపతుల కుమార్తె అకీరా. తుర్రూరులోని సాంఘిక సంక్షేమ పాఠశాలలో పదో తరగతి, ఖమ్మంలోని అంబేడ్కర్ కళాశాలలో ఇంటర్మీడియట్ విద్యను పూర్తి చేసిన అకీరా జాతీయ వైద్య ప్రవేశ పరీక్షలో అఖిల భారత స్థాయిలో 2,99,946 ర్యాంకు, ఎస్సీ విభాగంలో 27,865 ర్యాంకు సాధించింది. అనంతరం పటాన్‌చెరువులోని మహేశ్వర వైద్య కళాశాలలో ఎంబీబీఎస్‌లో ప్రవేశం పొందింది. అకీరా వైద్య విద్యకు సంబంధించిన ఆర్థిక ఇబ్బందుల విషయాన్ని జర్నలిస్ట్ బొల్లెపాక రాజేష్ ట్విట్టర్ ద్వారా కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న కేటీఆర్ స్పందించి అకీరా చదువుకు ఆర్థిక సహాయం అందిస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం సోమవారం తెలంగాణ భవన్‌లో అకీరాకు రూ.2 లక్షల ఆర్థిక సహాయాన్ని కేటీఆర్ అందజేశారు. పేద విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించేందుకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా అండగా ఉంటానని పేర్కొంటూ, అకీరా భవిష్యత్తులో వైద్యురాలిగా ఎదగాలని ఆకాంక్షించారు. అంతేకాకుండా అకీరా వైద్య విద్య పూర్తయ్యే వరకు భవిష్యత్తులోనూ అండగా ఉంటానని కేటీఆర్ హామీ ఇచ్చారు. కేటీఆర్ అందించిన ఆర్థిక సహాయంతో తన వైద్య విద్యను కొనసాగించేందుకు మరింత ధైర్యం వచ్చిందని అకీరా తెలిపింది. తన చదువుకు అండగా నిలిచిన కేటీఆర్‌కు అకీరా కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *