– లోక్‌సభ ప్యానల్ విచారణలో సంచలన విషయాలు వెల్లడి
న్యూదిల్లీ, ఆగస్ట్ 12 : ఇంట్లో భారీగా నోట్ల కట్టలు లభించిన కేసులో దిల్లీ హైకోర్టు మాజీ జడ్జి యశ్వంత్ వర్మ దోషిగా తేలారు. అతడిపై మోపిన అభియోగాలు అన్నీ నిజమేనని లోక్‌సభ ప్యానెల్ నిర్ధరించింది. అయితే, ఈ విషయంలో అతడిపై ఏ చర్యలు తీసుకుంటారనే విషయంలో ఇంకా స్పష్టత లేదు. దిల్లీ హైకోర్టు మాజీ జడ్జి, రిటైర్డ్ జస్టిస్ యశ్వంత్ వర్మ దిల్లీలోని 30 తుగ్లక్ రోడ్డులోని ప్రభుత్వ భవనాల్లో నివాసం ఉంటున్నాడు. గత ఏడాది మార్చి 14-15 తేదీల మధ్య ఇంట్లో అగ్నిప్రమాదం జరగగా అగ్నిమాపక సిబ్బంది వెళ్లి మంటలను ఆర్పారు. ఈ ఘటనకు సంబంధించి అప్పట్లో కొన్ని ఫొటోలు బయటపడ్డాయి. యశ్వంత్ వర్మ ఇంట్లో భారీగా నోట్ల కట్టలున్నాయి. ఇంటి స్టోర్ రూమ్‌లో ఈ నోట్ల కట్టలు చాలావరకు కాలిపోయాయి. కొన్ని ధ్వంసమయ్యాయి. అవన్నీ రూ.500 నోట్ల కట్టలే. ఈ అంశం వివాదాస్పదం కావడంతో పోలీసులు, ఇతర అధికారులు ఆ ఇంటికి వెళ్లి ఆ ప్రదేశాన్ని సీజ్ చేశారు. అప్పటికే ఇంట్లోని సాక్ష్యాలు తారుమారయ్యాయి. ఫొటోల్లో కనిపించిన కరెన్సీ నోట్లు ఆ సమయానికి అక్కడ లేవు. మొదట ఈ నోట్ల కట్టలకు, తనకు సంబంధం లేదని యశ్వంత్ వర్మ చెప్పాడు. ఒక రిటైర్డ్ జడ్జి ఇంట్లో భారీగా నోట్ల కట్టలు కనిపించడం సంచలనంగా మారింది. జడ్జిల అవినీతి అంశం తెరదకు వచ్చింది. దీంతో ఈ అంశంపై పెద్ద దుమారం రేగింది. చివరకు దీనిపై పార్లమెంట్ స్పందించింది. ఈ అంశంపై విచారణ జరిపేందుకు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఒక ప్యానెల్ ఏర్పాటు చేశారు. ఈ ప్యానెల్ విచారణ జరిపింది. ఈ విచారణ తర్వాత అతడిని దోషిగా గుర్తించింది. ఇందుకు ప్రధాన కారణాలు ఇవి. ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది.. అది ఎవరిది.. ఆ డబ్బు ఎంత ఉంటుంది.. వంటి వివరాలపై యశ్వంత్ వర్మ సరైన సమాధానం చెప్పలేకపోయారు. ఆ డబ్బు ఎక్కడినుంచి వచ్చిందో తనకు తెలియదన్నాడు. ఇతరులు తన ఇంటిని అక్రమంగా వాడుకునే అవకాశం ఉందని, ఎవరో తనకు తెలియకుండా డబ్బు తన ఇంట్లో పెట్టారని వర్మ చెప్పాడు. తనపై కుట్ర చేసి ఎవరో ఆ నోట్లు తన ఇంట్లో పెట్టారని చెప్పాడు. అయితే, ఇందుకు తగ్గ సాక్షాల్ని ఆయన చూపించలేకపోయారు. ఆ సమాధానాలు నమ్మలేని విధంగా ఉన్నాయి. విచారణ ప్యానెల్ కూడా ఆ ఇంట్లోకి బయటి వ్యక్తులు వచ్చి,అంత డబ్బు ఉంచినట్లు ఆధారాలు లేవని తేల్చింది. మరోవైపు కాలిపోయిన నోట్లు తర్వాత కనిపించకపోవడంపై కూడా వర్మ సరైన సమాధానం చెప్పలేకపోయారు. దీంతో వర్మను లోక్‌సభ ప్యానెల్ దోషిగా తేల్చింది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు



