జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా కోరుతూ ‘ఇండి’ కూటమి నిరసన

– నీతి ఆయోగ్‌ సమీపంలో అడ్డుకున్న పోలీసులు
– పలువురు నేతల నిర్బంధం
– ఆకాశవాణి భవన్‌లో రాహుల్‌, ప్రియాంక బైఠాయింపు

న్యూదిల్లీ, అక్టోబర్‌ 6: ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలన్న డిమాండ్‌తో ‘ఇండి’ కూటమి ఎంపీలు మంగళవారం చేపట్టిన మార్చ్‌ ఉద్రిక్తతకు దారితీసింది. పార్లమెంట్‌ నుంచి ఎన్నికల కమిషన్‌ ప్రధాన కార్యాలయం నిర్వాచన్‌ సదన్‌కు బయలుదేరిన ఎంపీలను నీతి ఆయోగ్‌-ఆకాశవాణి భవన్‌ సమీపంలో పోలీసులు అడ్డుకున్నారు. ముందుకు వెళ్లేందుకు అనుమతించకపోవడంతో ప్రతిపక్ష నేతలు రోడ్డుపైనే బైఠాయించారు. పలువురు ఎంపీలను పోలీసులు అదుపులోకి తీసుకొని బస్సుల్లో తరలించారు. అనంతరం రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ ఆకాశవాణి భవన్‌ ప్రాంగణంలోకి వెళ్లి నిరసన కొనసాగించారు. వోటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు, ఎన్నికల కమిషన్‌ పనితీరుపై అభ్యంతరాల నేపథ్యంలో ఇండియా కూటమి ఈ మార్చ్‌కు పిలుపునిచ్చింది. ఉదయం సుమారు 11 గంటలకు పార్లమెంట్‌ మకర ద్వారం నుంచి ఎంపీలు బయలుదేరారు. పార్లమెంట్‌, నిర్వాచన్‌ సదన్‌ పరిసరాల్లో ముందుగానే భారీగా భద్రతా బలగాలను మోహరించి, మార్గమధ్యంలో బారికేడ్లు ఏర్పాటు చేశారు. ప్రజాస్వామ్యాన్ని, వోటు హక్కును పరిరక్షించాలని కోరుతూ ఎంపీలు ప్లకార్డులతో నిరసన తెలిపారు.కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌, తృణమూల్‌ కాంగ్రెస్‌ నేతలు అభిషేక్‌ బెనర్జీ, డెరెక్‌ ఓబ్రెయిన్‌, సీపీఎం ఎంపీ జాన్‌ బ్రిట్టాస్‌, ఎన్సీపీ-శరద్‌ పవార్‌ వర్గం ఎంపీ సుప్రియా సూలే తదితరులు పాల్గొన్నారు. డీఎంకే, ఆమ్‌ ఆద్మీ పార్టీ ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నాయి.పోలీసులు మార్చ్‌ను నిలిపివేయడంతో రాహుల్‌ గాంధీ, అభిషేక్‌ బెనర్జీ బారికేడ్లపైకి ఎక్కారు. ప్రియాంక గాంధీని పోలీసులు బస్సులోకి తీసుకెళ్లగా కొద్దిసేపటికి ఆమె కిందికి దిగి రాహుల్‌తో కలిశారు. అనంతరం రాహుల్‌, ప్రియాంక, దీపేందర్‌ హుడా ఆకాశవాణి భవన్‌ రిసెప్షన్‌ గేటు ద్వారా ప్రాంగణంలోకి ప్రవేశించారు. అక్కడ చెట్టు కింద కూర్చొని, ఎన్నికల కమిషన్‌ కార్యాలయానికి వెళ్లేందుకు అనుమతించాలని పట్టుబట్టారు. ప్రాంగణాన్ని ఖాలీ  చేయాలని పోలీసులు కోరినా వారు నిరసన కొనసాగించారు.మరోవైపు అఖిలేశ్‌ యాదవ్‌, అభిషేక్‌ బెనర్జీ, డెరెక్‌ ఓబ్రెయిన్‌ తదితరులను పోలీసులు బస్సుల్లో తరలించారు. రాహుల్‌తోపాటు కొందరు ఎంపీలను కొద్దిసేపు నిర్బంధించి విడుదల చేసారు.ఆకాశవాణి భవన్‌ ప్రాంగణంలో విలేకరులతో మాట్లాడిన రాహుల్‌ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, ఆర్‌ఎస్‌ఎస్‌ అధినేత మోహన్‌ భాగవత్‌, సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ కలిసి ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీశారని ఆరోపించారు. వోట్ల అక్రమాలకు బాధ్యులైనవారు జవాబుదారీతనం నుంచి తప్పించుకోలేరన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం తమతో 300 మంది ఎంపీలు వచ్చారని ఆయన పేర్కొన్నారు.ప్రతిపక్షాల ఆందోళనపై బీజేపీ ఎదురుదాడికి దిగింది. కాంగ్రెస్‌ రాజ్యాంగ సంస్థలపై దాడి చేస్తూ దేశంలో అరాచకాన్ని ప్రోత్సహిస్తోందని పార్టీ ప్రతినిధి సంబిత్‌ పాత్ర ఆరోపించారు. ఎన్నికల పరాజయాలపై అసంతృప్తితో ప్రతిపక్షాలు ప్రజాస్వామ్య సంస్థలను అప్రతిష్ఠపాలు చేస్తున్నాయని కేంద్ర మంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ విమర్శించారు. వోటు హక్కు పరిరక్షణ ఉద్యమాన్ని కొనసాగిస్తామని ప్రతిపక్షాలు ప్రకటించాయి. ముందుగా ప్రకటించిన కార్యాచరణ ప్రకారం 8 వరకు జిల్లాస్థాయి పాదయాత్రలు, 10 నుంచి 20 వరకు బ్లాక్‌ స్థాయి కార్యక్రమాలు నిర్వహించనున్నారు. 25 నుంచి నవంబర్‌ 25 వరకు సభలు చేపట్టనున్నారు. ఎన్నికల వ్యవస్థకు సంబంధించిన అభ్యంతరాలను వివరించేందుకు అక్టోబర్‌ రెండో వారంలో రాష్ట్రపతిని కలిసేందుకు సమయం కోరనున్నట్లు కూటమి తెలిపింది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *