– వెంకటేశం కుటుంబానికి న్యాయం జరిగేదాకా అండగా ఉంటాం
– కుటుంబాన్ని పరామర్శించిన బీఆరఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
– రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా నిష్పక్షపాత దర్యాప్తు చేయాలి
సిరిసిల్ల, ప్రజాతంత్ర, ఆగస్టు 12 : పట్టణంలోని బీవై నగర్‌కు చెందిన నేత కార్మికుడు వెంగళ వెంకటేశం కుటుంబాన్ని బీఆరఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ బుధవారం పరామర్శించారు. వెంకటేశం మృతిపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన కేటీఆర్ ఆయన భార్య, తల్లి, కుమార్తెను ఓదార్చి న్యాయం జరిగేదాకా ఆ కుటుంబం వెంటే ఉంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెంకటేశం మృతికి దారితీసిన పరిస్థితులపై సమగ్ర దర్యాప్తు జరిపి ఘటనకు అసలు కారణాలు, బాధ్యులు, సూత్రధారులు ఎవరైనా వారిని వెలుగులోకి తీసుకురావాలని పోలీసులను డిమాండ్ చేశారు. కాంగ్రెస్ హత్యా రాజకీయాలు చేస్తున్నదని విమర్శించారు. తమపై రాజకీయ విమర్శలు చేయవచ్చని, కేసులు పెట్టవచ్చని, కానీ సామాన్య ప్రజలను రాజకీయాలకు బలిపశువులుగా మార్చడం సమర్థనీయం కాదన్నారు. వెంకటేశం కుటుంబ పరిస్థితిని చూసి తీవ్ర భావోద్వేగానికి గురైన కేటీఆర్ ఆయన చిన్నారి కుమార్తె తన తండ్రి కోసం ఎదురు చూస్తూ మూడు రోజులుగా తినలేదని చెప్పడం తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. మనసున్న ఏ మనిషికైనా కన్నీళ్లు రాక మానవు.. గుండె ద్రవించక మానదు అని కేటీఆర్ అన్నారు.
అసలు సూత్రధారులను గుర్తించాలి
వెంకటేశం మృతి ఘటనలో కాంగ్రెస్ నాయకులు కొందరిని పోలీసులు అరెస్టు చేసినప్పటికీ వారు పాత్రధారులు మాత్రమేనని, అసలు సూత్రధారులు ఎవరన్నది తేల్చాల్సిన అవసరం ఉందని కేటీఆర్ అన్నారు. ఐదుగురిని అరెస్టు చేసినట్లు చెబుతున్నప్పటికీ వారిలో ఇద్దరిని రిమాండ్‌కు పంపి మిగతా ముగ్గురికి స్టేషన్ బెయిల్ ఇవ్వడంపై కూడా కేటీఆర్ ప్రశ్నలు లేవనెత్తారు. పోలీసుల రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. కొత్త ఇల్లు మంజూరు చేయాలని తాము కాంగ్రెస్ నాయకులను ఆశ్రయించినప్పటికీ నెలలతరబడి తిప్పించుకున్నారని కుటుంబీకులు తన దృష్టికి తీసుకొచ్చారని చెప్పారు. ఈ విషయంపై ఇప్పటికే కలెక్టర్‌తో మాట్లాడానని, కుటుంబానికి ఇల్లు మంజూరు చేయండి.. ఒకవేళ ప్రభుత్వం ఇవ్వలేని పరిస్థితి ఉంటే బీఆరఎస్ పార్టీ తరఫున నిర్మించి ఇస్తాం.. మీరు మా ప్రయత్నానికి అడ్డుగా ఉండొద్దని కలెక్టర్‌కు చెప్పాను’ అని కేటీఆర్ తెలిపారు.
కుమార్తె భవిష్యత్ బాధ్యత నాదే
తాను ఎమ్మెల్యేగా మాత్రమే కాక ఆ కుటుంబానికి మాట ఇచ్చిన సోదరుడిగా బాధ్యత తీసుకుంటున్నానని కేటీఆర్ అన్నారు. వెంకటేశం కుమార్తె ప్రస్తుతం ఐదో తరగతి చదువుతున్నదని, ఆ బాలిక పేరుపై రూ.3 లక్షలు డిపాజిట్ చేసినట్లు, ఆమె మేజర్ అయ్యాక ఆ మొత్తం అందుబాటులోకి వచ్చేలా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఆమె చదువుతున్న పాఠశాలతో మాట్లాడి పదో తరగతి వరకు బాలిక ఫీజులు తదితర ఖర్చుల విషయంలో తాను వ్యక్తిగతంగా బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చానన్నారు. పదో తరగతి తర్వాత ఏం చదవాలనుకు న్నా ఆమె చదువు కొనసాగించే బాధ్యత కూడా తీసుకుంటానని హామీ ఇచ్చారు. కుటుంబానికి తక్షణ ఆర్థిక సహాయం కూడా పార్టీ తరఫున అందించామన్నారు.వెంకటేశం మృతిని ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం జరిగిందన్న ఆరోపణలను కూడా కేటీఆర్ ప్రస్తావిస్తూ సమగ్ర దర్యాప్తు జరిపి వాస్తవాలను ప్రజల ముందుంచాలని కోరారు. స్థానిక కాంగ్రెస్ నాయకత్వంపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు




