హెచ్‌ఐవీ రహిత రాష్ట్రంగా తెలంగాణ

– హెచ్‌ఐవీ/ఎయిడ్స్, సిఫిలిస్‌పై విస్తృత ప్రచారం అవసరం
– రవాణా శాఖ మంత్రి పొన్నం

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 12 : తెలంగాణను హెచఐవీ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. హెచ్‌ఐవీ/ఎయిడ్స్, సిఫిలిస్ నివారణపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించడంతోపాటు, వ్యక్తుల్లో స్వీయ ప్రమాద అంచనాను పెంపొందించి, స్వచ్ఛందంగా పరీక్షలు చేయించుకునేలా ప్రోత్సహించేందుకు రెండు నెలలపాటు నిర్వహించనున్న ప్రచార కార్యక్రమం హైదరాబాద్‌లో బుధవారం ప్రారంభమైంది. కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బుధవారం నుంచి అక్టోబర్ 12వరకు రాష్ట్రవ్యాప్తంగా ఈ ప్రత్యేక ఐఈసీ(ఇన్‌ఫర్మేషన్, ఎడ్యుకేషన్ అండ్ కమ్యూనికేషన్) ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ హెచ్‌ఐవీ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. సకాలంలో హెచ్‌ఐవీ పరీక్షలు చేయించుకోవడం, ముందస్తుగా గుర్తించడం, సరైన వైద్య సలహాలు పొందడం, సకాలంలో చికిత్స తీసుకోవడం వ్యాధి నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. ఎయిడ్స్ బారిన పడిన వ్యక్తుల పట్ల ఎలాంటి వివక్ష చూపకూడదని మంత్రి సూచించారు. వారికి అవసరమైన సహాయసహకారాలు అందిస్తూ ప్రతి ఒక్కరూ మానవతా దృక్పథంతో అండగా నిలవాలని కోరారు.

భారీ ర్యాలీలు

ప్రచారంలో భాగంగా హెచ్‌ఎండీఏ గ్రౌండ్స్ నుంచి నెక్లెస్ రోడ్ ప్రాంతంలో పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. బైక్ ర్యాలీని మంత్రి పొన్నం జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆటో ర్యాలీ నిర్వహించారు. ర్యాలీల్లో నర్సింగ్, వైద్య కళాశాలల విద్యార్థులు, ఎన్‌సీసీ, ఎన్‌ఎస్ఎస్ వలంటీర్లు, రాష్ట్రవ్యాప్తంగా స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో అమలవుతున్న టార్గెటెడ్ ఇంటర్వెన్షన్, లింక్ వర్కర్ స్కీమ్ ప్రాజెక్టుల సిబ్బంది చురుకుగా పాల్గొన్నారు. అనంతరం వాకథాన్‌లో 1,600మందికిపైగా పాల్గొన్నారు. ర్యాలీ, వాకథాన్‌లో పాల్గొన్న వారు హెచ్‌ఐవీ/ఎయిడ్స్, సిఫిలిస్ నివారణకు సంబంధించిన సందేశాలు, నినాదాలతో కూడిన ప్లకార్డులు, హెచఐవీ/ఎయిడ్స్ లోగో, క్యూఆర్ కోడ్‌లతో ఉన్న గొడుగులను ప్రదర్శిస్తూ ప్రజలకు అవగాహన కల్పించారు.

హెచ్‌ఐవీ నివారణలో తెలంగాణ పురోగతి

రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సొసైటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ కె.విద్యాసాగర్ రాష్ట్రంలో హెచ్‌ఐవీ నివారణ, పరీక్షలు, చికిత్సకు సంబంధించి అమలు చేస్తున్న కార్యక్రమాలపై వివరించారు. 2025-26 జాతీయ స్కోర్ కార్డులో తెలంగాణ 5వ స్థానాన్ని సాధించిందని, 2023లో ఉన్న 31వ స్థానం నుంచి గణనీయమైన పురోగతి సాధించిందని తెలిపారు. సమాచార, పౌర సంబంధాల శాఖ కమిషనర్ ముకుంద రెడ్డి మాట్లాడుతూ హెచ్‌ఐవీపై అపోహలను తొలగించి శాస్త్రీయ అవగాహనతో వ్యాధిని ఎదుర్కొనేందుకు కృషి చేయాలని సూచించారు. ప్ర‌ముఖ న‌టుడు తనికెళ్ల భరణి మాట్లాడుతూ యువత హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌పై సరైన సమాచారాన్ని తెలుసుకోవాలని, వ్యాధి వ్యాప్తి మార్గాలు, నివారణ చర్యలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. హెచ్‌ఐవీపై ప్రామాణిక సమాచారం కోసం టోల్‌ఫ్రీ హెల్ప్‌లైన్ 1097ను సంప్రదించాలని, అందుబాటులో ఉన్న నివారణ, పరీక్షలు, చికిత్స సేవలను వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమం ముగింపులో టీజీఎస్‌ఏసీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ ఆధ్వర్యంలో ముఖ్య అతిథులు, ప్రముఖులను సత్కరించారు. బెలూన్లను ఎగ‌రేసి రెండు నెలల ప్రచార కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించారు. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టినా జెడ్ చోంగ్తూ, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి.కర్ణన్, వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర నాయక్, తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *