భారతదేశం విజ్ఞాన ఆధారిత ఆర్థిక వ్యవస్థగా ఎదగాలన్న లక్ష్యం ప్రాథమిక విద్య అందరికీ సమానంగా అందడంపైనే ఆధారపడి ఉంది. గత రెండు దశాబ్దాలుగా బడుల్లో చేరే పిల్లల సంఖ్య పెరిగినప్పటికీ, స్త్రీ, పురుషుల అక్షరాస్యత మధ్య ఉన్న వ్యత్యాసం ఇప్పటికీ సమాజంలో ఒక ప్రధాన సమస్యగా కొనసాగుతోంది. అధికారిక గణాంకాలు పరిశీలిస్తే ఈ అంతరం స్పష్టంగా కనిపిస్తుంది. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే-5 ప్రకారం పురుషుల అక్షరాస్యత 84.4 శాతంగా ఉండగా, స్త్రీల అక్షరాస్యత కేవలం 71.5 శాతంగా నమోదైంది. అంటే దాదాపు 13 శాతం మేర వ్యత్యాసం ఉంది. గత జనాభా లెక్కల ప్రకారం చూసినా స్త్రీల అక్షరాస్యత 64.6 శాతానికే పరిమితమైంది. ఇది కేవలం గణాంకాల సమస్య మాత్రమే కాదు. సమాజంలో పాతుకుపోయిన పితృస్వామ్య భావజాలం, వ్యవస్థాగత నిర్లక్ష్యానికి నిదర్శనం.
పురుషుల కంటే స్త్రీలలో అక్షరాస్యత తక్కువగా ఉండటానికి బలమైన సామాజిక, ఆర్థిక కారణాలు ఉన్నాయి. పరిమిత ఆర్థిక వనరులు ఉన్న కుటుంబాల్లో మొదట మగపిల్లల చదువుకే ప్రాధాన్యం ఇస్తారు. ఆడపిల్లలను ఇంటి పనులకు, చిన్న పిల్లలను చూసుకోవడానికి, వ్యవసాయ పనులకు పరిమితం చేసే ధోరణి ఇంకా కొనసాగుతోంది. ప్రాథమిక విద్య దాటి మాధ్యమిక విద్యకు వచ్చేసరికి ఆడపిల్లలు బడి మానేసే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్లకు దూరంగా ఉండే హైస్కూళ్లు, సురక్షితమైన రవాణా సౌకర్యాలు లేకపోవడం, పాఠశాలల్లో బాలికలకు ప్రత్యేకమైన మరుగుదొడ్లు లేకపోవడం వంటి సమస్యలు వారిని చదువుకు దూరం చేస్తున్నాయి. దీనికితోడు కొన్ని ప్రాంతాల్లో కొనసాగుతున్న బాల్య వివాహాలు ఆడపిల్లల భవిష్యత్తును ప్రాథమిక స్థాయిలోనే ముగించేస్తున్నాయి.
మహిళల్లో నిరక్షరాస్యత సమాజంపై తీవ్రమైన ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. తల్లుల చదువుకు, పిల్లల ఆరోగ్యానికి ప్రత్యక్ష సంబంధం ఉంది. చదువు లేకపోవడం వల్ల ప్రసవ సమయ మరణాలు పెరగడం, పిల్లల్లో పౌష్టికాహార లోపం, టీకాలు సకాలంలో వేయించకపోవడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. ఆర్థికంగా చూస్తే, దేశ కార్మిక శక్తిలో మహిళల భాగస్వామ్యం చాలా తక్కువగా ఉండటానికి నిరక్షరాస్యతే ప్రధాన కారణం. కనీస చదువు లేకపోవడం వల్ల మహిళలు తక్కువ వేతనాలతో కూడిన అసంఘటిత రంగ పనులకే పరిమితమవుతున్నారు. దీనివల్ల ఆర్థిక స్వతంత్రత కోల్పోవడమే కాకుండా, బ్యాంకింగ్, డిజిటల్ సేవలను ఉపయోగించుకోవడం, గృహహింస వంటి సమస్యలను చట్టబద్ధంగా ఎదుర్కొనే చైతన్యం వారికి కొరవడుతోంది.
ఈ సవాళ్లను అధిగమించడానికి బడుల్లో చేరికల సంఖ్య కంటే బాలికలు చదువును కొనసాగించేలా పక్కా ప్రణాళికలు అమలు చేయాలి. ముఖ్యంగా ప్రతి పాఠశాలలో రక్షిత తాగునీరు, పరిశుభ్రమైన ప్రత్యేక మరుగుదొడ్లు, ఉచిత రవాణా సౌకర్యాలను కల్పించాలి. ఆడపిల్లలు ఉన్నత పాఠశాల చదువు పూర్తిచేసేలా కుటుంబాలకు ప్రోత్సాహకాలు, నగదు బదిలీ పథకాలను విస్తరించాలి. చదువుకునే వయస్సు దాటిపోయిన మహిళల కోసం స్వయం సహాయక సంఘాల ద్వారా డిజిటల్, ఆర్థిక అంశాలతో కూడిన ప్రత్యేక వయోజన విద్యా కార్యక్రమాలను నిర్వహించాలి. గ్రామ పంచాయతీలు బడి మానేసిన బాలికలను గుర్తించి, వారిని మళ్లీ చదువుల బాట పట్టించేలా స్థానిక యంత్రాంగాన్ని బాధ్యులను చేయాలి. సమాజంలో సగభాగమైన మహిళలను చదువుకు దూరం చేసి దేశ సమగ్రాభివృద్ధి సాధ్యం కాదు.
కింజరాపు అమరావతి





