తొలి రోజే ఉద్రిక్తం

– బీఆర్ఎస్, బీజేపీల నిరసనలతో రణరంగంగా అసెంబ్లీ పరిసరాలు

– నల్ల టీ షర్టులతో అసెంబ్లీ ముట్టడికి బీఆర్ఎస్ యత్నం
– బీజేపీ నేతల నిరసనలు
– అడ్డుకున్న పోలీసులు
– తోపులాటలో పలువురు నేతలకు గాయాలు
– మహిళా ఎమ్మెల్యేలతో పోలీసుల తీరు అమానుషం : సబిత, సునీత 
– స్పీకర్ పై ఎమ్మెల్సీ తాతా మధు అనుచిత‌చిత వ్యాఖ్యల దుమారం

అసెంబ్లీ సమావేశాల తొలిరోజే రాజకీయ వేడి తారస్థాయికి చేరింది. బీఆర్ఎస్, బీజేపీ నిరసనలతో అసెంబ్లీ పరిసరాలు ఉద్రిక్తంగా మారగా.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట చోటుచేసుకుంది. నల్ల దుస్తులతో వచ్చిన బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేల పట్ల పోలీసులు అనుచితంగా వ్యవ హరించారన్న ఆరోపణలు, పలువురు నేతలకు గాయాలు, మరోవైపు ఎమ్మెల్సీ తాతా మధు వ్యాఖ్యలపై దుమారంతో తొలిరోజు సభ రణరంగాన్ని తలపించింది.

         (మండువ రవీందర్రావు, ప్రజాతంత్ర ప్రతినిధి, వరంగల్)

అసెంబ్లీ మొదటి రోజు ఉద్రిక్తత చోటుచేసుకుంది. బీఆర్ఎస్, బీజెపి నిరసన ప్రదర్శనలతో అసెంబ్లీ ప్రాంతమంతా గందరగోళ వాతావరణం ఏర్పడింది. ఒకపక్క బిజెపి చేపట్టిన ‘చలో అసెంబ్లీ’ కార్యక్రమం, అరెస్టులు, మరోపక్క నెరవేర్చని ప్రభుత్వ హామీలపై నల్ల దుస్తులతో బీఆర్ఎస్ ప్రదర్శనతో ఒక విధంగా ఆ ప్రాంగణమంతా యుద్ధ వాతావర్ణాన్ని తలపించింది. సభలోకూడా బీజెపి, అధికారపక్షం మధ్య తీవ్ర స్థాయిలో చర్చ, బీజెపి వాకౌట్ తో సోమవారంనాటి సభా కార్యక్రమాలు
వాడివేడిగా కొనసాగాయి. అసెంబ్లీ ప్రారంభానికి ముందు బీఆర్ఎస్ శాసనసభ్యులను అసెం బ్లీలోకి వెళ్ళకుండా పోలీసులు అడ్డుకోవడం పెనుగులాటకు దారితీసింది. కాంగ్రెస్ అధికా రంలోకి రావడానికి ముందు ప్రజలకిచ్చిన హామీలు, వాగ్దానాలను నెరవేర్చలేదన్న నినాదా లను బిఆర్ఎస్ సభ్యులు ధరించిన నల్ల టీషర్టు లపై వ్రాయడంపై పోలీసులు అభ్యంతరం తెలుపడం వివాదంగామారింది. పార్లమెంటు లో రాహుల్గాంధీ, ప్రియాంకాగాంధీలు నల్ల దుస్తులు ధరించడం, ప్లకార్డులు ప్రదర్శించగాలే నిది తాము ప్రదర్శిస్తే తప్పేంటని బిఆర్ఎస్ నేతలు నిలదీస్తూ లోనికి వెళ్ళడానికి విఫల యత్నం చేశారు. ఈ సందర్భంగా పోలీసులు
బిఆర్ఎస్ సభ్యులను వెనక్కు నెట్టడం, కొందరు పురుష పోలీసులు సీనియర్ మహిళా శాసనస భ్యురాళ్ళపట్ల అవమానకరంగా ప్రవర్తించడం ఉద్రిక్తతకు దారితీసింది.మాజీ మంత్రి కూడా అయిన సుమితా లక్ష్మారెడ్డి చీరపట్టి లాగడం, గతంలో మినిస్టర్ చేసిన సబితా ఇంద్రారెడ్డి జుట్టు పట్టుకుని లాగడం, ఆమె మెడపై చెయ్యి వేసి బలవంతంగా నెట్టిపారేయడం వారిని కంట తడిపెట్టించింది. గతంలో ఏ శాసనసభలో ఎక్కడ జరగనటువంటి దుశ్శాసన పర్వం ఇక్కడ జరిగిందని వారు కన్నీటి పర్యంతమైనారు. ఇది కావాలని చేసిన దాడిలాగే ఉందని వారు మీడియాముందు ఆవేదన వ్యక్తం చేయడం పలువురిని కలచివేసింది. ‘ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోలీసులను అడ్డుపెట్టుకుని పాలన చేయాలని చూస్తున్నాడు. తమను బాదించడం సిఎంకు సంతోషంగా ఉన్నట్లుంది. మహిళలను కోటీశ్వరులను చేస్తా అని గొప్పలు చెప్పుకునే ముఖ్యమంత్రి మహిళలకు ఇచ్చే గౌరవం ఇదేనా అని వారు ప్రశ్నిస్తున్నారు. ఇది కేవలం సునితా లక్ష్మారెడ్డికో, సబితా ఇంద్రారెడ్డికో జరిగిన అవమానం కాదని, యావత్ మహిళా లోకానికి జరిగిన అవమానంగా భావించాల్సిఉందన్నారు. అసెంబ్లీకి వచ్చే మహిళా శాసనసభ్యులకే రక్షణ లేకపోతే, సామాన్యుల పరిస్థితేమిటని వారు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ప్రభుత్వా ప్రశ్నించేవారిని గొంతు నొక్కడం ఈ ప్రభుత్వానికి అలవాటుగా మారిందని, గతంలో పాలిటెక్నిక్ విద్యార్థులపట్ల పోలీసులు ప్రవర్తించిన తీరును వారు ఈ సందర్భంగా గుర్తు చేశారు. వాస్తవంగా తాము చేసిన తప్పేంటో సిఎం, పోలీసులు చెప్పాలన్నారు. కేవలం ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలుపుకోలేదన్న వ్యాఖ్యల్లో అభ్యంతరం ఏముందో చెప్పాలన్నారు. ప్రజల పక్షాన ఆ మాత్రం విపక్ష నాయకులు మాట్లాడకూడదా అని ప్రశ్నిస్తున్న మహిళానేతలు వెంటనే తమకు ముఖ్యమంత్రి క్షమాణ చెప్పాలని డిమాండ్ చేశారు. కాగా, బిఆర్ఎస్ సభ్యులు అసెంబ్లీకి రావద్దనే రేవంత్రెడ్డి కుట్రలో భాగమే ఈ గందరగోళమని శాసనసభలో బిఆర్ఎస్ పక్ష ఉపనాయకుడు హరీష్ రావు ఆరోపించారు. ఇది నిజంగా అసెంబ్లీ చరిత్రలో బ్లాక్ డేగా అభివర్ణించారు. ఈ విషయంపై హైకోర్టుకూడా స్పందించింది. శాసనసభ్యులను అడ్డుకునే అధికారం ఎవరికీ లేదని, సభ నిబంధన లను ఉల్లంఘిస్తే చర్య తీసుకునే అధికారం స్పీకర్కున్నదని హైకోర్టు పేర్కొనడం గమనార్హం. ఈ సంఘటనలో బిఆర్ఎస్ ప్రధాన నాయకులకు గాయాలయ్యాయి. కెటిఆర్ చెయ్యికి, తలకు దెబ్బలు తాకాయి. సునితా లక్ష్మారెడ్డి చేతులు గీసు కుపోయాయి. పలువురు ఎంఎల్యేలకు గాయాలవ డంతో ప్రాథమిక చికిత్స చేయించుకున్నారు. హరీష్రరావు, జగదీష్రెడ్డి పలువురు నాయకులు కిందపడ్డారు. ఎంఎల్యే కోవ లక్ష్మీ లేకపోతే తమను కిందపడేసి తొక్కేసేవారని సబితా ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మారెడ్డి ఆవేదన చెందారు. పోలీసులు అనుమతి నిరాకరిస్తున్న నల్ల టీ షర్టులను విడిచి బనియన్లతో లోపలి వెళ్ళడానికి బిఆర్ఎస్ శాసనసభ్యులు చేసిన ప్రయత్నాలను కూడా పోలీసులు నిరాకరించడంతోపాటు బిఆర్ఎస్ నాయకులను అదుపులోకి తీసుకుని వారిని తెలంగాణ భవన్ కు తరలించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *