దేశాన్ని ముందుకు నడిపిస్తున్నది మహిళలే

– భారత చరిత్రలో మహిళలది కీలక పాత్ర
– లోక్‌సభ స్పీకర్‌ ఓం ‌బిర్లా కీలక వ్యాఖ్యలు

న్యూదిల్లీ, సెప్టెంబర్‌ 7 : ‌దేశ చరిత్ర, వారసత్వంలో మహిళలు ఎల్లప్పుడూ మార్పునకు మార్గదర్శకులుగా నిలుస్తూ దేశాన్ని ముందుకు నడిపిస్తున్నారని లోక్‌సభ స్పీకర్‌ ఓం ‌బిర్లా అన్నారు. వారి నాయకత్వ పటిమను మరింత బలోపేతం చేసేందుకు సరైన అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. నేడు ఫరీదాబాద్‌లో జాతీయ మహిళా కమిషన్‌ (ఎన్‌సీడబ్ల్యూ) ఆధ్వర్యంలో మహిళా శాసనసభ్యుల కోసం నిర్వహించిన రెండు రోజుల వర్క్‌షాప్‌లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఓం బిర్లా మాట్లాడుతూ.. ‘‘భారతదేశ చరిత్రలో మహిళలు ఎప్పుడూ మార్పునకు మార్గదర్శకులుగా ఉన్నారు. స్వాతంత్య్ర పోరాటం నుంచి దేశ నిర్మాణం వరకు, రాజ్యాంగ రూపకల్పన నుంచి దేశాన్ని ప్రగతి పథంలో నడిపించడం వరకు వారి పాత్ర ఎంతో విశిష్టమైనది’’ అని కొనియాడారు. దేశం సంస్థాగత నిర్మాణం, ఆధ్యాత్మిక, మత, సాంస్కృతిక సంప్రదాయాలలో మహిళల సహకారం, గౌరవం, నాయకత్వం ఎన్నటికీ మరువలేనివని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుత కాలంలో మహిళలు కేవలం మార్పునకు సంకేతంగా నిలవడమే కాకుండా, వివిధ రంగాలలో అపూర్వమైన విజయాలు సాధిస్తూ, తమ నాయకత్వ ప్రతిభను ప్రదర్శిస్తున్నారని ఓం బిర్లా అన్నారు. వారిలో ఉన్న సహజసిద్ధమైన నాయకత్వ లక్షణాలను గుర్తించి, వాటికి మరింత పదును పెట్టేందుకు తగిన అవకాశాలు కల్పించడం మనందరి బాధ్యత అని ఆయన గుర్తుచేశారు. ‘‘మహిళలకు సాధికారత కల్పించడం, వారి కోసం ఇలాంటి సామర్థ్య పెంపుదల వర్క్‌షాప్‌లు నిర్వహించడం రెండూ అత్యంత ముఖ్యమైన అంశాలు’’ అని ఆయన నొక్కిచెప్పారు. ఈ సందర్భంగా, మహిళా శాసనసభ్యుల కోసం ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు జాతీయ మహిళా కమిషన్‌ ‌ఛైర్‌పర్సన్‌ ‌విజయ రాహత్కర్‌ను ఓం బిర్లా ప్రత్యేకంగా అభినందించారు. ఇలాంటి కార్యక్రమాలు మహిళా నాయకులలో కొత్త స్ఫూర్తిని నింపుతాయని, ప్రజాసేవలో వారిని మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ వర్క్‌షాప్‌ ‌ద్వారా మహిళా ప్రజాప్రతినిధులు కొత్త విషయాలు నేర్చుకుని, తమ తమ నియోజకవర్గాల్లో ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందిస్తారని ఆయన అభిప్రాయపడ్డారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *