దిల్లీ, అక్టోబర్ 22 : జపాన్‌లోని ఐచి-నగోయాలో జరుగుతున్న ఆసియా పారా క్రీడలు-2026లో భారత స్టార్ ఆర్చర్ శీతల్ దేవి అద్భుత ప్రదర్శనతో దూసుకుపోతోంది. గురువారం జరిగిన కాంపౌండ్ మిక్స్‌డ్ టీమ్ ఆర్చరీ విభాగంలో శీతల్ దేవి, తోమన్ కుమార్ జోడీ భారతదేశానికి స్వర్ణ పతకాన్ని అందించింది. ఫైనల్‌కు ముందు జరిగిన క్వాలిఫికేషన్/ర్యాంకింగ్ రౌండ్‌లో శీతల్-తోమన్ జోడీ ఏకంగా 1,402 పాయింట్లు సాధించి సరికొత్త ప్రపంచ రికార్డును సృష్టించింది. ఫైనల్ పోరు ఉత్కంఠగా సాగగా భారత జోడీ ఇండోనేషియాకు చెందిన ప్రత్యర్థులపై 151-148 పాయింట్ల తేడాతో ఘన విజయం సాధించి పసిడిని కైవసం చేసుకుంది.
ఒకే రోజు శీతల్ దేవికి రెండు స్వర్ణాలు
మిక్స్‌డ్ టీమ్ విభాగంలో స్వర్ణం గెలిచిన కొద్ది గంటల్లోనే శీతల్ దేవి మహిళల వ్యక్తిగత కాంపౌండ్ ఫైనల్లోనూ అదరగొట్టింది. సింగపూర్‌కు చెందిన నూర్ అలిమ్‌ను 142-139 తేడాతో ఓడించి ఒకే రోజు రెండో స్వర్ణ పతకాన్ని తన ఖాతాలో వేసుకుంది. దీంతో ఈ టోర్నీలో ఆమె మొత్తం రెండు స్వర్ణాలు, ఒక రజతంతో (మహిళల డబుల్స్‌లో పాయల్ నాగ్‌తో కలిసి) కలిపి మూడు పతకాలు సాధించింది.
భారత పతకాల పట్టిక
మహిళల ఎఫ54 డిస్కస్ త్రో విభాగంలో సువర్ణ రాజ్ 15.66 మీటర్ల దూరం విసిరి భారతదేశానికి మరో స్వర్ణ పతకం అందించింది. మహిళల డబ్ల్యూ1 ఆర్చరీ విభాగంలో స్వాతి చౌదరి రజత పతకాన్ని గెలుచుకుంది. తాజా విజయాలతో భారత్ మొత్తం 73 పతకాలతో (17 స్వర్ణాలు, 23 రజతాలు, 33 కాంస్యాలు) పతకాల పట్టికలో ఐదో స్థానంలో కొనసాగుతోంది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు




