25 నుంచి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆస్ట్రేలియా పర్యటన

– క్రిటికల్ మినరల్స్ రంగంలో ద్వైపాక్షిక సహకారం బలోపేతానికి..
– సిడ్నీలో ఐఎంఏఆర్‌సీ-2026 ప్రపంచ సదస్సులో కీలక ప్రసంగం
– ఆస్ట్రేలియా వనరుల శాఖ మంత్రి మడలైన్ కింగ్‌తో ప్రత్యేక భేటీ
న్యూదిల్లీ, అక్టోబర్ 22 : భారత్-ఆస్ట్రేలియా, ఇతర దేశాల మధ్య గనులు, క్రిటికల్ మినరల్స్, ఆధునిక సాంకేతికత, ప్రాసెసింగ్ రంగాల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేసేందుకు కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి ఈనెల 25 నుంచి 30వ తేదీ వరకు ఆస్ట్రేలియాలో పర్యటించనున్నారు. భారత్‌లో పెరుగుతున్న ఇండస్ట్రియల్, క్లీన్ ఎనర్జీ అవసరాలకు అనుగుణంగా క్రిటికల్ మినరల్స్ సరఫరాను బలోపేతం చేయడం, వివిధ దేశాలనుంచి ఉన్న వనరుల ద్వారా వాటిని సమకూర్చుకునే అవకాశాలను పెంచుకోవడమే కిషన్ రెడ్డి పర్యటన ప్రధాన ఉద్దేశం. దేశంలోని మైనింగ్ ప్రాజెక్టులలో పెట్టుబడులు, అధునాతన సాంకేతిక పరిజ్ఞానం, సంయుక్త పరిశోధనలు, నైపుణ్యాభివృద్ధి, ఎక్స్‌ప్లొరేషన్ తదితర అంశాలపైనా తన పర్యటనలో దృష్టి సారించనున్నారు. విస్తారమైన ఖనిజ వనరులు, అధునాతన మైనింగ్ టెక్నాలజీ కలిగిన దేశాలతో ముఖ్యంగా ఆస్ట్రేలియాతో సహకారం మినరల్ ఎక్స్‌ప్లొరేషన్, మైనింగ్, వ్యాల్యూ యాడెడ్ ప్రోడక్ట్స్ తయారీ వరకు భారత్‌కు కీలకం కానుంది.
సిడ్నీలో పర్యటన వివరాలు
‘
25న కేంద్ర మంత్రి సిడ్నీ చేరుకుంటారు. 26న నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్ఎండీసీ) సిడ్నీ కార్యాలయాన్ని ప్రారంభించి సంస్థ కార్యకలాపాలను సమీక్షిస్తారు. అదే రోజు ఇంటర్నేషనల్ మైనింగ్ అండ్ రిసోర్సెస్ కాన్ఫరెన్స్ అండ్ ఎక్స్‌పో(ఐఎంఏఆర్‌సీ)- 2026లో పాల్గొంటారు. 27న ఆస్ట్రేలియా వనరులు, ఉత్తర ఆస్ట్రేలియా వ్యవహారాల శాఖ మంత్రి మడలైన్ కింగ్‌తో సమావేశమవుతారు. ఐఎంఏఆర్‌సీ సదస్సులో ఎన్ఎండీసీ ఏర్పాటు చేస్తున్న ‘ఇండియా పెవిలియన్’ను కిషన్ రెడ్డి ప్రారంభిస్తారు. ప్రధాన ఆస్ట్రేలియా మైనింగ్ కంపెనీలు, బీఆర్‌ఏబీయూఎస్ సంస్థ, భారత పరిశ్రమల సమాఖ్య మైనింగ్ ప్రతినిధి బృందంతోనూ సమావేశమవుతారు. 28న మినరల్స్ కౌన్సిల్ ఆఫ్ ఆస్ట్రేలియాతో క్రిటికల్ మినరల్స్, రేర్ ఎర్త్ ఖనిజాలపై జరగనున్న ప్రత్యేక రౌండ్ టేబుల్ సమావేశంలో కిషన్ రెడ్డి పాల్గొంటారు. ఆస్ట్రేలియా వనరుల శాఖ సహాయ మంత్రి ఆంథనీ చిషోల్మ్ కూడా హాజరుకానున్నారు.
మెల్‌బోర్న్‌లో పరిశోధన, పెట్టుబడి అవకాశాలపై చర్చలు
28న కేంద్ర మంత్రి మెల్‌బోర్న్‌కు వెళ్లనున్నారు. అక్కడ మన దేశానికి చెందిన పబ్లిక్ సెక్టార్ యూనిట్ నేషనల్ బిల్డింగ్స్ కన్‌స్ట్రక్షన్ కార్పొరేషన్ లిమిటెడ్(ఎన్‌బీసీసీ) ఆస్ట్రేలియా శాఖ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. అనంతరం కిషన్ రెడ్డి సమక్షంలో ఎన్‌బీసీసీ-గోల్డ్ ఫీల్డ్స్ ఆస్ట్రేలియా మధ్య అవగాహన ఒప్పందాల మార్పిడి జరగనుంది. తర్వాత ప్రవాస భారతీయులతో సమావేశమవుతారు. 29న మోనాష్ విశ్వవిద్యాలయంలో క్రిటికల్ మినరల్స్, మైనింగ్‌లో నూతన సాంకేతికత, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత, ఖనిజ వనరుల అభివృద్ధి, సంయుక్త పరిశోధనలు, నైపుణ్యాభివృద్ధిపై జరిగే సదస్సులో పాల్గొంటారు. విక్టోరియా ప్రభుత్వ సంస్థలు, పరిశ్రమల ప్రతినిధులతో భారత్‌లో పెట్టుబడులు, మైనింగ్ ప్రాజెక్టుల అభివృద్ధికి ఉన్న అవకాశాలపై చర్చిస్తారు. ఆస్ట్రేలియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మైనింగ్ అండ్ మెటలర్జీ సీనియర్ శాస్త్రవేత్తలతో సాంకేతిక నైపుణ్యం, వృత్తిపరమైన శిక్షణ, మైనింగ్ రంగానికి అవసరమైన నిపుణుల తయారీ, పర్యావరణహిత మైనింగ్ విధానాలపై ప్రధానంగా చర్చించనున్నారు. అనంతరం 30న కేంద్ర మంత్రి భారత్‌కు తిరుగు ప్రయాణం కానున్నారు.
ఈ పర్యటన ద్వారా భారత్‌కు ప్రయోజనాలు
క్రిటికల్ మినరల్స్, స్ట్రాటజిక్ మినరల్స్ మైనింగ్, ప్రాసెసింగ్, కోల్ గ్యాసిఫికేషన్‌లో సహకారం కోసం భారత్, ఆస్ట్రేలియా మధ్య 2020 జూన్‌లో కుదిరిన అవగాహన ఒప్పందం ఆధారంగా ఈ ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు కిషన్ రెడ్డి పర్యటన దోహదపడనుంది. ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్ (కేఏబీఐఎల్) ద్వారా లిథియం, కోబాల్ట్, నికెల్, రేర్ ఎర్త్, గ్రాఫైట్ వంటి మినరల్స్ ప్రాజెక్టుల్లో పెట్టుబడి అవకాశాలను గుర్తించడం ప్రాధాన్యతాంశాల్లో ఒకటి. భారతీయ సంస్థలను ఆస్ట్రేలియాలోని ఖనిజ ప్రాజెక్టుల అభివృద్ధిదారులతో అనుసంధానం చేయడం, కొత్త ప్రాజెక్టుల్లో భాగస్వామ్య అవకాశాలను పరిశీలించడం ద్వారా దీర్ఘకాలిక ఖనిజ సరఫరాకు మార్గాలను విస్తరించేందుకు ఈ పర్యటన కీలకం కానుంది.
—————————————————————————————————————————————————————

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *