– మరో మూడు రోజుల కస్టడీ కోరిన దిల్లీ పోలీసులు
– తిరస్కరించిన ప్రత్యేక ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్
– హైకోర్టులో పిటిషన్ల ఉపసంహరణ
– సీజేపీ కేసుల దర్యాప్తు క్రైమ్ బ్రాంచ్‌కు బదిలీ
– దిల్లీలో మరో పదిమందికిపైగా విద్యార్థుల నిర్బంధం
– పోలీసుల బలప్రయోగంపై స్వతంత్ర విచారణకు ఐరాస మానవ హక్కుల నిపుణుల పిలుపు
ప్రజాతంత్ర ప్రత్యేక వార్త | దిల్లీ | అక్టోబర్ 21 : ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా, వోటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్)పై నిరసనల నేపథ్యంలో బుధవారం రెండు కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నాయకులు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాలను విడుదల చేయాలని దిల్లీ ప్రత్యేక ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ఆదేశించారు. మరోవైపు, భారతదేశంలో ఇటీవలి నిరసనల సందర్భంగా పోలీసుల బలప్రయోగం, సామూహిక నిర్బంధాలపై ఐక్యరాజ్యసమితి స్వతంత్ర మానవ హక్కుల నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈనెల 13న దిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద జరిగిన నిరసనకు సంబంధించి సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గతంలో సమర్పించిన శాంతిభద్రతల పూచీకత్తు నిబంధనలను ఉల్లంఘించారని, నిరసనలకు అధికారికంగా కేటాయించని ప్రాంతంలోకి ప్రవేశించారని పోలీసులు ఆరోపించారు. 14న ఇద్దరినీ ఐదు రోజుల జ్యుడిషియల్ కస్టడీకి పంపారు. 19న కస్టడీని మరో రెండు రోజులు పొడిగించారు. ఆ గడువు బుధవారంతో ముగియడంతో మరో మూడు రోజుల కస్టడీ కోరుతూ దిల్లీ పోలీసులు ప్రత్యేక ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్‌ను ఆశ్రయించారు. అయితే పోలీసుల అభ్యర్థనను మేజిస్ట్రేట్ తిరస్కరించి ఇద్దరి పూచీకత్తులను ఆమోదిస్తూ విడుదలకు ఆదేశించారు.
నిరసనలపై ఐరాస నిపుణుల తీవ్ర ఆందోళన
భారత దేశంలో ఇటీవలి నిరసనల సందర్భంగా పోలీసుల చర్యలపై ఐక్యరాజ్య సమితికి చెందిన 20 మందికిపైగా స్వతంత్ర మానవ హక్కుల నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈనెల 20న విడుదల చేసిన ప్రకటనలో నిరసనకారులపై అధిక బలప్రయోగం జరిగిందన్న ఆరోపణలపై స్వతంత్ర విచారణ జరపాలని కోరారు. ఆయుధాలు లేని విద్యార్థులపై లాఠీచార్జీలు, నిరసనల్లో పాల్గొనకుండా అడ్డుకోవడం, సామూహిక సమావేశాలపై విస్తృత నిషేధాలు, డిజిటల్ నిఘా, ఇంటర్నెట్ సేవల అంతరాయాలపై నిపుణులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. కొంతమంది నిరసనకారులు గాయపడినట్లు, నిర్బంధంలో దుర్వ్యవహారానికి గురైనట్లు తమకు నివేదికలు అందాయని తెలిపారు. మహిళలపై లైంగిక, లింగ ఆధారిత వేధింపులు జరిగాయన్న ఆరోపణలపైనా ఆందోళన వ్యక్తం చేశారు.
మానవ హక్కులను రాజకీయ ఒత్తిడికి ఉపయోగించవద్దు: భారత్
ఐరాస వేదికపై భారత ప్రతినిధి బర్ఖా తామ్రకర్ మానవ హక్కుల అంశాలను దేశాలపై రాజకీయ ఒత్తిడి తెచ్చేందుకు ఉపయోగించరాదని పేర్కొన్నారు. అక్టోబర్ 20న ఐరాస సర్వసభ్య సమావేశం మూడో కమిటీలో బలవంతపు అదృశ్యాల అంశంపై జరిగిన చర్చలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.భారతదేశంలో మానవ హక్కుల పరిరక్షణకు రాజ్యాంగపరమైన, సంస్థాగతమైన వ్యవస్థలు ఉన్నాయని వివరించారు. ధ్రువీకరించని ఆరోపణలను తుది నిర్ధారణలుగా చూపడం సరికాదన్నారు.
హైకోర్టులో పిటిషన్ల ఉపసంహరణ
సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాల విడుదలకు ముందు బుధవారం దిల్లీ హైకోర్టులో మరో ముఖ్యమైన పరిణామం చోటుచేసుకుంది. ఈనెల 19న ప్రత్యేక ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ విధించిన రెండు రోజుల అదనపు కస్టడీని సవాలు చేస్తూ ఇద్దరూ హైకోర్టును ఆశ్రయించారు. జస్టిస్ సుబ్రమోణియం ప్రసాద్ విచారణ సందర్భంగా, శాంతిభద్రతల పూచీకత్తు ఇచ్చిన తర్వాత నిషేధిత నిరసన ప్రాంతంలోకి ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు. మేజిస్ట్రేట్ ఉత్తర్వును సవాలు చేసేందుకు ప్రత్యామ్నాయ న్యాయపరమైన మార్గాలు ఉన్నాయని గుర్తుచేశారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది అభిక్ చిమ్నీ మాత్రం పూచీకత్తులను తిరస్కరించడం, కస్టడీ పొడిగించడం వ్యక్తిగత స్వేచ్ఛకు విరుద్ధమని వాదించారు. ప్రత్యేక ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ఎదుట బుధవారమే విచారణ జరగనున్నందున ముందుగా ఆ నిర్ణయం కోసం వేచి ఉండాలని హైకోర్టు సూచించింది. అనంతరం ఇద్దరూ తమ పిటిషన్లను ఉపసంహరించుకున్నారు.
దసరా వేడుకల్లో బొద్దింక దిష్టిబొమ్మ.. రాజకీయ వివాదం
దిల్లీలోని పీతంపురాలో అక్టోబర్ 20న జరిగిన దసరా వేడుకల్లో 30 అడుగుల ఎత్తున్న బొద్దింక దిష్టిబొమ్మను దహనం చేయడం కొత్త రాజకీయ వివాదానికి దారితీసింది. శ్రీ కేశవ రామ్‌లీలా కమిటీ నిర్వహించిన కార్యక్రమంలో రావణుడు, కుంభకర్ణుడు, మేఘనాథుడి దిష్టిబొమ్మలతోపాటు బొద్దింక దిష్టిబొమ్మను కూడా దహనం చేశారు. కమిటీ అధ్యక్షుడు, బీజేపీ ఎమ్మెల్యే అశోక్ గోయల్ దేవరాహా ఈ కార్యక్రమానికి రాజకీయ ఉద్దేశం లేదని, అపరిశుభ్రతపై అవగాహన కల్పించడమే లక్ష్యమని పేర్కొన్నారు. అయితే ఆమ్ ఆద్మీ పార్టీ దిల్లీ అధ్యక్షుడు సౌరభ్ భరద్వాజ్ దీనిపై అభ్యంతరం వ్యక్తం చేశారు. మతపరమైన సంప్రదాయాలను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించారని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే ఈ పరిణామంపై వ్యంగ్యంగా స్పందిస్తూ తమ ఉద్యమానికి ఉచిత ప్రచారం కల్పించారని వ్యాఖ్యానించారు.
దీప్కే తదుపరి కార్యాచరణ
అభిజీత్ దీప్కే తన సహచరుల పాత్రపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి వివరణ ఇచ్చారు. సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాలు తనకంటే మెరుగైన నాయకులని ప్రశంసించడం ద్వారా వారిపై బాధ్యత నెట్టివేయాలన్న ఉద్దేశం లేదని పేర్కొన్నారు. దీపావళి నేపథ్యంలో కార్యకర్తలు కుటుంబాలతో సమయం గడపాలని, నిరసన కార్యక్రమాలకు తాత్కాలిక విరామం ఇవ్వాలని సూచించినట్లు తెలుస్తుంది
1న భారీ ఉద్యమం: కాంగ్రెస్
ఇండి కూటమి ఆధ్వర్యంలో నవంబర్ 1న దిల్లీలో ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా భారీ నిరసన నిర్వహిస్తామని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ బుధవారం ప్రకటించారు. ఇదే సమయంలో రాహుల్ గాంధీ విదేశీ పర్యటనకు వెళ్లినట్లు వొచ్చిన వార్తలపై బీజేపీ విమర్శలు చేసింది. ఉద్యమం జరుగుతున్న సమయంలో విదేశాలకు వెళ్లడం ఏమిటని ప్రశ్నించింది. కాంగ్రెస్ నాయకులు ఈ విమర్శలను తిరస్కరించారు. రాహుల్ గాంధీ రెండు మూడు రోజులు ఇతర కార్యక్రమాలకు వెళ్లడాన్ని రాజకీయ వివాదంగా మార్చడం సరికాదని వేణుగోపాల్ పేర్కొన్నారు. రాహుల్ పర్యటనపై ప్రశ్నించగా కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ఇతరుల ప్రయాణ వివరాలను తాను చెప్పలేనని వ్యాఖ్యానించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు




