– గ్లోబల్ సమ్మిట్ సన్నాహకాలపై సీఎస్ సమీక్ష
హైదరాబాద్, ప్రజాతంత్ర,సెప్టెంబర్ 7: రానున్న ఇన్వెస్ట్ తెలంగాణ – రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2026 నిర్వహణకు సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు సచివాలయంలో ఉన్నతాధికారులతో సోమవారం సమావేశం నిర్వహించి సన్నాహకాలను సమీక్షించారు. గ్లోబల్ సమ్మిట్‌కు దేశ, విదేశాల నుంచి ప్రముఖులు, అంతర్జాతీయ పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు, వివిధ రంగాల ప్రతినిధులు, సీఈఓలు, సీఏక్స్ఓలు, దౌత్యవేత్తలు తదితరులను పెద్ద సంఖ్యలో ఆహ్వానించేలా చర్యలు చేపట్టాలని సీఎస్ అధికారులను ఆదేశించారు. సమ్మిట్‌కు హాజరుకావాల్సిందిగా ప్రముఖులకు ఈ-మెయిల్స్ ద్వారా అధికారిక ఆహ్వానాలు పంపే ప్రక్రియను తక్షణమే ప్రారంభించాలని సూచించారు. సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేస్తూ ఆహ్వానితుల జాబితాను సిద్ధం చేసి, ఆహ్వానాల పంపిణీ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. ‘ఇన్వెస్ట్ తెలంగాణ’ పేరుతో నిర్వహించనున్న ఈ గ్లోబల్ సమ్మిట్ ద్వారా పెట్టుబడి అవకాశాలను ప్రపంచానికి విస్తృతంగా పరిచయం చేయడంతో పాటు రాష్ట్రాన్ని ప్రపంచ స్థాయి పెట్టుబడుల గమ్యస్థానంగా మరింతగా ప్రతిష్టించేందుకు కృషి చేయాలని సీఎస్ పేర్కొన్నారు. తెలంగాణలోని ఫ్యూచర్ సిటీ, ఐటీ, ఏఐ, ఫార్మాస్యూటికల్స్, డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్, ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్లు, క్లీన్ ఎనర్జీ, అధునాతన తయారీ రంగాలు, మౌలిక వసతులు, ఆవిష్కరణలు తదితర రంగాల్లో ఉన్న అవకాశాలను సమ్మిట్ ద్వారా ప్రపంచ పెట్టుబడిదారులకు సమర్థవంతంగా ప్రదర్శించేలా కార్యాచరణ రూపొందించాలని సూచించారు. గ్లోబల్ సమ్మిట్‌ను ప్రతిష్టాత్మకంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు పరస్పర సమన్వయంతో సమయపాలనతో కూడిన కార్యాచరణను అమలు చేయాలని సీఎస్ స్పష్టం చేశారు. సమావేశంలో సీనియర్ అధికారులు కృష్ణ ఆదిత్య, అజిత్ రెడ్డి, అనుదీప్ దురిశెట్టి, నిఖిల్ చక్రవర్తి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు




