– ఆటో నగర్ కాలనీ ఏర్పాటుకు ప్రభుత్వ ఆమోదం
– మొదటి దశలో రెండు వేల కుటుంబాలకు సొంతింటి కల సాకారం
– రెవెన్యూ, హౌసింగ్ శాఖల మంత్రి పొంగులేటి
– మొదటి దశలో రెండు వేల కుటుంబాలకు సొంతింటి కల సాకారం
– రెవెన్యూ, హౌసింగ్ శాఖల మంత్రి పొంగులేటి
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 13 : నగరంలో ప్రజా రవాణా వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న ఆటో రిక్షా కార్మికుల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సమాజంలోని పేద, బలహీనవర్గాలకు సొంతింటి భరోసా కల్పించడంతోపాటు, గుడిసెలు లేని తెలంగాణ నిర్మాణమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోందని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు.హైదరాబాద్ నగరంలో నివసిస్తున్న ఆటోరిక్షా కార్మికుల సొంతింటి కలను సాకారం చేసేందుకు హౌసింగ్ బోర్డు ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఆటో నగర్ కాలనీ పేరుతో సరసమైన గృహ నిర్మాణ పథకానికి ప్రభుత్వం ఆమోదం తెలిపిందని మంత్రి వెల్లడించారు. నిరంతరం ప్రజలకు రవాణా సేవలు అందిస్తూ నగర జీవనంలో కీలక భాగస్వాములుగా ఉన్న ఆటో కార్మికుల కుటుంబాలకు శాశ్వత నివాస భద్రత కల్పించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు.హైదరాబాద్ క్యూర్ పరిధిలోని బండ్లగూడ, గంధంగూడ, పేట్‌బషీరాబాద్, జల్పల్లి/లక్ష్మిగూడ ప్రాంతాల్లో ఈ గృహ నిర్మాణ ప్రాజెక్టును చేపట్టనున్నట్లు తెలిపారు. ఒక్కో ప్రాంతంలో 500 ఫ్లాట్ల చొప్పున మొత్తం 2,000 ఆధునిక ఫ్లాట్లను నిర్మించనున్నట్లు పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టుకు సుమారు రూ.220 కోట్ల వ్యయం అవుతుందని అంచనా అని వెల్లడించారు. ఇళ్ల కేటాయింపు, ఆర్థిక సహాయం, అర్హత ప్రమాణాలు తదితర అంశాలకు సంబంధించి ఇప్పటికే అమల్లో ఉన్న ఇందిరమ్మ ఇళ్లు–టవర్స్ పథక నిబంధనలే వర్తిస్తాయని మంత్రి స్పష్టం చేశారు. ప్రాజెక్టు అమలుకు సంబంధించి ఆయా ప్రాంతాల్లో స్థలాల లభ్యత, సాంకేతిక అంశాలు, భౌగోళిక అనుకూలతలను క్షుణ్ణంగా పరిశీలించి సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) రూపొందించడంతోపాటు ఆర్థిక ప్రతిపాదనలు సిద్ధం చేసి సమర్పించాలని హౌసింగ్ బోర్డు అధికారులను ఆదేశించినట్లు మంత్రి వివరించారు. అవసరమైన ప్రక్రియలను వేగవంతం చేసి అర్హులైన ఆటో కార్మిక కుటుంబాలకు వీలైనంత త్వరగా గృహ వసతి కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. ప్రజా ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలోని అర్హులైన ప్రతి పేద కుటుంబానికి సొంతింటి కల సాకారం చేయడమే లక్ష్యంగా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. పేదల సంక్షేమమే ప్రాధాన్యంగా వివిధ వర్గాల అవసరాలను గుర్తించి ప్రత్యేక గృహ నిర్మాణ కార్యక్రమాలు చేపడుతోందని తెలిపారు. ఇందులో భాగంగానే ఆటోరిక్షా కార్మికుల కోసం ఆటో నగర్ కాలనీ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో అర్హులైన ప్రతి పేద కుటుంబానికి సొంతింటి భరోసా కల్పించే వరకు ప్రజా ప్రభుత్వం తన ప్రయత్నాలను కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. పేదలు ఆత్మగౌరవంతో, గౌరవప్రదమైన వాతావరణంలో జీవించాలన్నదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ లక్ష్యమని, గుడిసెలు లేని, ప్రతి పేదవాడికి సొంతిల్లు ఉన్న తెలంగాణ నిర్మాణానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు.
—————————————————————————————————————————————————————
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





