సూర్యాపేట, ప్రజాతంత్ర, ఆగస్టు 20: కృష్ణా జలాలతో హుజూర్నగర్ నియోజ కవర్గాన్ని సస్యశ్యామలం చేస్తామని నీటి పారుదల, ఆహార పౌరసరఫరాల శాఖ మంత్రి నల్లమాద ఉత్తమ్కుమార్రెడ్డి తెలిపారు. చింతలపాలెం మండలం పాత వెల్లటూరు వద్ద రూ.1,648 కోట్లతో చేపట్టిన మహాత్మా గాంధీ ముక్త్యాల బ్రాంచ్ కెనాల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులను గురువారం ఆయన పరిశీలించారు. ముందుగా అండర్గ్రౌండ్ పంప్ హౌస్ పనులను పరిశీలించిన మంత్రి పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం నిర్వహించిన సమీక్షలో ప్రాజెక్టు వివరాలను వెల్లడించారు.
53 వేల ఎకరాలకు నీరు
కృష్ణా నదిపై నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టులో 16 మెగావాట్ల సామర్థ్యం కలిగిన నాలుగు మోటార్ల ద్వారా నీటిని పంపింగ్ చేయనున్నట్లు మంత్రి తెలిపారు. మట్టంపల్లి మండలంలోని 9 గ్రామాల్లో 20,466 ఎకరాలు, మేళ్లచెరువు మండలంలోని 5 గ్రామాల్లో 15,829 ఎకరాలు, చింతలపాలెం మండలంలోని 9 గ్రామాల్లో 16,705 ఎకరాలు.. మొత్తం 53 వేల ఎకరాలకు సాగునీరు అందు తుందని చెప్పారు.
19,295 కుటుంబాలకు ప్రయోజనం
ప్రాజెక్టు ద్వారా 5,080 ఎస్టీ, 3,540 ఎస్సీ, 8,470 బీసీ, 2,205 ఓసీ కుటుంబాలు.. మొత్తం 19,295 కుటుంబాలు లబ్ధి పొందుతాయని మంత్రి తెలిపారు. ప్రాజెక్టు కోసం 191 ఎకరాల రైతుల భూములను కొనుగోలు చేసి, వారికి రూ.60 కోట్ల నష్టపరిహారం చెల్లించినట్లు పేర్కొన్నారు.
నాగార్జునసాగర్ లో నీటి లభ్యత తక్కువగా ఉన్న సమయంలో పులిచింతల ప్రాజెక్టు బ్యాక్వాటర్ను వినియోగించుకుని ఈ ప్రాంతంలోని గ్రామాలను సస్యశ్యామలం చేస్తామని ఉత్తమ్ తెలిపారు. డిసెంబరు నాటికి ప్రాజెక్టు రూఫ్ టాప్ లెవెల్, పంప్ హౌస్ పనులు పూర్తి చేయనున్నట్లు చెప్పారు. వీలైనంత త్వరగా మిగి లిన పనులను పూర్తి చేసి సాగునీరు అందించాలని గుత్తేదారులను ఆదేశించారు. అనంతరం మఠంపల్లి, పాలకీడు మండలాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తేజస్ సందాల్ పవార్, జిల్లా ఎస్పీ కె.నరసింహ, ఇరిగేషన్ సీఈ నాగభూషణం, ఆర్డీవో శ్రీనివాసులు, మున్సిపల్ చైర్మన్ దొంత గాని శ్రీనివాస్ గౌడ్, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





