– డిసెంబర్ లో ‘ఇన్వెస్ట్ తెలంగాణ’ గ్లోబల్ సమ్మిట్
– రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అగ్రపథాన నిలుపుతున్న ప్రభుత్వ విధానాలు
– భారీ పెట్టుబడులే లక్ష్యంగా ఫ్యూచర్ సిటీ లో ముమ్మర ఏర్పాట్లు
– ద్వితీయ శ్రేణి నగరాలకూ విస్తరించాలనే డిమాండ్
(మండువ రవీందర్‌రావు)
తెలంగాణ రాష్ట్రం పెట్టుబడుల హబ్‌గా మారబోతున్నది. రాష్ట్రం కొత్తగా ఏర్పడినప్పటినుండీ దేశ, విదేశీయలు పెట్టుబడులకోసం ప్రభుత్వాలు తలుపులు బార్లా తెరిచాయి. ఇప్పటికే అనేక భారీ పరిశ్రమలు పెట్టుబడులు పెట్టేందుకు అంగీకరించాయి. ఒప్పందాలు చేసుకున్నాయి. మరికొన్ని ఇప్పటికే పనులు ప్రారంభించాయికూడా. దీనివల్ల రాష్ట్రం ఆర్థికంగా ప్రగతిని సాధించడం ఒకటికాగా, లక్షలాది మందికి ఆయా రంగాల్లో ఉపాధి లభించే అవకాశాలు ఏర్పడుతున్నాయి. రాష్ట్రం ఏర్పడిన దాదాపు ఈ పదమూడేళ్లకాలంలో గత ప్రభుత్వమైతేనేమీ, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వమైతేనేమీ పెట్టుబడిదారులను ఆకర్షించే దిశగానే అడుగులు వేస్తున్నాయి. అందుకు తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న విధాన నిర్ణయాలే ప్రధాన కారణం. టిఎస్ ఐపాస్ ద్వారా నిర్ధిష్ట గడవులోగా పరిశ్రమలకు అనుమతులివ్వడం ఒకటైతే అధికారులు లేదా వివిధ శాఖల మధ్య అనుమతులకోసం తిరుగాల్సిన అవకాశంలేకుండా సింగిల్ విండో విధానాన్ని ప్రవేశపెట్టడంద్వారా ప్రాసెస్‌ను సులభతరం చేంది. దానితోపోటు పరిశ్రమలకు కావల్సిన విద్యుత్, నీరు, మెరుగైన రహదారులు, వివిధ ప్రాంతాలకు కావల్సిన కనెక్ట్‌విటీని కల్పించడంకూడా మరో కారణం. ఫలితంగా ప్రతీ ఆర్థికసంవత్సరాన్ని బేరీజు వేసుకున్నప్పుడు ఏ సంవత్సరానికాసంవత్సరం రాష్ట్రం పారిశ్రామికంగా పురోగతిని సాధిస్తున్నట్లు సూచికలద్వారా వెల్లడవుతున్నది. జూలైలో విడుదలైన ‘ఇండియా ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రెండ్లీ ఇండెక్స్’ నివేదిక ప్రకారం పెట్టుబడులను ఆకర్షించడంలో తెలంగాణరాష్ట్రం వందకు 47.3శాతం స్కోర్‌ను సాధించుకోవడంద్వారా దేశంలో 13వ స్థానంలో నిలిచింది. అలాగే దేశంలోని 17 ప్రధాన రాష్ట్రాలతో పోల్చిచూసినప్పుడు 8వ స్థానంలో నిలిచింది. చిన్నరాష్ట్రాలకన్నా కాస్తా మెరుగ్గానే ఉన్నప్పటికీ, ఆగ్ర రాష్ట్రాల సరసన నిలదొక్కుకోవాలంటే రాష్ట్రం ఇంకా ఆర్థిక పరిపుష్టిని సాధించుకోవాల్సిఉంది. 33 నెలల క్రితం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఆ దిశగానే అడుగులు వేస్తున్నది. అధికారం చేపట్టిన కొద్దికాలంలోనే దావోస్ వేదికగా విదేశీ పెట్టుబడులకు ఆహ్వానం పలికింది. తమ పిలుపుకు మంచి ఫలితం రావడంతో వివిధ దేశాల్లో పర్యటించి బడా కంపెనీలు, పరిశ్రమలకు ఎర్రతివాచి పరిచింది. 2023లో అధికారం చేపట్టినప్పటితో పోలిస్తే రెండింతలకు మించి పెట్టుబడులను తెలంగాణ ప్రభుత్వం ఆకర్షించినట్లు లెక్కలు చెబుతున్నాయి. 2023లో 1.3 బిలియన్ డాలర్ల పెట్టుబడులురాగా, 2024లో అది మూడు బిలియన్ డాలర్లకు చేరినట్లు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. గత సంవత్సరం అంటే 2025లో ప్రభుత్వం ఏర్పాటుచేసిన రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2.43 లక్షలకోట్ల పెట్టుబడులకు సంబందించి సుమారు 34 అవగాహన ఒప్పందాలను కుదుర్చుకుంది. వీటిల్లో డీప్‌టెక్, గ్రీన్ ఎనర్జి, ఏరోస్సేస్ లాంటి రంగాల్లో భారీ పెట్టుబడుల ఒప్పందాలు జరిగినట్లు ప్రభుత్వం చెబుతున్నది. ఇప్పుడు డిసెంబర్‌లో మరోసారి భారీస్థాయిలో పెట్టుబడులను ఆహ్వానిస్తూ పెద్దఎత్తున సదస్సులను నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్దం చేస్తున్నది. భారత ఫ్యూచర్ సిటీలో ‘ఇన్వెస్ట్ తెలంగాణ’ పేర గ్లోబల్ సమ్మిట్‌ను డిసెంబర్ 7 నుంచి 9 వరకు మూడు రోజులపాటు నిర్వహించేందుకు ఇప్పటికే ఏర్పాట్లను ప్రారంభించింది. అక్టోబర్ మాసాంతంలోపు ఈ పనులన్నీ త్వరితగతిన పూర్తిచేసేందుకు యుద్దప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధానంగా ఫ్యూచర్ సిటీలో పెట్టుబడిదారులను అకర్షించేందుకు మౌలిక సదుపాయాల కల్పనాపనులను వేగవంతం చేస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నేతృత్వంలోని కమిటీ ఈ పనులను పర్యవేక్షిస్తున్నది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు దేశ విదేశాలనుంచివచ్చే ప్రతినిధులు, వారికి కావాల్సిన ఏర్పాట్లను చూస్తున్నారు. హైదరాబాద్‌లో నిర్వహించే గ్లోబల్ సమ్మిట్‌కు ముందు ఢిల్లీలో ముందస్తుగా ఒక సదస్సును నిర్వహించేందుకుకూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. మొత్తంమీద ఈ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు సుమారు 30 నుంచి 40 దేశాలనుండి ప్రతినిధులు వచ్చే అవకాశముందని ప్రభుత్వం అంచనా వేస్తున్నది. తెలంగాణ ప్రభుత్వం ఈ సమ్మిట్‌ను ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నది. రాష్ట్ర రాజధానిలో కొత్తగా రూపొందిస్తున్న ‘ఫ్యూచర్ సిటీ’ని ప్రపంచానికి పరిచయం చేయడమన్నది ప్రభుత్వం ప్రధాన లక్ష్యంకాగా, రాష్ట్రంలో ఇప్పటికే అభివృద్ధిలోఉన్న పరిశ్రమలను, స్టార్టప్‌లను ప్రపంచ దేశాలకు పరిచయంచేయడం రెండవ ఉద్దేశ్యం. దాంతోపాటుగా 30వేల ఎకరాల్లో రూపుదిద్దుతున్న ఫ్యూచర్ సిటీని దీర్ఘకాలికంగా రాష్ట్ర ఆర్థిక ప్రగతి వేదికగా తీర్చిదిద్దాలన్నది ప్రభుత్వ మరో లక్ష్యంగా కనిపిస్తున్నది. ఎప్పటికప్పుడు ఇలా భారీ స్థాయి పెట్టుబడులను ఆహ్వానిస్తూ 2047 నాటికి బలమైన ఆర్థిక పునాదులను వేయాలన్నది ప్రభుత్వ ప్రణాళిక. అయితే రాష్ట్రానికి భారీ పెట్టుబడులు వస్తున్నప్పటికీ ఈ పెట్టుబడులను కేవలం హైదరాబాద్‌కే పరిమితం చేయడం సరికాదన్న విమర్శలొస్తున్నాయి. రాష్ట్రం అంటే ఒక్క హైదరాబాద్ మాత్రమే కాదని, రెండు, మూడవ శ్రేణి నగరాలనుకూడా పారిశ్రామికంగా విస్తరించాలన్న డిమాండ్ ప్రజలనుంచి వినిపిస్తున్నది. దశాబ్దాలకాలంగా పారిశ్రామిక ప్రగతి కోసం ఎదురుచూస్తున్న ఈ నగరాలను గత పాలకులెవరూ పట్టించుకోకపోగా తెలంగాణ ఏర్పాటు అయిన తర్వాత కూడా అదే నిర్లక్ష్య దోరణితో ప్రభుత్వాలుండడంపై ఆయా నగర ప్రజలనుండి తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు




