డిపెండెంట్‌లకు ఆర్డర్లు అందజేయాలి

– సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారానికి కీలక నిర్ణయాలు
– సింగరేణి ప్రాంత ప్రజాప్రతినిధులతో డిప్యూటీ సీఎం భట్టి సమావేశం

హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 6 : సింగరేణి బొగ్గు గని కార్మికులు, వారి కుటుంబాలు ఎదుర్కొంటున్న సుదీర్ఘకాల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సింగరేణి ప్రాంత మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, గడ్డం వివేక్ వెంకట స్వామి, ఎమ్మెల్యేలు ప్రేమ్ సాగర్ రావు, డాక్టర్ మట్టా రాగమయి, కోరం కనకయ్య, మాలోతు రాందాస్ నాయక్, పాయం వెంకటేశ్వర్లు, కూనంనేని సాంబశివరావు, గండ్ర సత్యనారాయణ రావు, మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, గడ్డం వినోద్ వెంకటస్వామి, రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి చైర్మన్ జనక్ ప్రసాద్ సంస్థ ఉన్నతాధికారులతో ఉప ముఖ్యమంత్రి ప్రజాభవన్‌లో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. సింగరేణి వ్యాప్తంగా కార్మికుల సమస్యలను, ప్రాంతీయ అభివృద్ధికి సంబంధించిన పలు విజ్ఞప్తులను ప్రజాప్రతినిధులు ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకురాగా ఆయన వాటన్నింటినీ సానుకూలంగా విని తక్షణ చర్యలకు ఆదేశాలు జారీ చేశారు. పెండింగ్‌లో ఉన్న సుమారు 250 నుండి 300 వరకు ఉన్న డిపెండెంట్ ఆర్డర్లను, ఇతర లీగల్ ప్రాసెస్‌లను రాబోయే 15 రోజుల్లో పూర్తి చేసి అభ్యర్థులకు అందజేయాలని ఆదేశించారు. డిపెండెంట్ ఉద్యోగుల పేర్ల మార్పులకు సంబంధించి సుమారు 136 మంది(గరిష్ఠంగా 170 మంది) సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయని, అధికారులు మానవీయ కోణంలో ఆలోచించి ఇందుకు ఏర్పాటు చేసిన సింగరేణి ఆఫీసర్స్ కమిటీ సిఫారసుల ఆధారంగా తగిన నిర్ణయం తీసుకోవాలని సూచించారు. మెడికల్ ఇన్వాలిడేషన్ కోసం కార్మికులు కొత్తగూడెం వరకు రావాల్సిన అవసరం లేకుండా సింగరేణి పరిధిలోని అన్ని ఏరియా హాస్పిటల్స్‌లో ప్రతి నెలా ఒక నిర్ణీత బోర్డు మీటింగ్ నిర్వహించాలన్నారు. అక్కడే వీలైనంతమందికి పరీక్షలు నిర్వహించి మెడికల్ ఇన్వాలిడేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. కరోనా సమయంలో లేదా ఇతర స్థానిక కారణాల వల్ల విధులకు హాజరుకాక ఉద్యోగాల నుండి తొలగింపునకు గురైన కార్మికుల విషయంలో వన్ టైం ఆప్షన్ కింద తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఆదేశించారు. విధులు నిర్వర్తించకుండా సమ్మెకు పిలుపునిచ్చిన లేదా సమ్మెలో పాల్గొన్న అధికారులపై, దానికి నాయకత్వం వహించిన వారిపై ‘నాన్ మెయింటెనెన్స్ ఆఫ్ డ్యూటీస’ కింద ఒక చిన్న హెచ్చరిక జారీ చేయాలని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సింగరేణికి కేటాయించిన భూముల్లో 5774 ఎకరాలు తిరిగి రెవెన్యూ శాఖకు సింగరేణి సంస్థ అప్పగించగా అందులో 4,500 ఎకరాల్లో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేదలకు పట్టాలు పంపిణీ చేశారని, మిగతా 1250 ఎకరాల్లో జీవో 76 ప్రకారం అర్హులకు ఇళ్ల స్థలాల పట్టాలు ఇచ్చే కార్యక్రమాన్ని వేగవంతం చేయాలన్నారు. సింగరేణి అధికారులు, జిల్లా కలెక్టర్‌తో కూడిన కమిటీ ఆక్రమణలో ఉన్న నివాసితుల ప్రాథమిక జాబితాను సిద్ధం చేసి స్థానిక శాసనసభ్యులతో సంప్రదింపులు జరిపి వారి అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకొని అర్హులైన లబ్ధిదారుల సమగ్ర జాబితాను తయారు చేసి ఈ ప్రక్రియ మొత్తాన్ని నెల రోజుల లోపు పూర్తి చేయాలని ఆదేశించారు. సింగరేణి భూముల్లో  మైనింగ్ చేయని ప్రదేశాలను గుర్తించి ఉద్యోగులు, కార్మికుల ఇండ్ల నిర్మాణం కోసం లేఅవుట్ చేసి నెహ్రూ హౌజింగ్ కాలనీ తీసుకురావడానికి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని కూడా భట్టి ఆదేశించారు. సింగరేణి సంస్థ ఏరియా హాస్పిటల్స్‌ను కార్పొరేట్ హాస్పిటల్స్‌గా తీర్చిదిద్దాలన్నారు. అవసరమైతే వైద్యులకు వేతనాలు, పరిహారం పెంచి నిపుణులైన డాక్టర్లను నియమించాలని, అత్యవసర వైద్యం కోసం కార్డియాక్, క్యాథ్‌లాబ్ సేవలను అందుబాటులోకి తేవాలని సూచించారు. బొగ్గు గనులు, ఓవర్ బర్డెన్ డంప్‌ల దుమ్ము వల్ల ప్రాంతీయ ప్రజలలో క్యాన్సర్ ముప్పు పెరుగుతోందని పలు అధ్యయనాలు తెలుపుతున్నందున సింగరేణి పరిధిలోని పాత జిల్లాల్లో ప్రతి గ్రామంలో ఉచితంగా క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. సింగరేణి పరిధిలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, హాస్టళ్లు, ప్రభుత్వ హాస్పిటల్స్, ప్రభుత్వ భవనాలపై సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేసి సోలరైజ్ చేయాలని సూచించారు. ఖరీదైన వ్యాపార, పట్టణ భూములను కమర్షియల్ వినియోగానికి, ఊరి బయట ఉన్న ఉపయోగపడని భూములు, ఓవర్ బర్డెన్ గుట్టలను సోలార్ ప్లాంట్లకు ఉపయోగించాలని స్పష్టం చేశారు. సింగరేణి పరిధిలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఆర్వో వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలన్నారు. భూపాలపల్లి నియోజకవర్గంలో అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్ (వ్యవసాయ పరిశోధనా కేంద్రం) ఏర్పాటుకు సింగరేణి సంస్థ నుంచి స్థలం కేటాయించాలని, ఆ స్థలానికి బదులుగా రెవెన్యూ భూములలో ఉపయోగపడని గుట్టల భూమికి సంబంధించి నివేదికను సమర్పించాలని సూచించారు. సింగరేణి కార్మికులకు ఆరు నెలలకొకసారి ఖచ్చితంగా సెఫ్టీ కిట్స్ పంపిణీ చేయాలన్నారు. రామగుండంలో సింగరేణి ఆధŠ్వర్యంలో థర్మల్ కేంద్రం ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
సింగరేణి సంస్థలోని ఉద్యోగులకు చెల్లిస్తున్నట్టుగానే కార్మికులందరికీ సంస్థ నుంచే ప్రభుత్వానికి ఆదాయ పన్ను చెల్లించాలని ఆదేశించారు. సత్తుపల్లి భూపాలపల్లి ఎమ్మెల్యేలు చేసిన విజ్ఞప్తి మేరకు వారి నియోజకవర్గాల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనాల నిర్మాణానికి సీఎసఆర్ నిధులు కేటాయించాలన్నారు. శిథిలమైన డి టైప్ క్వార్టర్స్‌ను తొలగించి వాటి స్థానంలో కార్మికుల జీవన ప్రమాణాలు పెంచే విధంగా అన్ని వసతులతో నూతన క్వార్టర్స్ నిర్మించి నెహ్రూ పేరిట సింగరేణి కాలనీలు ఏర్పాటు చేయాలన్నారు. సింగరేణివ్యాప్తంగా అన్ని కాలనీలను ఆధునికీకరించాలని, అత్యాధునిక డ్రైనేజి వ్యవస్థ, విద్యదీకరణ, మెరుగైన పారిశుధ్య నిర్వహణ, మంచినీటి సదుపాయం కల్పించాలని, సింగరేణివ్యాప్తంగా మురుగు శుద్ది కేంద్రాల నిర్వహణ చేపట్టాలని డిప్యూటీ సీఎం భట్టి సూచించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *