శిక్షల పెంపుతోనే పేపర్ లీకేజీలకు చెక్ పడుతుందా?

భారతదేశంలో ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు, ఉన్నత విద్యాసంస్థల ప్రవేశ పరీక్షలలో చోటుచేసుకుంటున్న ప్రశ్నపత్రాల లీకేజీలు, వ్యవస్థీకృత అక్రమాలను అరికట్టే ప్రాథమిక లక్ష్యంతో ‘పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (అక్రమాల నివారణ) సవరణ బిల్లు-2026’ను పార్లమెంట్ ఉభయసభలలోనూ ఆమోదం పొందింది. ఈ సవరణ బిల్లు పార్లమెంటరీ ఆమోదం పొందిన వెంటనే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అర్థరాత్రి దాటాక సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ, దేశ యువత భవిష్యత్తుతో చెలగాటమాడే పేపర్ లీక్ మాఫియా, ముఠాలను ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలిపెట్టే ప్రసక్తి లేదని ఉద్ఘాటించారు. నమ్మదగిన విద్యా వ్యవస్థను నిర్మించేందుకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్, ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటుతో పాటు రాష్ట్రాల భాగస్వామ్యంతో సమగ్ర సంస్కరణలు చేపడుతున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఈ చట్టసవరణ అమలుపై విద్యావేత్తలు, సైబర్ నిపుణులు, విద్యార్థి సంఘాల నుంచి భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ నూతన సవరణ చట్టం కేవలం ‘పేపర్ లీక్ జరిగిన తర్వాత’ తీసుకోవాల్సిన శిక్షాత్మక చర్యలకే ప్రాధాన్యమిస్తున్నదని, అసలు ‘పేపర్ లీక్ కాకుండా’ వ్యవస్థను సురక్షితం చేసే ముందస్తు నివారణ చర్యలపై స్పష్టతనివ్వడంలో విఫలమైందనే తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

2024 జూన్‌లో అమల్లోకి వచ్చిన మూల చట్టం ఉన్నప్పటికీ 2026లో నీట్-యూజీ పరీక్షలో మళ్లీ లీకేజీ జరగడం, దానికనుగుణంగా తీవ్ర నిరసనల అనంతరం ఈ సవరణల బిల్లును ప్రవేశపెట్టడం ఈ చర్చకు మరింత ప్రాధాన్యాన్ని చేకూర్చింది. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ), స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్సెస్సీ), రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డులు (ఆర్ఆర్ బీ), ఐబీపీఎస్, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్ టీఏ) నిర్వహించే ‘నీట్’ సహా పబ్లిక్ పరీక్షలలో అక్రమాలను నిరోధించేందుకు 2024లో తొలిసారిగా ప్రత్యేక చట్టాన్ని తెచ్చారు. అయితే  2026 సవరణ బిల్లు ద్వారా శిక్షల తీవ్రతను పెంచడంతో పాటు దర్యాప్తు, విచారణా కాలపరిమితులను గణనీయంగా తగ్గించారు. 2024 నాటి మూల చట్టం నిబంధనల ప్రకారం వ్యక్తిగత నేరస్తులకు 3 నుంచి 5 సంవత్సరాల జైలు శిక్షతోపాటు గరిష్టంగా రూ. 10 లక్షల జరిమానా విధిస్తారు. 2026 నాటి సవరణ బిల్లు నిబంధనల ప్రకారం 5 నుంచి 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష, గరిష్టంగా రూ. 50 లక్షల జరిమానా విధిస్తారు. సేవా నిర్వహక సంస్థలు, వెండర్లు నేరం చేస్తే 2024 మూల చట్టం ప్రకారం గరిష్టంగా రూ. 1 కోటి జరిమానా, 4 ఏండ్లపాటు పరీక్షల నిర్వహణ బాధ్యతల నుంచి నిషేధం విధిస్తారు.

2026 నాటి సవరణ బిల్లు నిబంధనల ప్రకారం గరిష్టంగా రూ. 5 కోట్ల వరకు జరిమానా, పరీక్ష నిర్వహణ వ్యయం రికవరీతోపాటు 8 ఏండ్ల పాటు నిషేధం విధిస్తారు. సంస్థల మేనేజ్‌మెంట్ / డైరెక్టర్లు నేరం చేస్తే 2024 మూల చట్టం ప్రకారం 3 నుంచి 10 ఏండ్ల జైలు శిక్ష, రూ. 1 కోటి జరిమానా విధిస్తారు. 2026 నాటి సవరణ బిల్లు నిబంధనల ప్రకారం 5 నుంచి 10 ఏండ్ల జైలు శిక్ష, రూ. 5 కోట్ల వరకు జరిమానా విధిస్తారు. వ్యవస్థీకృత నేర ముఠాలు, సిండికేట్లు నేరం చేస్తే2024 మూల చట్టం ప్రకారం 5 నుంచి 10 ఏండ్ల జైలు శిక్ష, కనీసం రూ. 1 కోటి జరిమానా విధిస్తారు. 2026 నాటి సవరణ బిల్లు నిబంధనల ప్రకారం 7 నుంచి 10 ఏండ్ల జైలు శిక్ష, కనీసం రూ. 10 కోట్ల జరిమానాతోపాటు నిందితుల ఆస్తులను జప్తుచేయాలని నిబంధన పెట్టారు. 2024 మూల చట్టం సాధారణ చట్టాల ప్రకారం సాధారణంగా 90 రోజులలో దర్యాప్తు చేయాలని కాలపరిమితి ఉన్నది. 2026 నాటి సవరణ బిల్లు నిబంధనల ప్రకారం గరిష్టంగా 2 నెలలు (60 రోజులు) లోపు చార్జిషీట్ దాఖలు చేయాలని నిబంధన పెట్టారు.

2024 మూల చట్టం ప్రకారం డీఎస్‌పీ/ఏసీపీ స్థాయి అధికారి విచారణ చేయాలి. అవసరమైతే కేసును కేంద్ర ఏజెన్సీలకు బదిలీ చేసే అవకాశం ఉన్నది. 2026 నాటి సవరణ బిల్లు నిబంధనల ప్రకారం ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటుకు కేంద్రానికి స్పష్టమైన అధికారం ఉన్నది. 2024 మూల చట్టం ప్రకారం సాధారణ సెషన్స్ కోర్టుల ద్వారా విచారణ చేయాలి. 2026 నాటి సవరణ బిల్లు నిబంధనల ప్రకారం ప్రతి రాష్ట్రంలో ‘స్పెషల్ ఫాస్ట్ ట్రాక్ కోర్టులు’, చార్జిషీట్ వేసిన 3 నెలల్లో విచారణ పూర్తిచేయాలి. 2024 మూల చట్టం ప్రకారం సాధారణ అప్పీలు విధానాన్ని అమలు చేశారు. 2026 నాటి సవరణ బిల్లు నిబంధనల ప్రకారం హైకోర్టు ద్విసభ్య బెంచ్ ముందు మాత్రమే 30 నుంచి గరిష్టంగా 90 రోజుల్లోపు పిటిషన్ వేయాలి. ఈ చట్టసవరణ ద్వారా నేరాలకు పాల్పడేవారిని వారెంట్ లేకుండా అరెస్టు చేసే అధికారం కలిగింది.

 లీకేజీ నివారణ సంస్కరణలపై ప్రధాన విమర్శలు

సవరణ బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందిన తర్వాత కోక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ప్రతినిధి అశుతోష్ రాంకా లేవనెత్తిన అంశాలు విద్యా రంగంలో తీవ్ర చర్చకు దారితీశాయి. చట్టసవరణల ధోరణి కేవలం నేరం జరిగిన తర్వాత స్పందించేలా ఉందే తప్ప, అసలు నేరం జరగకుండా అడ్డుకునే ముందస్తు రక్షణ వ్యవస్థల రూపకల్పనను విస్మరించిందనేది ఆయన ప్రధాన విమర్శ. లీకేజీల నివారణ దిశగా ప్రభుత్వం లోతుగా చర్చించాల్సిన అనేక ప్రాథమిక అంశాలు ఈ చట్టంలో మరుగున పడిపోయాయని పలు అంశాలు స్పష్టం చేస్తున్నాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని కేవలం బయటి ప్రైవేట్ కాంట్రాక్టర్లపై ఆధారపడే ఏజెన్సీగా కాకుండా, సొంత శాశ్వత నిపుణులు, డేటా సెక్యూరిటీ విభాగాలు కలిగిన స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థగా మార్చడంపై చట్టంలో ఎటువంటి స్పష్టమైన రూపురేఖలు లేవు.
లక్షలాది మందికి ఉద్యోగ నియామకాలు చేపట్టే స్టాఫ్ సెలక్షన్ కమిషన్‌కు రాజ్యాంగబద్ధ, స్పష్టమైన పార్లమెంటరీ చట్టబద్ధ హోదా కల్పించే ప్రక్రియ అసంపూర్తిగానే ఉన్నది. అక్రమాలకు పాల్పడే థర్డ్-పార్టీ ప్రైవేట్ వెండర్లను శాశ్వతంగా సిస్టమ్ నుంచి నిరోధించేందుకు, వారు వేరే పేర్లతో మళ్లీ టెండర్లు పొందకుండా చూసేందుకు పారదర్శకమైన సాంకేతిక పర్యవేక్షణ కొరవడింది.పరీక్షల క్యాలెండర్‌లో పారదర్శకత, సిలబస్‌లో కచ్చితత్వం, ప్రైవేట్ సెంటర్ల స్థానంలోనే కేవలం సురక్షితమైన ప్రభుత్వ విద్యా సంస్థలలోనే కేంద్రాలను ఏర్పాటు చేసే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సంస్కరణలపై శ్రద్ధ చూపలేదు. పోటీ పరీక్షల రంగాన్ని వ్యాపారీకరిస్తూ, విద్యార్థులపై విపరీతమైన మానసిక ఒత్తిడి పెంచుతూ, లీకేజీ మాఫియాకు నెట్‌వర్క్‌గా మారిన కోచింగ్ సెంటర్లపై జాతీయ స్థాయిలో నియంత్రణా యంత్రాంగాన్ని తెచ్చే అంశం ప్రస్తావనకు నోచుకోలేదు.

శిక్షలు పెంచినా ఆగని లీక్ లు

కేవలం శిక్షలను పెంచినంత మాత్రాన పేపర్ లీక్‌లు ఆగవనడానికి 2024, 2026 లలో చోటుచేసుకున్న నీట్-యూజీ లీకేజీల స్వభావమే ప్రత్యక్ష నిదర్శనం. ఈ రెండు ఘటనలలో చోటుచేసుకున్న వ్యత్యాసాలు పరీక్షా నిర్వహణ యంత్రాంగంలోని విభిన్న లోపాలను బట్టబయలు చేశాయి. 2024 ఘటనలో ప్రశ్నపత్రం ముద్రణ పూర్తయిన తర్వాత, ముద్రణ శాలల నుంచి పరీక్షా కేంద్రాలకు సీల్ చేసిన ట్రంకు పెట్టెలను తరలించే క్రమంలో లీకేజీ జరిగింది. సీల్డ్ ట్రంకులను అక్రమంగా తెరచి, భౌతికంగా ఉన్న పేపర్లను కాపీ చేసి బయటకు చేరవేశారని దర్యాప్తు సంస్థలు ధృవీకరించాయి. ఇది లాజిస్టికల్, ట్రాన్సిట్ భద్రతా వైఫల్యం. 2026లో జరిగిన లీకేజీ సరఫరా గొలుసు పరిధిలోకి పేపర్ రావడానికి ముందే జరిగింది. ప్రింటింగ్, రవాణా భద్రతలో ఎలాంటి లోపం లేనప్పటికీ, ఎన్‌టీఏ, ప్రైవేట్ వ్యవస్థల లోపల ఉన్న ముఠాలు, ఉపాధ్యాయులే ప్రశ్నాపత్రాన్ని ముందే బయటకు చేరవేశారని అధికారులు గుర్తించారు.
2024 నుంచే కఠిన శిక్షలు, జరిమానాలు ఉన్న చట్టం అమల్లో ఉన్నప్పటికీ 2026లో అంతర్గత లోపాల వల్ల పేపర్ లీక్ అయింది. దీని ఆధారంగా సీబీఎస్ఈ మాజీ చైర్‌పర్సన్ అశోక్ గంగూలీ విశ్లేషిస్తూ, సమస్య బయటి వ్యక్తుల కంటే వ్యవస్థ బాధ్యతలు మోస్తున్న లోపలి వ్యక్తుల వల్లే అధికమవుతున్నదని స్పష్టం చేశారు. విద్యా వ్యవస్థ విశ్వసనీయతను కాపాడటానికి కేవలం కఠిన చట్టాలు సరిపోవని, పరీక్షల నిర్వహణను సాధారణ అడ్మినిస్ట్రేటివ్ అధికారులకు కాకుండా ప్రత్యేక శిక్షణ పొందిన ప్రొఫెషనల్ నిపుణులకు అప్పగించాలని ఆయన సూచించారు. అంతేకాకుండా లక్షలాది మంది రాసే అత్యంత ప్రాధాన్యం ఉన్న ప్రవేశ పరీక్షలను ఒకే విడతలో కాకుండా ‘రెండు దశల పరీక్షల విధానం’లో నిర్వహించడం ద్వారా ఒక్కసారిగా జరిగే లీకేజీ ముప్పును నివారించవచ్చని పేర్కొన్నారు.

రాధాకృష్ణన్ కమిటీ సిఫార్సుల అమలులో అలసత్వం

2024 నీట్ వివాదం అనంతరం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్ టీఏ) పనితీరును ప్రక్షాళన చేయడానికి కేంద్ర ప్రభుత్వం  ఇస్రో మాజీ చైర్మన్ డాక్టర్ కే. రాధాకృష్ణన్ నాయకత్వంలో ఏడుగురు సభ్యులతో ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ విద్యావేత్తలు, సైబర్ నిపుణులు, విద్యార్థుల నుంచి దాదాపు 37,000 సలహాలను స్వీకరించి సమగ్ర సంస్కరణల నివేదికను అందించింది. రాధాకృష్ణన్ కమిటీ మొత్తం 101 సంస్కరణలను ప్రతిపాదించగా, అందులో 57 సిఫార్సులను మాత్రమే ప్రభుత్వం పూర్తి స్థాయిలో అమలు చేసింది. మరో 10 భాగస్వామ్యంగా అమలవ్వగా, అత్యంత కీలకమైన 27 నివారణ సిఫార్సులు ఇప్పటికీ పెండింగ్‌లోనే ఉన్నాయి. పేపర్ లీక్‌లు కాకుండా అడ్డుకోవడానికి కమిటీ ప్రతిపాదించిన ప్రధాన సాంకేతిక నివారణ మార్గాలు అమలు చేయలేదు.
ఆ నిబంధనల ప్రకారం భౌతిక ముద్రణ, రవాణా సమయంలో జరిగే లీకేజీలను అరికట్టడానికి ఎన్‌క్రిప్ట్ చేసిన ప్రశ్నపత్రాలను డిజిటల్ మాధ్యమం ద్వారా నేరుగా పరీక్షా కేంద్రాల సురక్షిత సర్వర్లకు పంపడంతోపాటు పరీక్ష ప్రారంభానికి నిమిషాల ముందు మాత్రమే వాటిని స్థానికంగా ప్రింట్ చేసి అభ్యర్థులకు అందజేయాలి. ‛డిజి యాత్ర’ నమూనాలో అభ్యర్థి దరఖాస్తు నుంచి పరీక్ష హాల్ ప్రవేశం, అడ్మిషన్ వరకు ఆధార్, బయోమెట్రిక్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత ఐడెంటిటీ వెరిఫికేషన్ అమలు చేయాలి. 20 లక్షలకు పైగా అభ్యర్థులు హాజరయ్యే పరీక్షలను సింగిల్-షిఫ్ట్ ఓఎంఆర్ పద్ధతిలో కాకుండా, కంప్యూటర్ ఆధారిత బహుళ దశల్లో, విభజించబడిన సెషన్లలో నిర్వహించాలి. విడివిడిగా బహుళ నిపుణుల బృందాల ద్వారా పెద్ద ఎత్తున ప్రశ్నల బ్యాంకును సిద్ధం చేసి, పరీక్షకు కొద్ది గంటల ముందు మాత్రమే కంప్యూటర్ అల్గారిథమ్ ద్వారా పేపర్‌ను రాండమ్‌గా అసెంబుల్ చేయాలి. దీనివల్ల పేపర్ సెట్ చేసే నిపుణులకు కూడా ఏ ప్రశ్నలు తుది పేపర్‌లో వస్తాయో తెలిసే అవకాశం ఉండదు. ఎన్‌టీఏను కేవలం విద్యా సంస్థల ప్రవేశ పరీక్షలకు మాత్రమే పరిమితం చేసి, ప్రభుత్వ ఉద్యోగ నియామక పరీక్షల బాధ్యతల నుంచి తప్పించాలి. శాసన సవరణల ద్వారా శిక్షలను పెంచిన కేంద్రం, రాధాకృష్ణన్ కమిటీ ప్రతిపాదించిన ఈ ముందస్తు సాంకేతిక రక్షణ మార్గదర్శకాలను ప్రాధాన్యత ప్రకారం పూర్తి స్థాయిలో అమలు చేయకపోవడం వల్లే 2026 నీట్ లీకేజీకి అవకాశం ఏర్పడిందనేది నిపుణుల అభిప్రాయం.

కోర్టులలో డిజిటల్ ఫోరెన్సిక్ మౌలిక వసతులేవీ? 

నూతన సవరణ చట్టం ప్రకారం పేపర్ లీక్ కేసుల దర్యాప్తును పోలీసులు కేవలం 60 రోజుల్లో (రెండు నెలలు) పూర్తి చేసి చార్జిషీట్ దాఖలు చేయాలి. ప్రతి రాష్ట్రం ప్రతిపాదిత ఫాస్ట్ ట్రాక్ కోర్టులలో రోజువారీ ప్రాతిపదికన విచారణ జరిపి చార్జిషీట్ వేసిన 3 నెలల్లో తీర్పు ఇవ్వాలి. చట్టంలో పేర్కొన్న ఈ కాలపరిమితి వినేందుకు సమర్థవంతంగా ఉన్నప్పటికీ, క్షేత్రస్థాయి న్యాయ, రక్షణ వ్యవస్థల సామర్థ్యంపై తీవ్ర సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సాధారణ కేసులలో 90 రోజుల సమయం ఉంటే, అత్యంత క్లిష్టమైన సైబర్ అపరాధాలు, అంతర్రాష్ట్ర మాఫియా నెట్‌వర్కులు, డిజిటల్ సాక్ష్యాలతో ముడిపడి ఉన్న కేసులను 60 రోజుల్లో సమగ్రంగా పూర్తి చేయడం రక్షణ రంగానికి సవాలుగా మారుతుంది.
గడువు ఒత్తిడి వల్ల దర్యాప్తులో నాణ్యత లోపిస్తే, నిందితులు కోర్టులలో చట్టపరమైన సందుల ఆధారంగా తప్పుచుకునే ప్రమాదం ఉన్నది. లోక్‌సభలో ఎంపీలు రాజ్‌కుమార్ చాహర్, జనార్దన్ మిశ్రాలు అడిగిన ప్రశ్నలకు న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ వెల్లడించిన అధికారిక గణాంకాలు దేశంలోని ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ప్రస్తుత పరిస్థితిని స్పష్టంగా చూపుతున్నాయి. న్యాయ శాఖ డేటా ప్రకారం ఏప్రిల్ 30, 2026 నాటికి 29 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో మొత్తం ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టులు 775 ఉన్నాయి. వీటిలో 398 ప్రత్యేక పోక్సో కోర్టులు ఉన్నాయి. డిసెంబర్ 31, 2025 నాటికి 2,45,579 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. 2025లో 1,43,936 క్రొత్త కేసులు నమోదయ్యాయి. ఇందులో కేవలం 66,500 కేసులు మాత్రమే పరిష్కారమయ్యాయి. ఈ డేటా ప్రకారం ఇప్పటికే ఉన్న ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏటా నమోదవుతున్న కొత్త కేసులలో సగానికి పైగా పరిష్కరించలేక తీవ్రమైన కేసుల భారాన్ని ఎదుర్కొంటున్నాయి. కొత్తగా జడ్జీల పోస్టులను పెంచకుండా, కోర్టులలో డిజిటల్ ఫోరెన్సిక్ మౌలిక వసతులు కల్పించకుండా కేవలం కొత్త చట్టం కింద సమయ పరిమితులు విధిస్తే, అవి 3 నెలల్లో తీర్పులు ఇవ్వడం ఆచరణాత్మకంగా అసాధ్యమని స్పష్టమవుతున్నది.

లోపాలు లేని కఠినమైన సాంకేతిక వ్యవస్థ రావాలి

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (సవరణ) బిల్లు-2026 నేరస్తులలో తీవ్రమైన భయాన్ని కలిగించడానికి, వ్యవస్థీకృత ముఠాలకు కఠిన హెచ్చరిక పంపడానికి స్వాగతించదగిన చట్టపరమైన అడుగు. అయితే శిక్షల తీవ్రతను పెంచడం అనేది నేరం జరిగిన తర్వాత విచారించే పర్యవసాన చర్య మాత్రమే. విద్యా వ్యవస్థ పట్ల విద్యార్థులు, తల్లిదండ్రులలో పోయిన విశ్వసనీయతను పునరుద్ధరించాలంటే కేవలం ‘పోస్ట్-లీక్’ చర్యలు సరిపోవు. ‘ప్రీ-లీక్’ నివారణ చర్యలే ప్రాథమిక ప్రాధాన్యత కావాలి. పరిపూర్ణమైన, లీక్-ప్రూఫ్ విద్యా వ్యవస్థను నిర్మించడానికి సమగ్ర విధానాలను ప్రభుత్వం తక్షణమే అమలు చేయాల్సి ఉన్నది. రాధాకృష్ణన్ కమిటీ సూచించిన సీపీపీటీ మోడల్ ఆధారంగా డిజిటల్ ఎన్‌క్రిప్టెడ్ పద్ధతిలోనే ప్రశ్నపత్రాల రవాణా జరగాలి. ప్రింటింగ్ ప్రెస్, లాజిస్టిక్స్ స్థాయిలలో భౌతిక పత్రాల వినియోగాన్ని దశలవారీగా ఉపసంహరించుకోవాలి.
థర్డ్-పార్టీ ప్రైవేట్ కాంట్రాక్టర్ల జోక్యాన్ని పూర్తిగా నివారించి, ఎన్‌టీఏలో డేటా సెక్యూరిటీ, క్వాలిటీ కంట్రోల్ విభాగాలను శాశ్వత నిపుణులతో బలోపేతం చేయాలి. ప్రైవేట్ ఇంజినీరింగ్, డిగ్రీ కళాశాలల్లో పరీక్షా కేంద్రాలను నిలిపివేసి, నిరంతరం సీసీటీవీ పర్యవేక్షణ ఉండే కేంద్రీయ విద్యాలయాలు, ఐఐటీలు, ఎన్ఐటీలు, ప్రభుత్వ పాఠశాలలకే కేంద్రాలను పరిమితం చేయాలి. ఫాస్ట్ ట్రాక్ కోర్టుల సంఖ్యను పెంచడంతో పాటు ప్రత్యేక సైబర్ ఫోరెన్సిక్ ల్యాబ్‌లు, ప్రాసిక్యూటర్లను నియమించి 60 రోజుల దర్యాప్తునకు అవసరమైన మౌలిక వసతులను రక్షణ రంగానికి అందించాలి. పోటీ పరీక్షల నిర్వహణలో అనుచిత మార్గాలను ప్రేరేపించే ప్రైవేట్ కోచింగ్ నెట్‌వర్క్‌లను పర్యవేక్షించేందుకు చట్టబద్ధమైన రెగ్యులేటరీ అథారిటీని నెలకొల్పాలి. కేవలం కఠిన చట్టాల రూపకల్పనతో మాత్రమే లీకేజీలు ఆగిపోవు. కఠిన చట్టంతో పాటు లోపరహిత సాంకేతిక వ్యవస్థ, పారదర్శకమైన అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెస్, నిరంతర నిఘా తోడైనప్పుడు మాత్రమే ‘పేపర్ లీక్ కాకుండా’ విద్యా వ్యవస్థను కాపాడుకోవడం సాధ్యపడుతుంది.

✍️ మేకల ఎల్లయ్య – ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *