“మేకెదాటు ప్రాజెక్టు ఇటీవలి కాలంలో కావేరి నదిపై ‘మేకెదాటు’ వద్ద సమతుల్య జలాశయాన్ని నిర్మించాలని కర్ణాటక భావిస్తోంది. బెంగళూరు తాగునీటి అవసరాలు, విద్యుత్ ఉత్పత్తికి ఇది అవసరమని చెబుతోంది. అయితే, ఈ ప్రాజెక్టు పూర్తయితే తమకు వచ్చే నీటి ప్రవాహం పూర్తిగా తగ్గిపోతుందని తమిళనాడు తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ అంశం వివాదాన్ని మరింత రాజేసింది.”
దేశం లోని రాష్ట్రాల మధ్య జల జగడాలు కొనసాగుతూనే ఉన్నాయి. పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఏపీ, తెలంగాణ ఇలా సమస్యతో ముందుకు పోతున్నాయి.. ఇప్పుడు మళ్ళీ తమిళనాడు, కర్నాటక కావేరి వివాదంపై నాటకీయ పరిణామాలు వింటున్నాం, చూస్తున్నాం. దక్షిణ భారత గంగాగా పేరు ఉన్న కావేరి నది కేవలం ఒక నీటి పారుదల మాత్రమే కాదు… అది రెండు రాష్ట్రాల ఆత్మగౌరవం, జీవనాధారం, రాజకీయ అగ్నిపర్వతం. “కన్నడం కరుణిస్తుందా.. తమిళం తెగిస్తుందా?” అనే ప్రశ్న దశాబ్దాలుగా ప్రతీ వర్షాకాలంలోనూ, ముఖ్యంగా వర్షాలు తక్కువై కరువు సంవత్సరాల్లో ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. కర్ణాటకలో పుట్టి, తమిళనాడును సస్యశ్యామలం చేసే కావేరి నీటి పంపిణీ అంశం ఇరు రాష్ట్రాల మధ్య నిరంతరం వివాదంగానే ఉంది
కావేరి వివాదానికి పునాదులు బ్రిటిష్ కాలంలోనే పడ్డాయి. 1892, 1924లలో అప్పటి మైసూరూ (కర్నాటక), మద్రాసు(తమిళనాడు) ప్రెసిడెన్సీల మధ్య కుదిరిన ఒప్పందాల ప్రకారం నీటి వినియోగం సాగింది. అయితే, స్వాతంత్ర్యం వచ్చాక పరిస్థితి పూర్తిగా మారింది. ఎగువన ఉన్న కర్ణాటక (అప్పటి మైసూరు) తన పరిధిలో అనేక జలాశయాలను నిర్మించడం ప్రారంభించగా, దిగువన ఉన్న తమిళనాడు తన సాంప్రదాయ సాగు హక్కులను కాపాడుకోవడానికి సిద్ధమైంది.ఈ వివాదం దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు, కావేరి నీటి యాజమాన్య ప్రాధికార సంస్థ (CWMA) మెట్లు ఎక్కింది.
“మాకే తాగడానికి నీళ్లు లేనప్పుడు, తమిళనాడుకు ఎలా విడుదల చేయాలి?” అన్నది కర్ణాటక వాదన. కృష్ణరాజసాగర్ (KRS), కబిని, హేమావతి వంటి జలాశయాల్లో నీటిమట్టం పడిపోయినప్పుడు కర్ణాటక తీవ్ర సంక్షోభంలో కూరుకుపోతుంది. ముఖ్యంగా బెంగళూరు వంటి మహానగరానికి తాగునీరు అందించడం, డెల్టా రైతుల పంటలను కాపాడటం కర్ణాటకకు కత్తిమీద సాము. కోర్టులు, ట్రిబ్యునల్ నీటిని విడుదల చేయాలని ఆదేశించిన ప్రతిసారీ, స్థానిక రాజకీయాలు, రైతు సంఘాల ఆగ్రహం హోరెత్తుతాయి. వర్షాభావ పరిస్థితుల్లో నీటిని విడుదల చేస్తే తమ ప్రజలకు చేసే ద్రోహంగా కర్నాటక భావిస్తుంది. అందుకే ప్రకృతి ఇచ్చే వర్షపాతం మీదే ఆధారపడి ఉంది. కర్ణాటక
మరోవైపు తమిళనాడుకు కావేరి నదే ప్రాణాధారం. తంజావూరు, తిరుచిరాపల్లి వంటి కావేరి డెల్టా ప్రాంతాలు తమిళనాడుకు ధాన్యాగారాలు. ఇక్కడ ‘కురువై’, ‘సంబా’ పంటలు పండాలంటే సమయానికి కావేరి నీరు రావడం ఆవశ్యకం. ఎగువన ఉన్న కర్ణాటక నీటిని ఆపేస్తే, తమ డెల్టా భూములు ఎడారిగా మారతాయని తమిళనాడు ఆందోళన. చట్టబద్ధంగా తమకు రావలసిన నీటి వాటాను సాధించుకోవడానికి తమిళనాడు సుప్రీంకోర్టుకు వెళ్ళింది. తమ హక్కుల సాధన కోసం ఎంతటి న్యాయపోరాటానికైనా సిద్ధమని తమిళనాడు అంటోంది. మేకెదాటు ప్రాజెక్టు ఇటీవలి కాలంలో కావేరి నదిపై ‘మేకెదాటు’ వద్ద సమతుల్య జలాశయాన్ని నిర్మించాలని కర్ణాటక భావిస్తోంది. బెంగళూరు తాగునీటి అవసరాలు, విద్యుత్ ఉత్పత్తికి ఇది అవసరమని చెబుతోంది. అయితే, ఈ ప్రాజెక్టు పూర్తయితే తమకు వచ్చే నీటి ప్రవాహం పూర్తిగా తగ్గిపోతుందని తమిళనాడు తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ అంశం వివాదాన్ని మరింత రాజేసింది.
ఇరు రాష్ట్రాల సమస్యపై కేంద్ర ప్రభుత్వం 2018లో కావేరీ జల నిర్వహణ అథారిటీ (Cauvery Water Management Authority – CWMA) కావేరీ జల నియంత్రణ కమిటీ (CWRC) లను ఏర్పాటు చేసింది. సుప్రీంకోర్టు తుది తీర్పు ప్రకారం కర్ణాటక, తమిళనాడు, కేరళ మరియు పుదుచ్చేరి రాష్ట్రాల మధ్య నీటి కేటాయింపులను అమలు చేయడం ఈ అథారిటీ ప్రధాన బాధ్యత. వర్షాభావం లేదా కరువు పరిస్థితుల్లో నీటి పంపిణీ ఎలా ఉండాలనే దానిపై కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ పరిధిలోని CWMA ఆదేశాలు జారీ చేస్తుంది. అయితే కావేరి పరివాహక ప్రాంతాల్లో నీటి కొరత ఉన్నప్పటికీ, నిబంధనల ప్రకారం తమిళనాడుకు నిర్ణీత పరిమాణంలో నీటిని విడుదల చేయాలని కర్ణాటకను అథారిటీ ఆదేశిస్తోంది. కర్ణాటక ప్రతిపాదించిన మేకెదాటు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పై తమిళనాడు అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. వివాదంలో ఉన్న తమిళనాడు అంగీకారం, సంప్రదింపులు లేకుండా కేంద్రం తుది అనుమతులు మంజూరు చేయడం లేదు. నీటి కేటాయింపులపై ఏ రాష్ట్రమూ ఏకపక్షంగా నిర్ణయం తీసుకోలేదని, సుప్రీంకోర్టు తీర్పు, CWMA జారీ చేసే ఆదేశాలకు లోబడి నడుచుకోవాలని కేంద్రం స్పష్టం చేస్తోంది కానీ అమల్లో వ్యత్యాసాలు ఉంటున్నాయి. దీంతో రాష్ట్రాలు మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తూ వస్తున్నాయి.
కావేరి నీటి వివాదం కేవలం చట్టపరమైనది కాదు, అది భావోద్వేగాలతో కూడుకున్నది. వర్షాలు కురిసినప్పుడు వివాదం పెద్దగా కనిపించదు… కానీ కరువు వచ్చినప్పుడే అసలు సమస్య రిపీట్. ట్రిబ్యునల్ తీర్పులను, సుప్రీంకోర్టు ఆదేశాలను గౌరవిస్తూనే.. కరువు కాలంలో నీటి పంపకాల్లో స్పష్టమైన ప్రణాళిక ఉండాల్సిందే…. ఇప్పటి వరకు అలాంటిది లేకుండే…. ఇకనైనా ప్రాంతీయ విద్వేషాలను, రాజకీయాలను పక్కనబెట్టి, సమఖ్యవాదంతో ఇరు రాష్ట్రాలూ ముందుకు సాగినప్పుడే కావేరి ఇరు వైపులా సస్యశ్యామలం చేయగలుగుతుంది. లేకపోతే ఈ ‘కన్నడ-తమిళ’ కావేరి పోరు తరతరాలుగా కొనసాగుతూనే ఉంటుంది.
పట్ట. హరి ప్రసాద్, రైటర్ ఫోన్: 8790 84 3009





