– ఏడాది లోపే ఇందిరమ్మ ఇళ్ల తాళాలు అందిస్తాం
– సొంతింటి కలను సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యం
– రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 29 : తమది పేదవాడి కష్టం తెలిసిన ఇందిరమ్మ ప్రభుత్వమని, పేద కుటుంబాలకు సొంతింటి కలను సాకారం చేయాలన్న సంకల్పంతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టామని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. పేదవాడు తన జీవితకాలంలో ఒక్కసారైనా సొంత ఇంటిని చూసుకోవాలన్న ఆకాంక్షను నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. క్యూర్/కోర్ ప్రాంతంలో ప్రభుత్వానికి చెందిన వివిధ శాఖల భూములను గుర్తించి వాటిని హౌసింగ్ శాఖకు బదలాయించి పేదల కోసం గ్రౌండ్ ప్లస్ టెన్ అంతస్తుల అపార్టుమెంట్లు నిర్మించాలని నిర్ణయించినట్లు తెలిపారు. నాంపల్లి నియోజకవర్గంలోని రెడ్ హిల్స్‌లో ఇందిరమ్మ టవర్స్ నిర్మాణానికి సహచర మంత్రి అజారుద్దీన్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్‌తో కలిసి మంత్రి పొంగులేటి మంగళవారం శంకుస్ధాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటైన సభలో ఆయన ముఖ్య అతిధిగా ప్రసంగించారు. మహానగరంలో ఎకరం భూమి విలువ రూ.200 కోట్లు, రూ.250 కోట్లు ఉన్నా ఆ భూమి ద్వారా ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చడం కంటే పేద కుటుంబానికి ఒక సొంత ఇల్లు ఇవ్వడమే ప్రజా ప్రభుత్వ ఉద్దేశమని స్పష్టం చేశారు. ఈరోజు పారదర్శకంగా నిర్వహించిన డ్రాలో 480 మంది లబ్దిదారులను ఎంపిక చేశామని, మిగిలిన వారికి రెండో, మూడో, నాలుగో విడతల్లోనూ ఇళ్లు అందిస్తామని తెలిపారు. ఈ ప్రాంతంలోని మొత్తం 20 నియోజకవర్గాల్లో భూములను గుర్తించామని, సుమారు 16-17 ప్రాంతాల్లో టెండర్ ప్రక్రియ పూర్తయిందని, త్వరలోనే నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని చెప్పారు.
ఏడాదిలోపే ఇంటి తాళాలు
ప్రస్తుతం నిర్మిస్తున్న ఒక్కో అపార్టుమెంట్ విలువ సుమారు రూ.80 లక్షల నుంచి రూ.కోటి వరకు ఉంటుందని మంత్రి తెలిపారు. రెండు, మూడు సంవత్సరాల సమయం తీసుకోకుండా ఏడాదిలోపే నిర్మాణాలు పూర్తి చేసి ఇదే వేదిక నుంచి లబ్దిదారులకు ఇంటి తాళాలు అందిస్తానని హామీ ఇచ్చారు. గతంలో మాదిరిగా కేవలం సర్టిఫికెట్లు ఇచ్చి వదిలేయకుండా అవసరమైతే పిల్లల చదువులు, వివాహాలు వంటి కుటుంబ అవసరాల కోసం రుణం పొందే అవకాశం ఉండేలా ఇళ్లను రూపాయి కమీషన్ లేకుండా, రిజిస్ట్రేషన్ చార్జీలు లేకుండా నేరుగా లబ్దిదారుల పేర్లపై రిజిస్ట్రేషన్ చేయించే చర్యలు తీసుకుంటామని చెప్పారు.
డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం
టవర్స్‌లో నివసించే కుటుంబాలకు డ్రైనేజీ సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను అక్కడికక్కడే ఆదేశించారు. నిర్మాణ ప్రాంతంలోని డ్రైనేజీని మెయిన్ ట్రంక్ లైన్‌కు అనుసంధానం చేసే బాధ్యతను హౌసింగ్ శాఖ తీసుకుంటుందని తెలిపారు. ఇళ్ల నిర్మాణంలో లబ్దిదారుల భాగస్వామ్యాన్ని కూడా నిర్ధారిస్తామని చెప్పారు. వారానికి ఒక రోజు లబ్దిదారులకు నిర్మాణ ప్రదేశాన్ని సందర్శించే అవకాశం కల్పించి తమ ఇల్లు నాణ్యతతో నిర్మిస్తున్నారా లేదా అన్నది స్వయంగా పరిశీలించుకునే అవకాశం ఇస్తామని మంత్రి తెలిపారు.
నగరానికి మధ్యలోనే ఇళ్లు కట్టిస్తాం
గత ప్రభుత్వాలు నగరంలో పేదలు నివసించే ప్రాంతాలకు 30-40 కిలోమీటర్ల దూరంలో ఇళ్లు నిర్మించడం వల్ల జీవనోపాధి కోసం వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని మంత్రి విమర్శించారు. పేదల జీవనోపాధి, పిల్లల చదువులు, కుటుంబ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఇళ్ల నిర్మాణ ప్రాంతాలను ఎంపిక చేస్తున్నామని చెప్పారు. ప్రతి తండాలో, ప్రతి గూడెంలో, ప్రతి డివిజన్‌లో, ప్రతి వార్డులో పేదలకు ఇళ్లు నిర్మించి చూపిస్తాం అని మంత్రి స్పష్టం చేశారు. గత ప్రభుత్వం పదేళ్లలో చేసిన ఇళ్ల నిర్మాణం కంటే ప్రజా ప్రభుత్వం తొలి విడతలోనే రెట్టింపు ఇళ్లు నిర్మించి చూపిస్తున్నదని చెప్పారు. పేదల సొంతింటి కలను ఎన్నికల హామీగా కాక ప్రభుత్వ బాధ్యతగా భావించి అమలు చేస్తున్నామని తెలిపారు. ఇప్పటికే ఎంపికైన 480 మందికి మంత్రి అభినందనలు తెలియజేశారు. లక్కీ డ్రాలో విజేతలైన లబ్దిదారులకు మంత్రి పొంగులేటి ఇళ్ల నెంబర్లు కేటాయిస్తూ వారి పేర్లను ప్రకటించారు. మంత్రి చేతుల మీదుగా మాదేసు లత అనే మహిళకు డ్రాలో ఇందిరమ్మ ఎ టవర్‌లోని 801 ఇంటిని కేటాయిస్తూ ప్రకటన చేశారు. కార్యక్రమంలో గృహ నిర్మాణ శాఖ ఎండీ వీపీ గౌతమ్, కలెక్టర్ ప్రియాంక ఆల తదితరులు పాల్గొన్నారు.
——————————————————————————————————————————————————————
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





