– ఎంతటి కరవొచ్చినా నియోజకవర్గాన్ని కాపాడతాం
– ఎమ్మెల్యే కడియం
స్టేషన్‌ఘన్‌పూర్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 26 : ఎల్‌నినో ప్రభావంతో దేశంలో, రాష్ట్రంలో కరవు పరిస్థితులు తాండవిస్తున్న వేళ ప్రతి ఒక్క వర్షపు నీటి చుక్కనూ ఒడిసిపట్టి రైతులకు సాగునీరుగా అందించడమే తమ ప్రథమ కర్తవ్యమని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పష్టం చేశారు. ఇటీవల నియోజకవర్గవ్యాప్తంగా కురిసిన వర్షాలకు రఘునాథపల్లి మండలం శ్రీమన్నారాయణపురం వద్ద వాగులో వరద నీరు వృథాగా పోతుండటాన్ని గమనించిన ఆయన నీటిపారుదల శాఖ అధికారులు, కాంట్రాక్టర్లను అప్రమత్తం చేశారు. వాగు పక్కనే ఉన్న కెనాల్ ద్వారా ఈ వరద నీటిని లింగాల ఘనపూర్ మండలంలోని నవాబ్‌పేట రిజర్వాయర్‌లోకి మళ్లించాలని శుక్రవారం ఆదేశించారు. ఎమ్మెల్యే సూచనలతో రాత్రికి రాత్రే పనులు ప్రారంభం కాగా శనివారం ఉదయమే ఎమ్మెల్యే కడియం నీటి మళ్లింపు పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండుమూడు రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల వాగులో పారుతున్న వరద నీరు వృథా కాకుండా కెనాల్ ద్వారా నవాబ్‌పేట రిజర్వాయర్‌కు మళ్లించే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. దీనివల్ల లింగాల ఘనపూర్, రఘునాథపల్లి మండలాల పరిధిలోని వేలాది ఎకరాల ఆయకట్టుకు పుష్కలంగా సాగునీరు అందుతుందని, పంటలు ఎండిపోకుండా కాపాడుకోవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. కరవు పరిస్థితుల్లో లభించిన ఈ కొద్దిపాటి వరద నీరు రైతులకు సంజీవని లాంటిదని అభివర్ణించారు. గతంలో తాను ఎమ్మెల్యే కాకముందు ఈ ప్రాంతంలో కాల్వలన్నీ పూడిక పేరుకుపోయిన స్థితిలో ఉండేవని, ఎమ్మెల్యే ఆయ్యాకá ప్రత్యేక శ్రద్ధ తీసుకుని పూడిక తొలగించి మరమ్మతులు చేయించానని, దాని ఫలితంగా నేడు నవాబ్‌పేట రిజర్వాయర్ వరకు గోదావరి జలాలను తీసుకెళ్లగలిగాం అని వివరించారు. దేవాదుల ఎత్తిపోతల పథకం కాల్వల ద్వారా రఘునాథపల్లి మండలంలోని దాదాపు అన్ని గ్రామాలకు సాగునీరు అందుతోందని వెల్లడించారు. దేవాదుల ద్వారా నియోజకవర్గానికి గోదావరి జలాలను రప్పించి పంటలను కాపాడుతున్నామని తెలిపారు. రైతులు నీటిని వృథా చేయకుండా జాగ్రత్తగా పొదుపుగా వాడుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత నీటి లభ్యత, వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా రాబోయే యాసంగి సీజన్‌లో రైతులు తప్పనిసరిగా ఆరుతడి పంటలనే సాగు చేయాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మారుజోడు రాంబాబు, కాంగ్రెస్ కమిటీ జిల్లా ఉపాధ్యక్షుడు లింగాల జగదీష్ రెడ్డి, మండల కమిటీ అధ్యక్షుడు గాదె మహేందర్ రెడ్డి, నీటిపారుదల శాఖ అధికారులు, ఇంజనీర్లు, వివిధ గ్రామాల సర్పంచులు, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





