చేత‌కాక‌పోతే పాల‌న నుంచి త‌ప్పుకోవాలి

– అధ్వానంగా విద్య‌, వైద్య రంగాలు
– ప్ర‌భుత్వంపై యుద్ధం ప్ర‌క‌టిస్తున్నాం
– టీఆర్‌ఎస్ చీఫ్  కవిత

హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 26 : రాష్ట్రంలో రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అన్నింటా పూర్తిగా విఫలమైందని తెలంగాణ రక్షణ సేన(టీఆర్‌ఎస్) చీఫ్ కల్వకుంట్ల కవిత విమ‌ర్శించారు. పాలన చేతకాకపోతే బాధ్యతల నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. బంజారాహిల్స్‌లోని పార్టీ కార్యాలయంలో తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి శనివారం పూలమాల వేసి నివాళులర్పించారు. అనంత‌రం విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో విద్య, వైద్య రంగాల అధ్వాన పరిస్థితిపై ప్రభుత్వంపై యుద్ధం ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వ ద‌వాఖాన‌ల్లో పట్టిపీడిస్తున్న సమస్యల కారణంగా రాష్ట్రంలో ఏటా సగటున నాలుగు వేల మంది చిన్నారులు కన్నుమూస్తున్నారని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. 2020-21 లో 6 వేలు, 2022-23 లో 4,933, 2024-25 లో 3,853 మంది పసిపిల్లలు చనిపోయారు.. ఏ జిల్లాలో చూసినా దాదాపు 200 వరకు పిల్లలు చనిపోయిన పరిస్థితి. న్యూయార్క్, డల్లాస్ చేస్తామన్న హైదరాబాద్ లో గతేడాది 1046 మంది పిల్లలు చనిపోయారు అని తెలిపారు. వైద్య రంగానికి 10 శాతం బడ్జెట్ కేటాయిస్తామని చెప్పి కనీసం 5 శాతం కూడా వెచ్చించకపోవడం దారుణమన్నారు. గతేడాది కేటాయించిన రూ.13,192 కోట్లలో రూ.9,242 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని, 11 ఆరోగ్య పథకాలకు గాను ఏడు పథకాలకు పైసా ఇవ్వలేదని విమర్శించారు. ఆరోగ్యశ్రీ కోసం రూ.700 కోట్లు కేటాయిస్తే రూ.140 కోట్లే ఖర్చు చేశారన్నారు. ఆరోగ్యశ్రీ స్కీం పెండింగ్ బకాయిలు రూ.500 కోట్లు ఉంటే పైసా విడుదల చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదిలాబాద్ రిమ్స్, హైదరాబాద్ నిమ్స్, నిలోఫర్ ద‌వాఖాన‌ల పరిస్థితి అత్యంత దయనీయంగా మారిందని కవిత ఆరోపించారు. నిలోఫర్‌లో 200 శాతం బెడ్ ఆక్యుపెన్సీ ఉంటే నిమ్స్‌లో శస్త్రచికిత్స కోసం ఏడు నెలలు నిరీక్షించాల్సి వస్తోందన్నారు. ఆదిలాబాద్ వెళ్లి రిమ్స్ హాస్పిట‌ల్‌ పరిస్థితి సమీక్షించాల్సిన హెల్త్ మినిస్టర్ హెలికాప్టర్ ఫ్యూయల్ అయిపోయిందని గొడవపడి వెళ్లిపోయారే తప్ప రోగులకు సరైన వైద్యం అందించాలని ఆదేశాలు ఇవ్వలేదని కవిత మండిపడ్డారు. ఆదిలాబాద్ రిమ్స్ లో ఎక్కడ చూసిన చెత్తాచెదారమే కనిపించిందన్నారు. రాష్ట్ర మంత్రి, ప్రతిపక్ష నాయకులు ఇటీవల రిమ్స్ ను సందర్శించారని, అక్కడే పరిస్థితి ఇలా ఉంటే మిగతా హాస్పిటల్స్ పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. జిల్లా కలెక్టర్లు ఎందుకు ప్రభుత్వ హాస్పిటల్స్, హాస్టల్స్ విజిట్ చేయడం లేదని ప్రశ్నించారు.

ఆస్తులపై సవాల్.. సిట్‌లన్నీ డైవర్షన్ డ్రామాలు

తన ఎన్నికల అఫిడవిట్‌లో చూపించిన దానికంటే రూపాయి ఎక్కువ ఉన్నట్లు నిరూపిస్తే ఆ ఆస్తిని తిరిగి ఇచ్చేస్తానని కవిత స్పష్టం చేశారు. తన ఫామ్‌హౌస్ అన్ని చట్టబద్ధ అనుమతులతో నిర్మించుకున్నదని, అందులో ఎలాంటి ఎఫ్‌టీఎల్, కబ్జా భూములు లేవని తేల్చిచెప్పారు. కేసీఆర్, కేటీఆర్ ఫామ్‌హౌస్‌లు, ఫోన్ ట్యాపింగ్‌లపై వేసిన ‘సిట్’ లు కేవలం కాలయాపనకేనని, ప్రభుత్వం విఫలమైనప్పుడల్లా డైవర్షన్ రాజకీయాల్లో భాగంగానే వీటిని తెరపైకి తెస్తోందని విమర్శించారు.

ఖైరతాబాద్ ఉప ఎన్నికలో పోటీ

రాబోయే ఖైరతాబాద్ ఉప ఎన్నికలో తమ పార్టీ పోటీ చేస్తుందని కవిత ప్రకటించారు. వేరే పార్టీలో గెలిచిన వ్యక్తికి కాంగ్రెస్ టికెట్ ఇచ్చి పోటీ చేయించడం ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధమని, ప్రజలు కాంగ్రెస్‌కు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి సిరిసిల్ల సభలో నెరేళ్ల బాధితులకు న్యాయం చేసే అంశంపై మాట్లాడాలని డిమాండ్ చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *